మానసిక సమస్యల్లో డిప్రెషన్ లేదా కుంగుబాటు ఒక ప్రమాదకరమైన సమస్య. దీని బారిన పడినవారు ఇతర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల సెలబ్రిటీలు ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు ముందుకు వస్తున్నారు. తాము కుంగుబాటు నుంచి బయటపడ్డ సందర్భాలను వారు వివరిస్తున్నారు. దీంతో కుంగుబాటు గురించి సాధారణ ప్రజలకు అవగాహన పెరుగుతోంది. సోషల్ మీడియా ద్వారా డిప్రెషన్‌పై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించేవారు కూడా ఉన్నారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి చికిత్స అందించకపోతే, దీని తీవ్రత ఎక్కువ అవుతుంది. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే లక్షణాల్లో ఇవన్నీ భాగంగా ఉంటాయి. చాలామంది చిన్నపాటి భావోద్వేగపరమైన సమస్యలను కూడా డిప్రెషన్గానే భావిస్తారు. కానీ విచారంగా లేదా బాధగా ఉండటానికి, డిప్రెషన్‌కు చాలా తేడాలున్నాయి.
బాధగా, విచారంగా ఉండటం అనేది డిప్రెషన్ లేదా కుంగుబాటులో అంతర్భాగం. కానీ కేవలం బాధ వల్లనే ఎవరూ డిప్రెషన్‌కు గురవ్వరు. ఈ రెండూ వేర్వేరు భావోద్వేగ పరమైన సమస్యలు. వీటి మధ్య తేడాలను గుర్తించగలిగినప్పుడే, మానసిక సమస్యలను గుర్తించి చికిత్స తీసుకోగలుగుతారు. బాధ అనేది ఒత్తిడి, దుఃఖ౦తో ఉన్నప్పుడు అనుభవి౦చే సాధారణ భావోద్వేగం. మనం బాగా ప్రేమించే, ఇష్టపడే వ్యక్తులు దూరమవ్వడం, చనిపోవడం, ఉద్యోగాలు పోవడం, ఆదాయం కోల్పోవడం, కుటుంబ సమస్యలు వంటివన్నీ మన మూడ్‌ను దెబ్బతీస్తూ, బాధను కలిగిస్తాయి. పరీక్షలో ఫెయిల్ కావడం, మంచి ఉద్యోగం దొరక్కపోవడం, ఇతర నిరాశాకర సంఘటనల వల్ల కూడా బాధ కలుగుతుంది.
బాధను దూరం చేసుకోవచ్చు
ఎక్కువగా బాధను అనుభవించేవారు ఏడవడం, ఫ్రస్ట్రేషన్ గురించి మాట్లాడటం, స్నేహితులతో చర్చించడం ద్వారా బాధను తగ్గించుకొని, ఉపశమనం పొందుతారు. ఇది తాత్కాలిక భావన. కానీ డిప్రెషన్ దీర్ఘకాలంగా వేధిస్తుంది. ఎక్కువ రోజులు బాధను అనుభవించడం, దీర్ఘకాలం పాటు విచారంగా ఉండటం వంటివి డిప్రెషన్‌కు సంకేతాలు. కుంగుబాటుకు గురైన వ్యక్తులు ఎక్కువ బాధను అనుభవిస్తారు. కానీ ఈ సమస్య తీవ్రంగా ఉన్నవారిలో కూడా నవ్వడం లేదా ఓదార్చడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిలో ఉండే ఫీలింగ్స్, వారి జీవితంలోని అన్ని కోణాలను ప్రభావితం చేస్తాయి.
డిప్రెషన్‌ను ఎలా గుర్తించాలి
డిప్రెషన్‌కు గురైనవారు సంతోషం, ఆనందాన్ని పొందలేరు. నిద్రలేమి, నిద్ర వేళల్లో మార్పులు, ఆకలి లేకపోవడం, విపరీతమైన బాధ, అలసట, ఆందోళన, అలసట, ప్రశాంతత లేకపోవడం వంటివన్నీ డిప్రెషన్‌కు సంకేతాలు. ఏ పనిమీదా ఏకాగ్రత కుదరకపోవడం, చిరాకు, ఆసక్తి లేకపోవడం, ఉత్సాహం కోల్పోవడం, తీవ్రమైన అపరాధ భావన వంటి సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటారు. సమస్య తీవ్రమైనప్పుడు ఆత్మహత్యకు కూడా వెనుకాడరు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Almonds Health Benefits, Ayurvedic health tips, Depression, Health benefits and secrets, Women health