Sleeping Problems: కరోనా కాలంలో నిద్ర విషయంలో ఇలా చేస్తున్నారా..? అయితే, మీలో ఈ సమస్య ఉన్నట్టే..

Sleeping Problems: కరోనా కాలంలో నిద్ర విషయంలో ఇలా చేస్తున్నారా..? అయితే, మీలో ఈ సమస్య ఉన్నట్టే.

Sleeping Problems: కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోంతో రోజు ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదని చాలా మంది అనుకుంటున్నారు. ఇలాంటి వారు.. రోజువారీ పని ఒత్తిడి కారణంగా రాత్రి వేళ ప్రశాంతంగా గడపాలనుకుంటారు. దీని కోసం వాళ్లు చేసే పనులు..అసలు సమస్యను తెస్తున్నాయ్.

  • Share this:
మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చాలామంది వ్యక్తులు రోజులో చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నారు. దినచర్య, రోజువారీ పనులపై నియంత్రణ కోల్పోయినట్లు భావిస్తున్నారు. రోజు ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదని అనుకుంటున్నారు. ఇలాంటి వారు.. రోజువారీ పని ఒత్తిడి కారణంగా రాత్రి వేళ ప్రశాంతంగా గడపాలనుకుంటారు. ఇందుకు నిద్రను వాయిదా వేస్తారు. అయితే ఇది ఒక రకమైన మానసిక సమస్య అని చెబుతున్నారు నిపుణులు. దీన్ని వైద్య పరిభాషలో రివెంజ్ బెడ్ టైమ్ ప్రోక్రాస్టినేషన్ అంటారు. ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం అని అర్థం. బెడ్ టైం ప్రోక్రాస్టినేషన్ లేదా రివెంజ్ బెడ్ టైం ప్రోక్రాస్టినేషన్ అంటే.. కొన్ని కారణాల వల్ల రాత్రి నిద్ర గంటలు లేదా నిద్ర పోయే సమయాన్ని ముందుకు జరపడం. ఈ మానసిక సమస్య ఉన్నవారు.. పగటి పూట చేసే పనులతో రోజుపై నియంత్రణ కోల్పోతున్నామని భావిస్తారు. ప్రతిరోజు ప్రతికూల ఆలోచనలతో గడిచినప్పుడు, తమకు రాత్రి వేళ మాత్రమే ఖాళీ సమయం లభిస్తుంది అనుకుంటారు. దీంతో రాత్రుళ్లు తమకు తాము కొన్ని గంటల సమయం కేటాయించుకుంటూ, ఇష్టమైన పనులు చేయాలనుకుంటారు. ఇలాంటి ఆలోచనల కారణంగా నిద్రపోయే సమయం తగ్గిపోతుంది. లేదా నిద్ర గంటలు మారుతాయి.

* సమస్యకు కారణాలు ఏంటి?
కరోనా తరువాత చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగులు సైతం ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీరిపై తెలియని ఒత్తిడి పెరుగుతోందని అధ్యయనాలు వెల్లడించాయి. మితిమీరిన పనిభారంతో రోజులో తమకు తాము సమయం కేటాయించుకోలేక ప్రశాంతత లేనట్లు ఉద్యోగులు భావిస్తారు. ఇక్కడి నుంచి అసలు సమస్య మొదలవుతుంది. ఆన్‌లైన్ క్లాసుల వల్ల విద్యార్థులు, వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగులు, ఇంటి పనులతో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలు ఈ సమస్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

* సమస్యలో నిజంగానే రివెంజ్ ఉందా?
రోజువారీ షెడ్యూల్ కారణంగా కోల్పోతున్న విశ్రాంతి సమయం కోసం వ్యక్తులు నిద్రను వదులుకుంటారు. అంటే.. ఇతర పనుల కారణంగా కోల్పోయిన ఖాళీ సమయాన్ని నిద్ర గంటలతో భర్తీ చేస్తారు. సోషల్ మీడియాలో గడపడం, సినిమాలు చూడటం, స్నేహితులతో చిట్ చాట్.. వంటి కార్యకలాపాల కోసం ప్రజలు ఎక్కువసేపు మేల్కొని ఉంటారు. తమకు ఇష్టమైన పనుల కోసం నిద్రను పక్కన పెట్టడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఒత్తిడితో కూడిన పనిగంటలు, చిరాకును దూరం చేసుకోవడానికి.. ప్రత్యేకంగా వ్యక్తిగత ఆనందం కోసం నిద్రను తగ్గిస్తారు. ఇక్కడే ‘రివెంజ్’ లేదా ప్రతీకారం అనే భావన కనిపిస్తుంది. ఇలాంటి అవసరాల కోసం నిద్రను వాయిదా వేయడం వల్ల రివెంజ్ బెడ్‌టైమ్ ప్రోక్రాస్టినేషన్ అని ఈ సమస్యకు నిపుణులు నామకరణం చేశారు.

అయితే సోషల్ మీడియాకు బానిసైన వారికోసం మాత్రమే ఈ సమస్యలో రివెంజ్ అనే పదాన్ని చేర్చారు. నిజానికి ఈ మానసిక సమస్యలు మహమ్మారికి ముందు నుంచే ఉన్నాయి. డిజిటల్ వ్యసనాలు ఉన్నవారు సోషల్ మీడియా, ఇతర డిజిటల్ వ్యాపకాల కోసం రాత్రి సమయాన్ని కేటాయిస్తారు. కానీ మహమ్మారి తరువాత బాధితులతో పాటు సమస్య తీవ్రత కూడా పెరుగుతోందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.* రాత్రులపై నియంత్రణ లేకపోతే ఏం జరుగుతుంది?
నైట్ టైమ్ ప్రోక్రాస్టినేషన్ వల్ల స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యలు ఎదురవుతాయి. ఇది ఎక్కువ రోజులు కొనసాగితే, నిద్ర సంబంధ సమస్యలు ఎదురవుతాయి. సిర్కాడియన్ లయలపై కూడా ప్రభావం ఉంటుంది. నిద్ర నుంచి మీరు ఎలా మేల్కొంటున్నారు అనే విషయంపైనే.. నిద్ర సరిపోతుందా లేదా నిద్ర నాణ్యత ఎలా ఉంది అనే విషయాలు తెలుస్తాయి. మగతగా అనిపించడం, గందరగోళంగా ఉండటం, పనులపై దృష్టి పెట్టలేకపోవడం.. వంటివి మానసిక ప్రశాంతత ఎలా ఉందో తెలిపే సాధారణ సంకేతాలు. నిద్రలేమి వ్యక్తుల సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. చిరాకు, సహనం కోల్పోవడం, పనిలో ఉత్పాదకత తగ్గడం, ఏదో కోల్పోతున్నామనే భావన, వంటివన్నీ సమస్య తీవ్రతను చెబుతాయి. అయితే ఈ లక్షణాలన్నీ వేర్వేరు వ్యక్తులలో భిన్నంగా వ్యక్తమయ్యే అవకాశం ఉంది.

* సమస్యకు పరిష్కారాలు ఏంటి?
ఈ సమస్య నుంచి బయటకు రావాలి అనుకునే వారు ముందు డిజిటల్ డివైజ్‌ల వాడకాన్ని అదుపులో పెట్టుకోవాలి. నిద్రకు కనీసం 30 నిమిషాల ముందు వీటిని పక్కన పెట్టాలి. ప్రశాంతతకు భంగం కలిగించే ప్రతికూల వార్తలు, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాఫీలు, టీలు, శీతల పానీయాలు నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందువల్ల వీటి వాడకాన్ని తగ్గించాలి.

వారాంతాల్లో ఎక్కువగా నిద్రపోవడం ద్వారా.. మిగతా రోజుల్లో కోల్పోయిన నిద్రను భర్తీ చేయవచ్చని కొంతమంది భావిస్తారు. ఇది సరైన ఆలోచన కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల స్లీపింగ్ సైకిల్ మరింత ఎక్కువగా దెబ్బతింటుంది. అవసరమైతే ప్రశాంతత కోసం ప్రతి రోజు పవర్ న్యాప్స్ తీసుకోవచ్చు. పగటి పూట 20 నిమిషాల పాటు తీసే కునుకు వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది.

ఆఫీస్ వర్క్‌కు, వ్యక్తిగత పనులకు మధ్య స్పష్టమైన తేడాలను నిర్దేశించుకోవడం ఉద్యోగుల బాధ్యత. ఈ రెండింటికీ వాస్తవిక సరిహద్దులను నిర్ణయించుకుంటే, అసలు సమస్యే ఎదురుకాదు. ఎక్కువ పని ఒత్తిడి వల్ల ఇబ్బంది పడుతున్నట్లు భావిస్తే.. ఈ విషయాన్ని మీ బృందానికి లేదా పై అధికారులకు తెలియజేయాలి. అంతేకానీ మొహమాటానికి ఎక్కువ పనిని నెత్తిమీద వేసుకోవద్దు. ఇలాంటి కొన్ని చిన్నపాటి ముందు జాగ్రత్తలతో పని ఒత్తిడిని దూరం చేసుకుంటూ, మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చు.
Published by:Sridhar Reddy
First published: