Ayurveda: శీతాకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం.. రాకుండా ఆయుర్వేదం సూచించిన ఆహార నియమాలివే..

ప్రతీకాత్మక చిత్రం

శీతాకాలం (winter) వచ్చిందంటే జీర్ణశక్తి మందగిస్తుంది. అన్ని వయసుల వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇది. ఈ సమయంలో సీజనల్ పండ్లు, కూరగాయలు తినడానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వండి. వేడి వేడిగా చాయ్, కాఫీలు తాగేసి పోషకాహార లేమిని కొని తెచ్చుకోకండి. శీతాకాలంలో మనం ఏం తినాలో మన పెద్దలు మనకు ఏనాడో చెప్పారు.

  • Share this:
శీతాకాలం (winter) వచ్చిందంటే జీర్ణశక్తి మందగిస్తుంది. అన్ని వయసుల వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇది. ఈ సమయంలో సీజనల్ పండ్లు, కూరగాయలు తినడానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వండి. వేడి వేడిగా చాయ్, కాఫీలు తాగేసి పోషకాహార లేమిని కొని తెచ్చుకోకండి. శీతాకాలంలో మనం ఏం తినాలో మన పెద్దలు మనకు ఏనాడో చెప్పారు. దాన్ని ఓమారు గుర్తుకు తెచ్చుకుని ఫాలో అయిపోతేసరి. మన సంప్రదాయ విజ్ఞాన ఘని అయిన ఆయుర్వేదం ప్రకారం ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇందుకు చేయాల్సిందల్లా మీ శరీర తత్వాన్ని మీరు అర్థం చేసుకోవడమే. మీకున్న రోగనిరోధక శక్తి, జీర్ణశక్తి, వివిధ సీజన్లలో మీకు స్వతహాగా ఉన్న శారీరక శక్తి వంటివన్నీ పరిగణలోకి తీసుకుంటే మీ ఆరోగ్యంపై మీకు సంపూర్ణ అవగాహన వచ్చినట్టే. దీనికి తగ్గట్టు ఆహారాన్ని తీసుకోండి అప్పుడు మీకు అన్ని కాలాల్లోనూ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

రుతువులు..
కాలాన్ని(seasons) రెండు ముఖ్య భాగాలుగా ఆయుర్వేదం (Ayurveda) విభజిస్తుంది. వాటినే మనం ఆయనాలు (solstices ) అంటాం. ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ రెండింటి కాలాలు చెరీ 6 నెలలు. ఒక్కొక్క ఆయనంలో 3 రుతువులుంటాయి. శిశిర రుతువు (చలికాలం), వసంత రుతువు (వసంత రుతువు), గ్రీష్మ రుతువు (వేసవి)లను ఉత్తరాయణంగా భావిస్తారు. వర్ష రుతువు (వర్షాకాలం), శరద్ (ఆకులు రాలే కాలం) రుతువు, హేమంత(ఆకులు రాలే కాలం) రుతువులను కలిపి దక్షిణాయనంగా లెక్కవేస్తారు. ఈ రెండు కాలాల్లోనూ భిన్నమైన శక్తి మన శరీరంలోకి వస్తుందని చెప్పే ఆయుర్వేదం, ఈ రెండు కాలాల మధ్య సమతుల్యత లోపిస్తేనే మన శరీరానికి అనారోగ్యం వస్తుందని చెబుతోంది.

సృష్టి రహస్యాన్ని ఛేదించండి
తీపి, ఉప్పు, ఘాటు, వగరు, చేదు, పులుపు ఈ షడ్రుచుల సమ్మేళనమే మనం తినే రుచికరమైన ఆహారం. కానీ వీటిలో కొన్ని నిష్పత్తులు ఎక్కువ, తక్కువ చేసి తింటే మనకు అనారోగ్యం రాకుండా ఉంటుంది. మిగతా సీజన్ తో పోల్చితే శీతాకాలంలో మనం ఈ షడ్రుచులను కాస్త ఎక్కువగానే తింటాం. కానీ అలాకాకుండా తీపి, వగరు, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని శీతాకాలంలో తినడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని ఆయుర్వేదం చెబుతోంది. మిగతా రుచుల కంటే వీటికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు వగరు అంటే ఉసిరికాయలు (amla), వీటిలో సీ విటమిన్ (Vitamin C) అధికంగా ఉంటుంది. దీంతో మన ఇమ్యూనిటీ పెరిగి, శ్వాసకోస సమస్యలు, ఇబ్బందులు రాకుండా చేస్తుందన్నమాట. చలి కాలమంటే మనకు శ్వాసకోస సమస్యలు వస్తాయి కనుక ప్రకృతి వీటికి విరుగుడును ఇలా అందించిందని మనం గ్రహించాలి. ఇందుకు ఆయుర్వేద సహకరిస్తుంది.

ప్రకృతి విరుద్ధంగా మనం మన ఆహార విధానాన్ని ఎంచుకుంటే మాత్రం ఇబ్బందుల పాలు అవ్వక తప్పదు. చూడండి.. శీతాకాలంలోనే మనకు ఉసిరి, జామ, నిమ్మ, బత్తాయి వంటి పంటలు ఎక్కువగా వస్తాయి. ఇదే సృష్టి రహస్యమని అర్థం చేసుకోవడంలోనే అంతరార్థం దాగుంది. చలికి పులుపు, వగరు తినలేం, మేం సహించలేం అంటే అనారోగ్యం ఏరి కోరి తెచ్చుకున్నట్టేగా. చలువను పుట్టించే పదార్థాలకు దూరంగా ఉంటూ, ప్రాసెస్డ్ ఫుడ్ లేదా ఫ్రోజన్ ఫుడ్ కు గుడ్ బై చెబితే మంచింది. ఇలాంటి ఆహారం తినడమంటే మీ ఒంట్లోని రోగనిరోధక శక్తిని మీరే చంపేసినట్టు, అంతేకాదు ప్రాసెస్డ్ ఫుడ్ (processed food) తో శ్వాస కోస సమస్యలు (respiratory problems) మరింత పెరుగుతాయి.


విశ్రాంతి ఎక్కువ తీసుకోవాలి

పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువగా ఉండే చలికాలంలో శరీరానికి ఎక్కువ విశ్రాంతి (rest) అవసరం. వేసవిలో మీ శరీరం ఎక్కువగా అలసిపోతుంది కానీ శీతాకాలంలో ఎక్కవ అలసటకు గురి కాకపోయినా విశ్రాంతి కోరుకుంటుంది. శరీరానికి, మనసుకు ఎక్కువ విశ్రాంతి దొరికేది ఈ కాలంలోనే. ఇందుకు మీరు చేయాల్సిందల్లా వీలైనంత త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేవడమే.

వాతం, కఫం నియంత్రించండి
వాతము, కఫము అధికంగా ఉండే ఈ సీజన్ లో వీటిని నియంత్రించేందుకు వేడిగా ఉన్న ద్రవపదార్థాలు అధికంగా సేవించండి. ఆహారాన్ని తాజాగా తీసుకోండి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినండి. పాలు, పళ్లు, కూరగాయలు, పొట్టు ధాన్యాలు, నెయ్యిని ఎక్కువగా సేవించండి. శీతాకాలంలో మనం తినే ఆహార పరిమాణం చాలా తక్కువ కనుక తక్కువ పోషకాలు మీ ఒంటికి చేరుతాయి. ఇది శరీరాన్ని వివిధ రూపాల్లో ఇబ్బంది పాలు చేస్తుంది.

మానసిక సమస్యలకు కేరాఫ్
శీతాకాలంలో ధ్యానం ఎక్కడ చేయగలమని అనుకోకండి. ఈ కాలంలో చాలా స్లోగా, బద్ధకంగా సమయం గడుస్తుంది, అందుకే మీలో మానసికంగా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని జయించాలంటే ధ్యానం అవసరం. గందరగోళం, కన్ఫ్యూజన్ లాంటి ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యేది ఈ కాలంలోనే కనుక క్రమపద్ధతిగా ఉండేలా మీ దినచర్యను సిద్ధం చేసుకుని, అమలుచేయండి. లేదా అంతా తలకిందలై మీరు మానసికంగా నలిగిపోతారు. మానసిక సమస్యలకు (psychological problems) కేరాఫ్ శీతాకాలం కనుక కాస్త హుషారు నింపే పనులతో బిజీగా గడపండి.

ఆ ఆహారాన్ని తినడం మేలు..
ఆకలి కాలేదంటూ తిండి ఎగ్గొట్టకండి, కాకపోతే మీ రాత్రి భోజనం మాత్రం చాలా తేలికగా జీర్ణమయ్యేలాంటి తేలిక పదార్థాన్ని తినండి. శీతాకాలంలో మీరు నిద్రపోవడానికి 3 గంటల ముందే డిన్నర్ (dinner) తినేయండి. ఎక్కువ మసాలాలు, నూనెలు, కొవ్వు అధికంగా ఉన్న తిండి తినకుండా జాగ్రత్తపడండి. చలికాలమంతా వేపుడు వంటి ఫ్రైల కంటే ఉడికించిన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. సూపులు, స్ట్యూలు (stews), ఉడికించిన మజ్జిగ పులుసు, కూరగాయ ముక్కల పులుసుతో పాటు అన్ని దుంపలను ఉడికించి లేదా ఆవిరి మీద ఉడికించి తింటే మంచిది. గోరువెచ్చని పాలలో చిటికెడు పసులు వేసుకుని తాగండి. పడుకోవడానికి రెండు లేదా మూడూ గంటల ముందు వీటిని తాగితే చక్కగా నిద్రపడుతుంది.
Published by:Nikhil Kumar S
First published: