Home /News /life-style /

DENTAL HYGIENE FROM THE SMELL OF ONES BREATH TO THE COLOUR OF TONGUE AND STATE OF GUMS CAN DETECT OF YOUR OVERALL HEALTH GH SRD

Dental Hygiene: నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు వేధిస్తున్నాయా..? అయితే, మీరు డేంజర్ లో పడినట్టే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dental Hygiene: నోటి దుర్వాసన, చిగుళ్ల ఆరోగ్యం, నాలుక రంగు వంటివి అనారోగ్యానికి సంకేతాలు. ఇలాంటి లక్షణాల ద్వారా వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని త్వరగా గుర్తించవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
నోటి శుభ్రతతో (Dental Hygiene) వివిధ రకాల ఆరోగ్య సమస్యలను అంచనా వేయొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నోటిలో కనిపించే వివిధ సంకేతాల ద్వారా అనారోగ్యాల లక్షణాలను ముందే గుర్తించవచ్చు. నోటి దుర్వాసన, చిగుళ్ల ఆరోగ్యం, నాలుక రంగు వంటివి అనారోగ్యానికి సంకేతాలు. ఇలాంటి లక్షణాల ద్వారా వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని త్వరగా గుర్తించవచ్చు. దీనివల్ల ముందే చికిత్స అందించి ప్రమాదాలను అరికట్టవచ్చు. నోటిలో కనిపించే కొన్ని లక్షణాలు ఎలాంటి అనారోగ్యాలకు సంకేతాలో తెలుసుకుందాం.

* నోటి పూత
నోటి పుండ్లు సాధారణంగా హాని చేయనివి. కొన్ని రోజులు లేదా వారాలలో నయం అవుతాయి. బుగ్గలు కొరకడం, సరిగ్గా సరిపోని కట్టుడు పళ్ళు, సోడియం లారిల్ సల్ఫేట్ కలిగిన టూత్‌పేస్టులు వంటి కారణాలతో నోటి పూత వస్తుంది. నోటి పుండ్లు హార్మోన్ల మార్పులు, బి విటమిన్లు, జింక్, ఐరన్ లోపాలను కూడా సూచిస్తాయి. చేయి, పాదం, నోటి వ్యాధి, నోటి లైకెన్ ప్లానస్, క్రోన్స్‌ వ్యాధి, HIV లేదా లూపస్ వంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వల్ల కూడా సంభవించవచ్చు.

* తెల్లని నాలుక
నాలుకపై కొద్దిగా తెల్లటి పూత ఉండటం సాధారణం. అయితే, కొన్నిసార్లు ఈ పూత క్యాన్సర్‌కు సూచన కావచ్చు. అసాధారణమైన తెల్లని మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తెల్ల నాలుక అనేది ఓరల్ లైకెన్ ప్లానస్ లేదా ఓరల్ థ్రష్, జియోగ్రాఫిక్‌ టంగ్‌ వంటి తక్కువ తీవ్రమైన పరిస్థితికి కూడా సంకేతం కావచ్చు. ఇవి STI సిఫిలిస్‌కి కూడా కారణం కావచ్చు. దీనిని తీవ్రంగా పరిగణించాలి, త్వరగా చికిత్స చేయాలి. సిఫిలిస్‌కు చికిత్స చేయకుండా వదిలేస్తే, అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

* నోటి మూలల్లో పగుళ్లు
నోటి ద్వారా కనిపించే మరొక ఆరోగ్య సమస్య నోటి మూలలో పగుళ్లు. ఇవి ఇనుము, జింక్ లేదా బి విటమిన్ల లోపానికి సంకేతం. ఈ పగుళ్లు జీర్ణవ్యవస్థలో సమస్య ఉన్నట్లు కూడా సూచిస్తాయి. ఇన్ఫ్లమేటరీ డైజెస్టివ్ డిజార్డర్స్, క్రోన్స్‌ లేదా ఉల్కరేటివ్‌ కోలిటిస్‌కు సంకేతాలు కావచ్చు. విటమిన్‌లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా పగుళ్లను నయం చేయవచ్చు. ఈ సంకేతాలు ఏదైనా హానిచేయని లేదా తీవ్రమైన వ్యాధులకు సంకేతాలు కావచ్చు కాబట్టి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి : రుచిగా చికెన్‌ను తింటూ బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే..మీకోసమే ఈ రెసిపీలు..

* దుర్వాసన
నోటి దుర్వాసనను ఆరోగ్యంలో లోపాలకు సంకేతంగా చూడవచ్చు. పేలవమైన నోటి పరిశుభ్రత లేదా తిన్న ఆహార పదార్థాల ద్వారా తాత్కాలికంగా నోటి దుర్వాసన రావచ్చు. తరచూ ఈ సమస్య ఉంటే అది చిగుళ్ల వ్యాధికి సంకేతం కావచ్చు. ముక్కు, సైనస్ లేదా గొంతులో వాపు కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. కొన్ని క్యాన్సర్ల వంటి వ్యాధులు, జీవక్రియ రుగ్మతలు వంటి పరిస్థితులు కూడా దుర్వాసనను కలిగిస్తాయి. కడుపులోని ఆమ్లాల రిఫ్లక్స్‌కి కూడా దుర్వాసనతో సంబంధం ఉంటుంది.

* చిగుళ్లలో రక్తస్రావం
చిగుళ్లు పాలిపోయినట్లు కనిపించినా లేదా బ్రష్ చేసినప్పుడు రక్తస్రావం అయినా, అది చిగుళ్ల వ్యాధికి సంకేతం కావచ్చు. ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు. చిగుళ్ల వ్యాధి ఉన్న రోగులు గుండెపోటు లేదా స్ట్రోక్‌ను అనుభవించే అవకాశం రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధమనులు గట్టిపడటానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడానికి దారితీసే వాపు వల్ల చిగుళ్ల వ్యాధి సంభవించవచ్చు. చిగుళ్ల వాపు లేదా రక్తస్రావం విటమిన్ లోపానికి కూడా సంకేతం. మల్టీవిటమిన్, ఒమేగా-3 ఫిష్ ఆయిల్ తీసుకోవడం ద్వారా పోషకాహార లోపాలు దూరమవుతాయి.

* వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి
ఈ లక్షణాలలో ఏవైనా కొన్ని వారాల కంటే ఎక్కువ కాలం ఉంటే, వైద్యుడిని లేదా దంతవైద్యుడిని సంప్రదించడం మంచిది. ఈ లక్షణాలు తేలికపాటివిగా అనిపించవచ్చు. కానీ లోతైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కూడా కావచ్చు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Cancer, Dental care, Health care, Health Tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు