Chicken or Eggs : చికెన్‌.. గుడ్డు.. ఇందులో ఏది బెస్ట్‌? ఎక్కువ ప్రోటీన్ దేని నుంచి లభిస్తోందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Chicken or Eggs : మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. శరీర జీవ క్రియలు, అవయవాల పనితీరు సక్రమంగా ఉండటానికి కావాల్సిన శక్తి ఆహారం ద్వారా అందుతుంది. అందువల్ల కండరాల నిర్మాణానికి, శారీరక శక్తికి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి.

  • Share this:
మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. శరీర జీవ క్రియలు, అవయవాల పనితీరు సక్రమంగా ఉండటానికి కావాల్సిన శక్తి ఆహారం ద్వారా అందుతుంది. అందువల్ల కండరాల నిర్మాణానికి, శారీరక శక్తికి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. శాకాహారం (ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్), మాంసాహారం (యానిమల్ బేస్డ్ ప్రోటీన్) నుంచి కూడా ప్రోటీన్లు లభిస్తాయి. కానీ మనకు అందుబాటులో ఉండే ప్రోటీన్ వనరుల్లో గుడ్లు, కోడి మాంసం అన్నింటికంటే ముందుంటాయి. ఈ రెండూ జంతువుల ఆధారిత ప్రోటీన్ల కిందకే వస్తాయి. వీటిలో దేని నుంచి ప్రోటీన్లు ఎక్కువగా అందుతాయో తెలుసుకుందాం.వ్యాయామాలు చేసేవారు, ఫిట్‌నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకునేవారు ప్రోటీన్ కోసం చికెన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కోడిమాంసం నుంచి ప్రోటీన్‌ సమృద్ధిగా లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ప్రతి 100 గ్రాముల చికెన్ నుంచి 143 కిలో క్యాలరీల శక్తి, 24.11 గ్రాముల ప్రోటీన్, 2.68 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3.12 గ్రాముల కొవ్వుపదార్థాలు లభిస్తాయి. వీటితో పాటు చికెన్‌లో కాల్షియం, ఐరన్, సోడియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

కోళ్లలోని వివిధ భాగాలను బట్టి, మాంసంలో ఉండే కొవ్వు శాతం మారవచ్చు. అందువల్ల మనకు అవసరమయ్యే పోషక విలువల ఆధారంగా చికెన్‌ను ఎంచుకోవాలి. బరువు తగ్గాలనుకునేవారు, కండలను పెంచేవారు చికెన్ బ్రెస్ట్‌ తీసుకోవాలి. కోడి మాంసంలోని ఈ భాగంలో తక్కువ మొత్తంలో కొవ్వు, క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే లో-కార్బ్ డైట్, కీటోజెనిక్ డైట్ అనుసరించేవారు ఫ్యాట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కోడి తొడలు, కాళ్లు, రెక్కలను బాగా ఉడికించి తీసుకోవాలి. బరువు పెరగాలనుకునే వ్యక్తులు కూడా వీటిని తీసుకోవచ్చు. ఈ భాగాల్లో ఉండే కొవ్వు వారి శరీరానికి కావాల్సిన క్యాలరీలను అందిస్తుంది.

* గుడ్లు తక్కువేం కాదు!
గుడ్లు కూడా ప్రోటీన్లకు నిలయంగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల ఉడికించిన గుడ్డులో 155 కిలో క్యాలరీల శక్తి, 12.58 గ్రాముల ప్రోటీన్, 1.12 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 10.61 గ్రాముల కొవ్వు ఉంటాయి. గుడ్ల ద్వారా శరీరానికి అందే డైటరీ కొలెస్ట్రాల్‌ వల్ల శరీరానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయులను పెంచదని తాజా అద్యయనాల్లో కనుగొన్నారు. ఉడికించిన గుడ్డు మొత్తాన్ని తీసుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.

గుడ్ల నుంచి కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం, ఫ్లోరైడ్, విటమిన్ ఎ, బి కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ కె... వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. గుడ్డులోని పచ్చసొనలో ల్యూటిన్, జెయాక్సాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కండరాల బలోపేతానికి, బరువు తగ్గడానికి కూడా గుడ్లు తోడ్పడతాయి.

* ఏది మంచిది?
మన దేశంలోని చాలా ప్రాంతాల ప్రజలు ఆహారంలో కార్బోహైడ్రేట్లను ఎక్కువగా, ప్రోటీన్లను తక్కువగా తీసుకుంటున్నారని గత అధ్యయనాల్లో తేలింది. ప్రోటీన్ లోపం వల్ల మరాస్మస్, ఎడిమా, కండరాలు పల్చబారడం, సొరియాసిస్, డయాబెటిస్, డిస్లిపిడెమియా, చర్మం, జుట్టు సంబంధ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటికి దూరంగా ఉండాలంటే శరీర బరువులో ప్రతి కిలోకు 0.8 నుంచి 1 గ్రాము చొప్పున ప్రోటీన్‌ అందేలా చూసుకోవాలి. అంటే యాభై కిలోల బరువున్న వ్యక్తి కనీసం 50 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలన్నమాట. ప్రోటీన్, ఇతర పోషకాల విషయంలో గుడ్లు, చికెన్ వేటికవే ప్రత్యేకం. కానీ చికెన్‌తో పోలిస్తే గుడ్లు తక్కువ ధరలో లభిస్తాయి. అందువల్ల ఎక్కువమంది వీటినే ఎంచుకుంటారు. ప్రోటీన్ అవసరాన్ని బట్టి చికెన్ లేదా గుడ్లను ఆహారంలో తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published: