Alert: పసిప్రాణాలు తీసిన నిర్లక్ష్యం... పిల్లలు జాగ్రత్త

Alert | సీసీ కెమెరాలో రికార్డ్ కాని ప్రమాదాలెన్నో జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలాన్నింటినీ ఓసారి పరిశీలిస్తే... పసివాళ్ల ప్రాణాలు పోవడానికి ఒకే ఒక్క కారణం కనిపిస్తోంది. అదే నిర్లక్ష్యం.

Santhosh Kumar S | news18-telugu
Updated: April 26, 2019, 11:30 AM IST
Alert: పసిప్రాణాలు తీసిన నిర్లక్ష్యం... పిల్లలు జాగ్రత్త
పసిప్రాణాలు తీసిన నిర్లక్ష్యం... మీ పిల్లలు జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
చిన్న నిర్లక్ష్యం... ఏం కాదులే అన్న నిర్లిప్తత... కాస్త అజాగ్రత్త... చివరకు ఓ నిండు ప్రాణం తీస్తుందంటే నమ్మలేం. కానీ జరిగిన దారుణాలు... జరుగుతున్న ప్రమాదాలు చూస్తే చిన్న నిర్లక్ష్యమే తీరని విషాదానికి కారణమవుతున్నాయని గుర్తించక తప్పదు. మొన్న ఢిల్లీలో ఓ వ్యక్తి నిర్లక్ష్యం పసివాడి ప్రాణం తీస్తే... ఇటు హైదరాబాద్‌లో మరొకరి నిర్లక్ష్యం మరో చిన్నారిని బలితీసుకుంది. అంతకుముందు ఇదే హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే కన్నవాళ్లకు శోకాన్ని మిగిల్చింది. ఈ మూడు ఘటనల్లో నిర్లక్ష్యం, అజాగ్రత్తే పసివాళ్లను బలితీసుకుందని అర్థమవుతోంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో గల హైదర్‌గూడ... అక్కడి జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఓ పార్క్... రోజులాగే ఆ పార్కులో పిల్లల సందడి. ఆరేళ్ల బిశాన్ శర్మ ఎప్పట్లాగే పార్కుకు వచ్చాడు. ఆడుకున్నాడు. అక్కడే ఉన్న సిమెంట్‌ బెంచ్‌పై కూర్చున్నాడు. విరిగి ఉన్న సిమెంట్ బెంచ్‌పై కూర్చోగానే ఊయలలా ఊగింది. విరిగిన బెంచ్ ప్రమాదానికి కారణమవుతుందని తెలియని బాలుడు... బెంచ్‌పై ఊగాడు. క్షణాల్లో ఆ బెంచ్ తిరగబడింది. బాలుడి మెడ విరిగింది. అప్పటివరకు ఆడుకుంటూ కనిపించిన బాలుడు క్షణాల్లో విగతజీవిగా మారాడు. అక్కడే ఉన్నవాళ్లు వచ్చి బెంచీ తొలగించినా... అప్పటికే తీవ్రగాయాలు కావడంతో ప్రాణాలొదిలాడు. ఆ బాలుడి ప్రాణం పోవడానికి కారణం విరిగిపోయిన బెంచ్. విరిగిన బెంచ్ పార్కులో ఉండటానికి కారణం... అపార్ట్‌మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

accident, accident in cc camera, delhi car accident, hyderabad accident in park, hyderguda janapriya apartment accident, accident in gated community, boy killed in accident, ప్రమాదం, రోడ్డు ప్రమాదం, సీసీ కెమెరా దృశ్యాలు, సీసీ కెమెరా వీడియో, ఢిల్లీ కార్ యాక్సిడెంట్, జనప్రియ పార్క్ ప్రమాదం, బాలుడు మృతి
ప్రతీకాత్మక చిత్రం


న్యూ ఢిల్లీలోని భరత్ నగర్ ప్రాంతం. సోమవారం ఉదయం మూడేళ్ల బాలుడు తన బంధువు కార్‌లో ఇంటికి వచ్చాడు. బాలుడిని ఇంటి దగ్గర వదిలి పెట్టిన మహ్మద్‌... ఆ చిన్నారి కారు దిగి ఇంట్లోకి వెళ్లేంత వరకు గమనించలేదు. బాలుడు కారు దిగగానే ఓ వైపు ఫోన్ చూసుకుంటూ కారును డ్రైవ్ చేశాడు. చూసుకోకుండా బాలుడిపైకి కారు ఎక్కించాడు. ఆ చిన్నారి తల, ఛాతీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినా లాభం లేదు. చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారణమైన మహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే... ఆ సమయంలో తాను మొబైల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నానని, ముందు చూసుకోకుండా డ్రైవ్ చేశానని సింపుల్‌గా సమాధానం చెప్పేశాడు. ఆ వ్యక్తి నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ ప్రమాదం వీడియో ఇదే.

సరిగ్గా ఇలాంటి నిర్లక్ష్యమే రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో ఓ పసివాడి ప్రాణం తీసింది. నార్సింగి సమీపంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ. అందులో ఓ పార్కు. స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న మౌనీష్... బాల్ కోసం వెళ్తూ రోడ్డు పక్కనే ఉన్న స్తంభాన్ని పట్టుకున్నాడు. అండర్‌ గ్రౌండ్‌లో ఉన్న కరెంట్ వైర్లు పోల్‌కు కనెక్ట్ అయి ఉండటంతో కరెంట్ పాస్ అవుతోంది. స్తంభాన్ని పట్టుకున్న బాలుడు అలాగే నిలబడిపోయాడు. క్షణాల్లో ప్రాణాలు వదిలాడు. చుట్టుపక్కన ఉన్నవాళ్లెవరూ కొంతసేపటివరకు ఆ ప్రమాదాన్ని గుర్తించలేదు. గుర్తించే ఆ బాలుడు ప్రాణాలతో లేడు. గేటెడ్ కమ్యూనిటీ సిబ్బంది నిర్లక్ష్యమే ఆ బాలుడి మరణానికి కారణమన్న విమర్శలొచ్చాయి.

accident, accident in cc camera, delhi car accident, hyderabad accident in park, hyderguda janapriya apartment accident, accident in gated community, boy killed in accident, ప్రమాదం, రోడ్డు ప్రమాదం, సీసీ కెమెరా దృశ్యాలు, సీసీ కెమెరా వీడియో, ఢిల్లీ కార్ యాక్సిడెంట్, జనప్రియ పార్క్ ప్రమాదం, బాలుడు మృతి
ప్రతీకాత్మక చిత్రం


ఈ మూడు ఘటనలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో ఈ ప్రమాదాలపై జనంలో చర్చ జరుగుతోంది. ఇలా సీసీ కెమెరాలో రికార్డ్ కాని ప్రమాదాలెన్నో జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలాన్నింటినీ ఓసారి పరిశీలిస్తే... పసివాళ్ల ప్రాణాలు పోవడానికి ఒకే ఒక్క కారణం కనిపిస్తోంది. అదే నిర్లక్ష్యం. పార్కులో విరిగిన బెంచీని బాగుచేయకుండా వదిలేయడం నిర్లక్ష్యం. సెల్‌ఫోన్ ఆపరేట్ చేస్తూ కారు డ్రైవ్ చేయడం నిర్లక్ష్యం. గేటెడ్ కమ్యూనిటీలో రోడ్డు పైన కరెంట్ వైర్లు ప్రమాదకరంగా వదిలేయడం నిర్లక్ష్యం. నవమాసాలు మోసి, కని పెంచిన పిల్లల ప్రాణాలు ఇలా నిర్లక్ష్యం కారణంగా గాల్లో కలిసిపోవడం ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే. పిల్లల ప్రాణాలు పోయిన తర్వాత బాధ్యులెవరు? తప్పెవరిది? అని విచారణలు జరిపి, దర్యాప్తులు జరపడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగిరావు. కన్నవాళ్ల శోకం తీరదు. అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం.

Photos: రెడ్‌మీ 7 రిలీజ్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా...

ఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డులో తప్పుల్ని సరిచేసుకోండి ఇలా...

JIO New Plans: జియో ప్లాన్స్ ధరలు తగ్గాయి... రూ.149 ప్లాన్‌తో 42 జీబీ డేటా

Tata Sky New Packs: డీటీహెచ్ ప్లాన్స్‌ ధరల్ని తగ్గించిన టాటా స్కై... కొత్త తెలుగు ప్యాక్స్ ఇవే
Published by: Santhosh Kumar S
First published: April 26, 2019, 11:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading