news18-telugu
Updated: November 21, 2020, 3:03 PM IST
ప్రతీకాత్మక చిత్రం
దీపావళి అంటే సందడితో నెలకొనే పండగ. బంధువులు, స్నేహితులతో కలిసి చేసుకునే ఈ పండగ వల్ల కాలుష్యం కూడా అధికంగా ఉంటుంది. టపాసులు, స్వీట్ బాక్సులు తదితర వ్యర్థాలు విధులతో నిండిపోయి ఉంటాయి. దీపావళి మరుసటి రోజు ఓ సారి వీధులను గమనిస్తే మీకే తెలుస్తుంది. మీరు ఈ వ్యర్థాలంతా ఎక్కడికి వెళ్తున్నాయి? అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతుంది. కొంత వరకు మురికి కాలువలకు అడ్డుపడటం, మరికొన్ని కాలిపోవడం, మిగిలినవి డంప్ యార్డ్ కు చేరుతాయి. అయితే వీటిలో చాలా తక్కువ శాతం మాత్రమే రీసైకిల్ అవుతాయి. ఈ నేపథ్యంలో వ్యర్థాల రీసైక్లింగ్ ప్రోత్సహించేందుకు గాను చెన్నైకి చెందిన కమ్యూంట్రీ అనే ఎన్జీఓ కాలిపోయిన టపాసులు, రాకెట్లు, స్తూపాకార బాంబుల కేసులను సేకరిస్తోంది. ఐదు నుంచి ఆరు అంగుళాల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న టపాసుల కేసులను సేకరించి వాటిని మొక్కలు పెంచేందుకు ఉపయోగిస్తోంది. చిన్న చిన్న మొక్కల పెరుగుదల కోసం వీటిని వినియోగిస్తోంది.
వ్యర్థమనేది వ్యర్థంగా ఉన్నంత వరకు మాత్రమే వ్యర్థంగా మిగిలిపోతుందని కమ్యూంట్రీ ఎన్జీఓఓ వ్యవస్థాపకుడు హఫీజ్ ఖాన్ అన్నారు. ఇంటి ఇంటికీ తిరిగి టపాసులు కాల్చవద్దని చెప్పలేమని, అది వారి వ్యక్తిగత ఛాయిస్ గా ఉంటుందని అన్నారు. కానీ టపాసుల వ్యర్థాల కేసులను మాత్రం ఇవ్వమని ప్రజలను అడగవచ్చని, వాటిలో మొక్కలను నాటవచ్చన్నారు. దీపావళి మరుసటి రోజైనా ఒక్క ఆదివారం రోజే 50 వేల కేసులను సేకరించినట్లు ఆయన తెలియజేశారు. ఇష్టమైతేనే టపాసుల కేసులను ఎన్జీఓకు ఇవ్వవచ్చు. లేదా ఇంట్లోనే వాటిలో మొక్కల పెంచేందుకు వాడొచ్చు.
ఈ మొక్కలను చెన్నై శివార్లలోని నర్సరీలో ఆరు నెలల పాటు పెంచుతారు. తర్వాత వివిధ ప్రదేశాల్లో పండిస్తారు. ఈ మొక్కలు ఐదు అడుగుల వరకు పెరుగుతాయి. టపాసుల కేసులు బలమైన కార్డు బోర్డుతో తయారవుతాయని, ఇది మొక్కలు పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుందని హఫీజ్ అన్నారు. నీరు పోసేటప్పుడు నీటిని నిలుపుకుంటుదని, దాన్ని నిర్వహించడం సులభమని వివరించారు.
వేప, బీచ్, జాక్ ఫ్రూట్, జామ, అశోక, ఆమ్లా లాంటి చెట్లను పెంచవచ్చు. అయితే టపాసుల కేసుల్లో ఉన్న గన్ పౌడర్ మొక్కలపై ప్రభావం చూపుతుందా అని హఫీజ్ అని అడుగగా.. కేసు లోపలి భాగం చాలా శుభ్రంగా ఉంటుందని, ఒకసారి కేసుల తమ వద్దకు వచ్చిన తర్వాత వాటిని పేడ నీటితో మరింత శుభ్రపరుస్తామని తెలిపారు. క్రితం సంవత్సరం వారు 27వేల టపాసుల కేసులను సేకరించారు. ఈ ఏడాది కనీసం 80 వేల కేసులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Published by:
Nikhil Kumar S
First published:
November 21, 2020, 2:59 PM IST