హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి మరో పార్కు..

ఎల్బీ నగర్,బీఎన్ రెడ్డి నగర్,తుర్కయంజాల్,నాదర్ గుల్,మన్నెగూడ పరిసర ప్రాంత ప్రజలకు నిత్యం ఉపయోగపడేలా గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో అర్బన్ పార్కును అటవీ శాఖ అభివృద్ది పరిచింది.

news18-telugu
Updated: July 30, 2019, 3:50 PM IST
హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి మరో పార్కు..
పార్క్‌ను ప్రారంభిస్తున్న సీఎస్ జోషి
  • Share this:
హైదరాబాద్ వాసులకు మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి వచ్చింది.ఎల్బీ నగర్ నుంచి నాగార్జునసాగర్ వెళ్లే దారిలో గుర్రంగూడ వద్ద ఆరోగ్య సంజీవని వనం పేరుతో ఫారెస్ట్ పార్కును చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, అటవీ శాఖతో పాటు రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు.ఎల్బీ నగర్,బీఎన్ రెడ్డి నగర్,తుర్కయంజాల్,నాదర్ గుల్,మన్నెగూడ పరిసర ప్రాంత ప్రజలకు నిత్యం ఉపయోగపడేలా గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో అర్బన్ పార్కును అటవీ శాఖ అభివృద్ది పరిచింది.ఇప్పటికే 2015లో సంజీవని వనం పేరుతో సాహెబ్‌నగర్‌లో ఏర్పాటైన అటవీ పార్కుకు అదనంగా ఈ కొత్త పార్కును అటవీ శాఖ ఏర్పాటు చేసింది. రోజు రోజుకూ పెరుగుతున్న శివారు ప్రాంత కాలనీలు, ప్రజలకు ఈ పార్కు సేవలు అందిస్తుంది. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు, కుటుంబంతో గడిపేందుకు పిక్నిక్ స్ఫాట్,అక్కడే వంట చేసుకుని వన భోజనాలు చేసేందుకు వీలుగా ప్రత్యేక ప్రాంతాలను కూడా ఈ పార్కులో ఏర్పాటు చేశారు.

పిల్లలకు సాహస క్రీడలు, రాశివనం, నక్షత్ర వనం, తక్కువ ప్రాంతంలో ఎక్కువ పచ్చదనం పెంచే మియావాకి అటవీ పెంపకాన్ని ఈ కొత్త పార్కులో అటవీ శాఖ ప్రత్యేకంగా అభివృద్ది చేస్తోంది. పూజా కార్యక్రమంతో పార్కును ప్రారంభించిన చీఫ్ సెక్రటరీ దంపతులు, అధికారులు పార్కులో కలియతిరిగారు. మొక్కలు నాటడంతో పాటు సైక్లింగ్ చేశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న సంజీవని వనంలోకి కూడా వెళ్లిన చీఫ్ సెక్రటరీ అక్కడి ఏర్పాట్లను కూడా పరిశీలించారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ వాసులకు అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఆరోగ్యకరమైన ఆస్థులుగా మిగులుతాయని చీఫ్ సెక్రటరీ జోషి అన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండేలా ఈ పార్కుల రూపకల్పన జరుగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77 అటవీ పార్కులను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పీసీసీఎఫ్ పీకే ఝా వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఆటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పీకే ఝా, అటవీ అభివృద్ది కార్పోరేషన్ ఎం.డీ. రఘువీర్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. హరీష్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పృధ్వీరాజ్, శోభ, మునీంద్ర, స్వర్గం శ్రీనివాస్, పర్గెయిన్, చీఫ్ సెక్రటరీ సతీమణి అనురాధ, రంగారెడ్డి అటవీ అధికారులు సిధానంద్ కుక్రేటీ, భీమా నాయక్, జానకిరామ్, శివయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
First published: July 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading