Diwali 2020: ఈ దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోండి.. అందుకోసం ఈ చిట్కాలు ప్రయత్నించండి

ప్రతీకాత్మక చిత్రం

దీపావళికి కేవలం పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులనే ఉపయోగించాలని ప్రజలంతా నియమం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. COVID-19 వ్యాప్తిని అరికట్టేలా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ కాలుష్యంతో దీపాల పండుగను పర్యావరణ అనుకూలమైన రోజుగా మార్చడానికి కొన్ని మార్గాలు.. మీకోసం...

  • Share this:
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పండుగగా భావించే దీపావళి పర్వదినం సమీపిస్తోంది. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా ఆ రోజు వేడుకలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఉత్సవంగా పండుగ సంబరాలు జరుపుకుంటారు. దీపావళి సందర్భంగా ప్రజలు ఇంట్లో దీపాలను వెలిగిస్తారు. స్వీట్లు పంచుకుంటారు. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. కొత్త బట్టలు, ఖరీదైన అలంకరణలు, బహుమతులు, టపాసుల సందడి... వంటివి దీపావళికే ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. కానీ ఈ పండుగనాడు అనారోగ్యాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కరోనా మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. మరోవైపు వాతావరణ కాలుష్యం విరుచుకుపడుతోంది.

ఈ నేపథ్యంలో దీపావళి వేడుకలపై ప్రజలు దృష్టి పెట్టాలి. అనారోగ్యాలకు కారణం కాకుండా పండుగ వేడుకలు చేసుకోవాలి. ఇందుకు పర్యావరణ అనుకూల మార్గాలను ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం దీపావళికి కేవలం పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులనే ఉపయోగించాలని నియమం పెట్టుకోవాలి. COVID-19 వ్యాప్తిని అరికట్టేలా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ కాలుష్యంతో దీపాల పండుగను పర్యావరణ అనుకూలమైన రోజుగా మార్చడానికి కొన్ని మార్గాలు.. మీకోసం...

నూనె దీపాలు, LED లైట్లు వాడాలి
పండుగ రోజు దీపాలంకరణకు పర్యావరణ సహిత ఉత్పత్తులనే వాడండి. మట్టి ప్రమిదల్లో నూనె పోసి దీపాలను వెలిగించండి. అవసరమైతే మట్టితో ప్రమిదలను తయారు చేయమని పిల్లలను ప్రోత్సహించండి. వారి సృజనాత్మకతకు పదును పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంటిల్లిపాదీ పండుగ పనుల్లో భాగమైన అనుభూతి కలుగుతుంది. అవసరమైతే నూనెకు సువాసనలు వెదజల్లే ఫ్లేవర్లను కలపండి. అలంకరణకు LED లైట్లు వాడటం మంచిది. వీటిని మళ్లీ ఇతర సందర్భాల్లో వాడుకోవచ్చు. ఇతర లైట్లతో పోలిస్తే ఇవి తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. వీటన్నింటి వల్ల కాలుష్యం తీవ్రత తగ్గుతుంది.

ఇలాంటి ముగ్గులు వేయండి..
రంగురంగుల ముగ్గులు, డిజైన్లు లేకుంటే దీపావళి అసంపూర్తిగానే ఉంటుంది. ఈ అలంకరణల కోసం కృత్రిమ, హానికరమైన రంగులను ఉపయోగించకూడదు. వాటికి బదులుగా రంగురంగుల పూలు, సేంద్రీయ రంగులను అలంకరణకు ఉపయోగించండి.

సేంద్రీయ బహుమతులు 

దీపావళి సందర్భంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు సేంద్రీయ పదార్థాలతో చేసిన బహుమతులు ఇవ్వండి. ప్రియమైన వారికి స్థానికంగా తయారు చేసిన చేతివృత్తుల ఉత్పత్తులను బహుమతులుగా ఇచ్చి, వాటి వాడకాన్ని పెంచేందుకు తోడ్పాటు ఇవ్వండి. హ్యాండ్ మేడ్ సబ్బులు, క్రీములు, ఆర్గానిక్ టీ, స్థానికంగా తయారు చేసిన కుకీలు, చేతి వృత్తుల వారు తయారు చేసే వస్తువులు.. వంటివి బహుమతులుగా ఇవ్వవచ్చు. ఇంటి లోపల పెంచుకునే మొక్కలు, పూల చెట్లు, వెదురు బుట్టలు, కాగితంతో తయారు చేసే సంచులు, చేనేత వస్త్రాలతో రూపొందించే హ్యాండ్ బ్యాగులు.. వంటివి కూడా ఎంచుకోవచ్చు.

ఇంట్లోనే స్వీట్లు
దీపావళి అంటేనే తీపి ఉత్పత్తుల పండుగ అని చెబుతారు. పండుగ రోజు ప్రజలంతా స్వీట్లను పంచుకుంటారు. పండుగ కోసం బయటి నుంచి స్వీట్లు కొనడానికి బదులుగా ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకోవడం మంచిది. కృత్రిమ రంగులు, అనవసర ఫ్లేవర్లు లేకుండా రుచిని పెంచే వివిధ రకాల తీపి పదార్థాలను ఇంట్లోనే సిద్ధం చేసుకొని, అనారోగ్యాలకు దూరంగా ఉండండి.

పర్యావరణ అనుకూల అలంకరణలు
సహజంగా లభించే అందమైన పూలు, మొక్కలు, బంకమట్టి వస్తువులు, వెదురుతో తయారు చేసిన అలంకరణ ఉత్పత్తులు... వంటి వాటితో ఇంటిని అలంకరించండి. ప్లాస్టిక్, పర్యావరణానికి హాని చేసే ఇతర ఉత్పత్తులకు దూరంగా ఉండండి. పాత చీరలు, దుప్పట్లతో రంగురంగుల వాల్ డ్రాప్స్, కర్టెన్లను తయారు చేయవచ్చు. లాంతర్లు, ఇతర డిజైన్ల కోసం రంగులు వేసిన వార్తాపత్రికలు, కలర్ పేపర్లను ఉపయోగించండి. మీ ఇంటిని అలంకరించడానికి పునర్వినియోగానికి పనికొచ్చే వస్తువులను ఎంచుకోండి. ఈ చర్యలను పాటించడం వల్ల కాలుష్యాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణకు మీ వంతు కృషి చేయవచ్చు.
Published by:Nikhil Kumar S
First published: