Kidney Stones: ఆరోగ్యం విషయంలో చాలామంది తమకు తెలిసినదే నిజమనుకుంటారు. సరైన అవగాహన లేకపోవడం, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మడం వంటివి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా చాలామంది కిడ్నీల ఆరోగ్యం విషయంలో వదంతులనే ఎక్కువగా నమ్ముతున్నారు. అలాంటి వాటిలో, బీర్ ఎక్కువగా తాగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు అనేది ఒకటి. అయితే ఇది అత్యంత ప్రమాదకరమైన వదంతు అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.
మార్చి 9న ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా.. హెల్త్ కేర్ స్టార్టప్ ప్రిస్టిన్ కేర్ (Pristyn Care), హెల్త్‌కేర్ టెన్నాలజీ కంపెనీ లైబ్రేట్ డేటా ల్యాబ్ సంయుక్తంగా కిడ్నీ హెల్త్‌పై ఒక అధ్యయనం నిర్వహించాయి. ఇండియాలో కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు 1000 మందిపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా బీర్ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడవు అని ప్రతి ముగ్గురిలో ఒకరు చెప్పారు.
H3N2 ఫ్లూ అంటే ఏమిటి? దాని లక్షణాలు, నివారణ A to Z సమాచారాన్ని తెలుసుకోండి
* అవగాహన చాలా తక్కువ
కిడ్నీల ఆరోగ్యానికి సంబంధించిన ఇతర విషయాలపై కూడా ఇండియన్స్‌కు పెద్దగా అవగాహన లేదని సర్వేలో తేలింది. కిడ్నీలు మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయని సర్వేల్లో పాల్గొన్న వారిలో 50 శాతం మందికి తెలియదు. మూత్రపిండాలు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తాయని, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని సర్వేలో పాల్గొన్న 10 శాతం కంటే తక్కువ మందికి తెలుసని నివేదిక పేర్కొంది.
Diabetes foot care: మధుమేహులూ.. మీ పాదాలు జాగ్రత్త.. డయాబెటిక్ ఫూట్ కేర్ టిప్స్..
సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది కిడ్నీ స్టోన్స్ లక్షణాలు కనిపించినా, ట్రీట్‌మెంట్‌ను ఆరు నెలల కంటే ఎక్కువ ఆలస్యం చేస్తున్నట్లు చెప్పారు. వారిలో కేవలం 14 శాతం మందికి మాత్రమే మూత్రపిండాల్లో రాళ్లు ఎందుకు ఏర్పడుతాయనే విషయాల గురించి తెలుసని నివేదిక పేర్కొంది.
* కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి?
మూత్రంలో కొన్ని ఖనిజాలు ఎక్కువగా ఏర్పడినప్పుడు అవి మూత్రపిండాలలో పేరుకుపోయి ఘన పదార్థంగా ఏర్పడతాయి. వీటినే కిడ్నీ స్టోన్స్ అంటారు. బీపీ, షుగర్ వంటివి కిడ్ల్నీల్లో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాలు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినట్లు గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. పొత్తికడుపు నొప్పి, నడుం పైభాగంలో లేదా లేదా గజ్జలో విపరీతమైన నొప్పి కలుగుతాయి. కొన్నిసార్లు మూత్రంలో రక్తం కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలు గుర్తిస్తే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
* చికిత్స ఏంటి?
కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను సర్జరీ చేసి బయటకు తీసేయవచ్చు. లేదంటే మూత్రంతో పాటు బయటకు వెళ్లేలా వాటిని చిన్న ముక్కలుగా చేయవచ్చు. నీరు ఎక్కువగా తాగితే, మూత్రంతో పాటు కిడ్నీల్లో ఏర్పడే చిన్న రాళ్ల పలుకులు శరీరం నుంచి బయటకు వెళ్తాయి అనేది నిజం. అయితే బీర్ తాగినా కూడా మూత్రవిసర్జన ఎక్కువగా అవుతుంది. కానీ ఈ సందర్భంలో మూత్రపిండాల్లో రాళ్లు బయటకు వెళ్తాయని చెప్పేందుకు ఎలాంటి ప్రమాణాలు లేవు. పైగా మద్యపానం ఇతర దుష్ప్రభావాలకు కూడా కారణం అవుతుంది కాబట్టి ఇది సరైన వాదన కాదని నిపుణులు చెబుతున్నారు.
మన దేశంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని హెల్త్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. 2022లో కిడ్నీ ప్రాబ్లమ్స్‌తో బాధపడే వారి ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్స్ సంవత్సరానికి 180 శాతం పెరిగాయని లైబ్రేట్ డేటా సూచిస్తుంది. వీరిలో చాలామంది కిడ్నీలో రాళ్లకు చికిత్స కోసం సంప్రదించడం గమనార్హం.
కిడ్నీలో రాళ్ల సమస్యలు ఎక్కువగా యువతలో గుర్తిస్తున్నట్లు చెప్పారు ప్రిస్టిన్ కేర్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ వైభవ్ కపూర్. ఆహారంలో మార్పులు చేసుకోవడం, వైద్యుల సలహాతో తగినంత నీరు తాగడం, వారు ఇచ్చిన మందులు వాడటంతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని చెప్పారు. అంతేకానీ బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ ఏర్పడవు అనే వదంతులు నమ్మి అనారోగ్యాలు కొని తెచ్చుకోవద్దని, సమస్య లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beer, Health, Kidney, Life Style