Home /News /life-style /

COVID VACCINATION IMPORTENT ROLE TO STOP 3RD WAVE IN INDIA

కొవిడ్-19 థర్డ్ వేవ్ ముప్పు.. ఈ టైంలో ర్యాపిడ్ ఇమ్యునైజేషన్ అవసరం

Rapid immunization

Rapid immunization

రానున్న భవిష్యత్తు తరాల కోసం ఇలాంటి ఉపద్రవాలతో మనం పోరాడాలి, అందుకు వ్యాక్సినేషన్ మాత్రమే మనకు ఉన్న ఏకైక ఆయుధం

    జూన్ 28 నాటికి, భారతదేశంలో 32,36,63,297 కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు ఇవ్వబడ్డాయి. అంటే ఇవ్వబడిన మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య విషయంలో మనం USను దాటేశామని అర్థం. ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే, భారతదేశంలో ఈ ఏడాది జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది, కానీ USలో మాత్రం గతేడాది డిసెంబర్ 14న ప్రారంభమైంది. దేశంలో ఇటీవలి సెకండ్ వేవ్ పరిస్థితులను, ప్రజారోగ్య అవస్థాపన మీద దాని ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటే ఇన్ని వ్యాక్సినేషన్లు వేసిన ఘనత సాధించడం సాధారణ విషయం కాదు. అయినప్పటికీ, వ్యాక్సినేషన్ తీసుకున్న వారితో పోలిస్తే వ్యాక్సినేషన్ తీసుకోవడానికి అర్హత ఉండి కూడా తీసుకోనివారి శాతం ఎక్కువగా ఉంది.

    భారతదేశంలో థర్డ్ వేవ్ రాబోతోందని ఆరోగ్య నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. మరో 6-8 వారాల్లో వస్తుందని కొందరు, సెప్టెంబర్ – అక్టోబర్ మధ్యలో వస్తుందని ఇంకొందరు అంచనా వేస్తున్నారు. థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది, దాని ప్రభావం ఎంత ఉండబోతోందనేది వైరస్ మ్యూటేషన్, వ్యాప్తి, మనుషుల ప్రవర్తన, వ్యాక్సినేషన్ స్థాయుల మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు వస్తుందనే విషయంతో సంబంధం లేకుండా, థర్డ్ వేవ్ కోసం అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు, సామాజిక స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు సిద్ధంగా ఉండాలి.

    రానున్న భవిష్యత్తు తరాల కోసం ఇలాంటి ఉపద్రవాలతో మనం పోరాడాలి, అందుకు వ్యాక్సినేషన్ మాత్రమే మనకు ఉన్న ఏకైక ఆయుధం. అందుబాటులో ఉన్న కొవిడ్-19 వ్యాక్సిన్లతో వైరస్ వ్యాప్తి, ప్రభావాలు వ్యాక్సిన్, ప్రదేశం, వైరస్ వేరియంట్లను బట్టి మారినా, అన్ని వ్యాక్సిన్లు ప్రాణాలను కాపాడగలుగుతాయి. మొదటి డోసు వ్యాక్సిన్ మాత్రమే తీసుకున్న వారికి కూడా వైరస్ సోకితే వారు హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని ఆధారాలు ఉన్నాయి. ఏమాత్రం రక్షణ లేకపోవడం కంటే ఎంతో కొంత రక్షణ ఉండటం మంచిదే కదా. నిజానికి, కొన్ని సందర్భాల్లో చావుబతుకుల మధ్య ఈ తేడానే కీలకంగా నిలుస్తోంది.

    భారతదేశం విషయానికి వస్తే, ఇక్కడ తక్కువ వ్యాక్సినేషన్ రేటు, డెల్టా వేరియంట్ ప్రవేశంతో ఎక్కువ ఆందోళన కలుగుతోంది. మన దగ్గర ఇంకా 0-18 ఏళ్ల వయస్సు ఉన్న వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించలేదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందరికీ త్వరగా వ్యాక్సినేషన్ ఇవ్వడం కుదరకపోతే మనం హెర్డ్ ఇమ్యూనిటీ సంపాదించడం కష్టమే అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ కొనుక్కొని వేసుకోలేని వారికి చేరువయ్యేలా మనం వ్యాక్సినేషన్ ఇచ్చే వేగాన్ని పెంచడం చాలా అవసరం. అలాగే ప్రభుత్వం అందించే ఉచిత వ్యాక్సినేషన్‌ను మారుమూల గ్రామాలకు, అర్బన్ మురికి వాడలకు చేరేలా చేయడం ఇప్పటికే సవాలుగానే ఉంది. సాంకేతిక అందుబాటులో లేకపోవడం, వ్యాక్సిన్ వేసుకోవడం పట్ల నిరాసక్తి, తక్కువ అవగాహన లాంటి సమస్యలను పట్టించుకోవాల్సి ఉంది.

    ఓవైపు వ్యాక్సినేషన్ల సామర్థ్యం ఎంతకాలం ఉంటుందని పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, భవిష్యత్తులో రాబోయే మరిన్ని వేవ్‌లను దృష్టిలో పెట్టుకుని, వేగవంతమైన, సమర్థవంతమైన ఇమ్యునైజేషన్ అందివ్వడానికి కావాల్సిన ప్రజారోగ్య అవస్థాపనా సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఇటువంటి అవస్థాపనా సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో వివిధ సమయాల్లో వచ్చే సమస్యలకు సమర్థవంతమైన బూస్టర్ డోసులను వేగంగా ఇచ్చే వీలు కలుగుతుంది.
    ఈ పోరాటంలో క్లిష్టమైన పని ఏంటంటే, కమ్యూనిటీలో నేరుగా మమేకమై పనిచేసే ఫ్రంట్‌లైన్ వర్కర్ల సామర్థ్యాన్ని పెంచడం. కొవిడ్-19తో పోరాడటంలో అంగన్వాడీ వర్కర్లు, ఆక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ASHA), ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్ (ANM) వర్కర్లు కీలక పాత్ర పోషించారు. వ్యాక్సినేషన్ల గురించి వారు అవగాహన కలిగించి, నచ్చజెప్పి, అందరినీ వ్యాక్సిన్ తీసుకోనేలా ప్రోత్సహించారు. కాబట్టి ఇలాంటి వాళ్ల సంఖ్యను, సామర్థ్యాన్ని పెంచి, ప్రజలను ప్రోత్సహించడానికి అవసరమైన సదుపాయాలను వారికి కల్పించాలి.

    మళ్లీ సాధారణ పరిస్థితికి రావడానికి వ్యాక్సినేషన్లు మాత్రమే దారి. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేవరకూ ఏ ఒక్కరూ సురక్షితంగా ఉండలేరు. కాబట్టి మన చుట్టూ ఉన్నవారిని వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించడానికి ఇదే సరైన సమయం.

    అనిల్ పరామర్, వైస్ ప్రెసిడెంట్,
    కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్, యునైటెడ్ వే ముంబై
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Corona virus, Covid-19

    తదుపరి వార్తలు