పని ప్రదేశాల్లో లింగసమానత్వం విషయంలో ప్రపంచ దేశాలు ఎంతో వెనుకబడి ఉన్నాయి. ఆఫీస్లలో మహిళలపై వివిధ రకాల లైంగిక వేధింపుల కేసులు పెరిగిపోతున్నాయి. లైంగిక వేధింపు అనేది ఒక రకమైన వేధింపు. అనుచితమైన మాటలు, నేరుగా లేదా స్పష్టంగా లైంగిక పదాలను ఉపయోగించడం, లైంగిక ప్రయోజనాల కోసం బహుమతులు ఇస్తానని చెప్పడం.. వంటివన్నీ లైంగిక వేధింపుల కిందకు వస్తాయి. మాటలు, ప్రవర్తన, చేష్టలు, సైగల ద్వారా సైతం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఆఫీసులో, ఇంట్లో, పాఠశాలల్లో, మందిరాల్లో, వివిధ ప్రదేశాల్లో లైంగిక వేధింపుల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి చర్యలకు చట్టం కఠినమైన శిక్షలు విధిస్తోంది.
* ఆఫీసుల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు భారత్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయి?
కార్యాలయాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు భారత్లో ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయి. పని ప్రదేశంలో మహిళల లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2013లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.
* విశాఖ గైడ్లైన్స్ అంటే ఏంటి?
1997లో విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. వీటినే విశాఖ మార్గదర్శకాలు అనేవారు. 2013లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చేంత వరకు ఈ మార్గదర్శకాలనే చట్టంగా భావించేవారు. వీటికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలనే ప్రస్తుతం ఉన్న చట్టంలో చేర్చారు.
* ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది?
చట్టం ప్రకారం నిర్వచించిన అన్ని సంస్థలు, యాజమాన్యాలు, కార్యాలయాలకు ఈ చట్టం వర్తిస్తుంది.
* కార్యాలయంలో లైంగిక వేధింపులు అంటే ఏంటి?
దురుద్దేశంతో తాకడం, శారీరక వేధింపులు, లైంగిక కోరికలను వ్యక్తపరచడం, లైంగికపరమైన మాటలు, వ్యక్తుల లైంగిక ధోరణి, లైంగిక జీవితం గురించి వ్యాఖ్యలు చేయడం, పోర్న్ వీడియోలు చూపించడం, వీటి ద్వారా మహిళలకు ఇబ్బందికరమైన పని వాతావరణాన్ని సృష్టించడం.. వంటివన్నీ లైంగిక వేధింపుల కిందకు వస్తాయి.
* ఆఫీసులో ఫ్లర్టింగ్ చేయడం (సరసాలాడటం) కూడా లైంగిక వేధింపు కిందకు వస్తుందా?
ఎదుటివారి అనుమతి లేకుండా, వారికి ఇబ్బంది కలిగించేలా ఫ్లర్టింగ్ చేయడం, అసౌకర్యానికి కారణమయ్యే సెక్సువల్ కామెంట్లు.. వంటివన్నీ లైంగిక వేధింపుల కిందకు వస్తాయి.
* ఇలాంటి వాటిపై ఫిర్యాదులను గోప్యంగా ఉంచుతారా?
చట్ట ప్రకారం బాధిత మహిళ, ప్రతివాది (రెస్పాండెంట్), సాక్షుల గుర్తింపును, వివరాలను బహిర్గతం చేయడం నిషేధం.
* చట్ట ప్రకారం ఆఫీస్లో ఉద్యోగికి ఉండే హక్కులు ఏంటి?
పని ప్రదేశాల్లో సురక్షితమైన పని వాతావరణం ఉండాలి. వేధింపులకు గురైన వారు ఫిర్యాదు చేయడానికి సులువైన మార్గాలు ఉండాలి. బాధితులకు సహాయం అందించాలి. విచారణ కోసం ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కమిటీ లేదా లోకల్ కమిటీకి అవసరమైన సౌకర్యాలు కల్పించాలి.
* లైంగిక వేధింపులకు చట్ట ప్రకారం ఎలాంటి శిక్ష విధిస్తారు?
పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు పాల్పడేవారికి IPC సెక్షన్ 509 కింద మూడు సంవత్సరాల వరకు శిక్ష లేదా జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ కలిపి విధించే అవకాశం ఉంది.
* మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదును మగవారు దాఖలు చేయవచ్చా?
లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని కేవలం మహిళల కోసమే అమల్లోకి తీసుకొచ్చారు. మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను మాత్రమే ఈ చట్టం పర్యవేక్షిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.