సాధారణంగా రక్తపోటు (Blood pressure- BP) కొలిచేందుకు ఏదో ఒక చెయ్యికి పట్టీ వేసి స్మిగ్మోమానోమీటర్ సాయంతో రీడింగ్ చూస్తారు. కానీ రెండు చేతులకూ విడివిడిగా చూసినప్పుడు బీపీ రీడింగ్‌లో తేడాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలా కొలిచినప్పుడు బీపీలో నమోదయ్యే తేడాలు గుండెపోటుకు సంకేతం కావచ్చని ఓ అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదికను హైపర్‌టెన్షన్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ పరిశోధన కోసం ప్రపంచ వ్యాప్తంగా సేకరించిన 24 అధ్యయనాలను విశ్లేషించారు. ఇప్పటి నుంచి బీపీ చూసుకునేవారు రెండు చేతులతోనూ సిస్టోలిక్ రీడింగ్ చూసుకోవాలని అధ్యయన బృంద సభ్యుడు డాక్టర్ క్రిస్ క్లార్క్ తెలిపారు. ఆయన బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ మెడికల్ స్కూల్ క్లినికల్ సంస్థలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.
పెరగనున్న ప్రమాదం
బీపీని మిల్లీమీటర్లలో కొలుస్తారు. రెండు చేతుల బీపీ రీడింగ్‌లో పది మిల్లీమీటర్లకు మించి తేడాలు ఉండే.. ఒక్కో డిగ్రీ పెరుగుదలకు ఛాతిలో నొప్పి, గుండెపోటు వచ్చే ప్రమాదం వచ్చే ఒక శాతం పెరుగుతుందని ఈ అధ్యయనం కనుగొంది. రెండు చేతుల బీపీ రీడింగ్‌లో ఐదు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ తేడా ఉంటే.. వారికి గుండె సంబంధ సమస్యలు ఉన్నాయని భావించాలని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడానికి రెండు చేతులతో బీపీ చూసుకోవాలని తెలిపారు.
సిస్టోలిక్ రీడింగ్ తేడాలు
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 120/80 సిస్టోలిక్ రీడింగ్‌ను సాధారణ రక్తపోటుగా గుర్తించింది. రెండు చేతుల రీడింగ్‌లో 10 మిల్లీమీటర్ల వరకు హెచ్చుతగ్గులు ఉన్నా పెద్దగా ప్రభావం ఉండదని ఆ సంస్థ తెలిపింది. కానీ మరీ ఎక్కువ తేడాలు ఉంటే గుండె ధమనులు మూసుకుపోవడం లేదా గట్టిపడటానికి సంకేతంగా భావించాలి. ఇది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌లో ఈ రీడింగ్‌లో 15 ఎంఎం లేదా అంతకంటే ఎక్కవ తేడాలుంటే ప్రమాదమని గుర్తించాయి. అధ్యయనంలో గుర్తించిన తేడాల ఆధారంగా బీపీకి సంబంధించిన అంతర్జాతీయ మార్గదర్శకాలను సవరించాలని నిపుణులు చెబుతున్నారు.
బీపీ ఎలా చూడాలంటే..
అనారోగ్యాలు ఉన్నవారు, ఇంతకు ముందే సర్జరీలు చేయించుకున్నవారు బీపీ కొలిచే పరికరాలను సరిగా వాడాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) చెబుతోంది. మణికట్టు వద్ద కాకుండా మోచేతి పైభాగంలో పట్టీ వేసి బీపీ చూసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో బీపీ కొలవాలి. అంతకు అరగంట ముందు వరకు స్మోక్ చేయకూడదు. కెఫిన్ ఉండే కాఫీలు, ఇతర డ్రింక్స్ తాగకూడదు. వ్యాయామం చేయవద్దు. మూత్రానికి వెళ్లకుండా ఆపుకోవద్దు. బీపీ చూసేటప్పుడు సోఫాలో కాకుండా మామూలు కుర్చీపై కూర్చోవాలి. దీంతో పాటు చెయ్యిని కిందకు వదిలేయకుండా టేబుల్‌పైన పెట్టాలి. ఒక్కో చెయ్యికి రెండు లేదా మూడుసార్లు బీపీ చూసి, వచ్చే రీడింగ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని AHA సూచిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Blood pressure, Health Tips