DIFFERENT CULTURE IN BUDAGA JANGALU COMMUNITY BEFORE MARRIAGE THE GROOM MUST PAY MAIDEN FEES NGS
Andhra Pradesh: పెళ్లి చేసుకోవాలంటే ఆ పని చేయాలి..? విడిపోవాలంటే చెట్టు చాటుకు వెళ్లాలి.. ఇదేం ఆచారం
బుడుగ జంగాల వింత ఆచారం
దేశంలో కోన్ని ఆచారాలు చాలా వింతగా అనిపిస్తాయి.. అలాగే ఏపీ వ్యాప్తంగా ఓ జాతికి చెందిన పెళ్లిళ్ల విషయంలోనూ కొన్ని పద్ధతులు పాటిస్తారు.. కానీ ఆ వింత చూసి.. ఇదేం అచారాలు అని ప్రశ్నిస్తున్నారు కొందరు..
ప్రపంచంలో రకరకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి.. ముఖ్యంగా పెళ్లిల విషయంలో ఒక్కొ దగ్గర ఒక్కో ఆచారం ఉంటుంది. అయితే కొన్ని మాత్రం చాలా వింతగా అనిపిస్తాయి. నేటి ఆధునిక యుగంలో చాలావరకు కట్టుబాట్లు ఆచారాలు కనుమరుగైపోతున్నాయి. సంప్రదాయాలు పక్కన పెట్టి సింపుల్ గా పెళ్లి చేసుకునేందుకే యువత మొగ్గు చూపుతున్నారు.. అయితే చాలా చోట్ల రోజు రోజుకూ పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు అయితే రెట్టింపు అవుతోంది. కరోనా కాటు పక్కన పెడితే.. సాధారణంగా వివాహాల కోసం చాలా వరకు ఖర్చలు చేస్తుంటారు. కొందరు ఆస్తులు అమ్మైనా గ్రాండ్ గా పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. కానీ సంప్రదాయాల గురించి చాలామంది మరిచిపోతున్నారు. ఇలాంటి సమయంలోనూ కొందరు తూచా తప్పకుండా ఆనవాయితీని కొనసాగిస్తున్నారు..
పెళ్లి చేసుకోవాడానికే కాదు.. మనస్పర్థలు వచ్చి విడిపోవాలన్నా మరీ వింత వింత కండిషన్లు ఉన్నాయి. ఈ కాలంలోనూ ఇలాంటి ఆచారాలు ఫాలో అవుతారా అని అనుమానం రావచ్చు.. కానీ 100కు 100 శాతం ఫాలో అవుతున్నారు కొందరు. ఏపీ వ్యాప్తంగా బుడగ జంగాల్లో ఓ వింత ఆచారం ఉంది. అదే కన్యాశుల్కం.. దీన్నే లగ్గసిరి కూడా అంటారు. పెళ్లి సమయంలో వధువుకు వరుడిచ్చే కట్నం. నేటి ఆధునిక కాలంలో ఈ సంప్రదాయం కనుమరుగైనప్పటికీ.. బుడగ జంగాల్లో మాత్రం నేటికీ కొనసాగుతోంది. అయితే అలా ఎంత ఇస్తారో తెలుసా..?
ఓలీగా పిలిచే ఈ ఆచారం ప్రకారం.. వివాహం నిశ్చమయ్యాక వరుడు 9 రూపాయలు ఎదురు కట్నంగా సమర్పించుకోవాల్సిందే. ఇందులో 4 రూపాయలు వధువుకు, మిగిలిన 5 రూపాయలు భవిష్యత్లో సమస్య వస్తే పరిష్కరించే ఐదుగురు కుల పెద్దలకు ఇస్తారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తే పోలీస్ స్టేషన్లకు వెళ్లరు. విడిపోవాలనే నిర్ణయానికి వస్తే కోర్టుకు వెళ్లి భరణం అడగరు. కుల పెద్దల ఎదుట పంచాయితీ పెట్టి సమస్య పరిష్కరించుకుంటారు.
దాని కోసం కూడా ఓ వింత ఆచారం పాటిస్తారు. భార్య నుంచి భర్త.. భర్త నుంచి భార్య కూడా విడాకులు కోరవచ్చు. విడాకులు పొందాక ఏడు పెళ్లిళ్ల వరకు చేసుకునే ఆచారం వీరిలో ఉంది. విడిపోవాల్సి వస్తే భార్యాభర్త, కులపెద్ద, అమ్మాయి తల్లి సమీపంలోని చెట్టు చాటుకు వెళ్తారు. భర్త మొహంపై భార్య ఊసిన తరువాత పావలా అయితే వారి స్తామత బట్టి ఎంత మొత్తమైనా ఇస్తారు. భార్య చీర కొంగులో కట్టి ఎడమ చేత్తో తాళిని తెంచేస్తాడు. దీంతో విడాకులు పొందినట్టే.
నేటి ఆధునిక కాలంలోనూ బుడగ జంగాలు అక్షరాస్యతకు దూరంగా ఆచారాలు, కట్టుబాట్లతో జీవనం సాగిస్తున్నారు. ఊరూరా తిరిగే సంచారజాతికి చెందిన వీరు ఊరి బయట గుడిసెలు వేసుకుని జీవిస్తుంటారు. పూర్వం బుర్రకథలు, ఎల్లమ్మ, బాలనాగమ్మ, అరేవాండ్ల, చిన్నమ్మ, దేశంగిరాజు కథలు చెబుతుండేవారు. బుర్రకథలకు కాలం చెల్లడంతో కాళ్లకు గజ్జెకట్టి తంబుర, గుమ్మెట వాయిస్తూ వినరా భారత వీర రాజకుమారా.. బొబ్బిలి రాజు కథ అంటూ పాటలు పాడుతూ యాచనతో జీవనం సాగిస్తున్నారు. పండుగలు, జాతరలు, తిరునాళ్లలో వివిధ వేషధారణలతో అలరిస్తున్నారు. కొందరు మాత్రం ఈతాకు చాపలు అల్లడం, పాత బట్టలు, బుడగలు, పిన్నీసులు, ప్లాస్టిక్ బిందెలు విక్రయించడం ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఏపీ వ్యాప్తంగా 65 వేల బుడగ జంగాల కుటుంబాలు ఉన్నాయి. రాయలసీమలో 45 వేల కుటుంబాలు ఉండగా.. ఒక్క కర్నూలు జిల్లాలో 27,500 కుటుంబాల వరకు ఉన్నాయి. సంచార జాతికి చెందిన వీరికి 2010 వరకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ షెడ్యూల్డ్ సవరణ చట్టం–2002 అమల్లోకి వచ్చింది. బుడగ జంగాల సమస్యను గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం వీరి సంక్షేమానికి ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. కుల ధ్రువీకరణ స్థానంలో వారి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని జగనన్న చేయూత పథకాన్ని వర్తింప చేస్తోంది. 45 ఏళ్లు నిండిన మహిళలందరికీ ఏటా రూ.18,750 చొప్పున అందజేస్తోంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.