• Home
  • »
  • News
  • »
  • life-style
  • »
  • CAN COVID VACCINES FIGHT THE EMERGING DELTA PLUS VARIANT INDIAS NEW CONCERN MK GH

Delta variant Virus: డెల్టా ప్లస్ వేరియంట్‌ వైరస్‌పై కోవిడ్ వ్యాక్సిన్లు పనిచేస్తాయా....?

(ప్రతీకాత్మక చిత్రం)

Delta Plus variant: డెల్టా ప్లస్ వేరియంట్‌ను కోవిడ్ వ్యాక్సిన్లు నిరోధిస్తాయా? డెల్టా కంటే కొత్త మ్యుటేషన్ ప్రమాదకరంగా మారుతుందా?

  • Share this:
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే రానున్న రోజుల్లో మూడో దశ ఉద్ధృతిని కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండో దశ వైరస్ వ్యాప్తికి కారణమైన డెల్టా వేరియంట్ కొత్త రూపాంతరం.. ‘డెల్టా ప్లస్’ భారత్‌ను కలవరపెడుతోంది. దీన్ని AY.1 పేరుతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. అయితే దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. టీకాలు డెల్టా వేరియంట్‌ను సమర్థంగా నిరోధిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్‌లో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు డెల్టా రకం వైరస్‌పై పనిచేస్తాయని ఎయిమ్స్ సైతం వెల్లడించింది.

డెల్టా వేరియంట్ కొత్త మ్యూటెంట్‌ జన్యు క్రమాన్ని విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు. పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో దీనిపై ప్రయోగాలు చేస్తున్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌తో కొత్త వైరస్ మ్యుటెంట్‌ను నిరోధించే అంశంపై పరీక్షలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సీరం నమూనాలను.. డెల్టా ప్లస్ వేరియంట్‌ను నిరోధించే యాంటీబాడీల తటస్థీకరణ సామర్థ్యాన్ని (neutralising potential) తనిఖీ చేయడానికి ఉపయోగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రమాదం ఉందా?
ఇప్పటికిప్పుడు డెల్టా ప్లస్‌తో పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఈ కొత్త మ్యూటెంట్ థర్డ్ వేవ్‌కు దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా డెల్టా ప్లస్ జన్యు క్రమాన్ని విశ్లేషించడంతో పాటు, దానిపై వ్యాక్సిన్ల ప్రభావశీలతను నిర్ధారించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పందించారు. భారతదేశంలో అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. డెల్టా వేరియంట్‌పై టీకాల ప్రభావశీలత, యాంటీబాడీల వృద్ధిపై వివిధ వ్యాక్సిన్ల ప్రభావాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స ప్రయోజనం ఎంత?
కోవిడ్-19 బాధితులకు అందించే చికిత్సలో మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్‌మెంట్ ఒకటి. ఈ పద్ధతిలో చాలా మంది రోగులను ప్రాణాపాయం నుంచి వైద్యులు కాపాడగలిగారు. అయితే ఈ చికిత్స డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఎంత వరకు నిరోధించగలదనే అంశంపై స్పష్టత లేదు. కొత్తగా వెలుగులోకి రావడంతో, ఈ మ్యుటెంట్‌ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనాలు ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. దీంతో మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స డెల్టా ప్లస్ వేరియంట్‌ విషయంలో పనిచేయకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వాదనకు మద్దతు ఇవ్వడానికి, లేదా విభేధించడానికి మరింత శాస్త్రీయ డేటా అవసరమని విశ్లేషిస్తున్నారు.

డెల్టా వేరియంట్‌పై ఆస్ట్రాజెనెకా- కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ పనిచేస్తుందా?
డెల్టా వేరియంట్ భారత్‌తో పాటు అనేక దేశాల్లో వైరస్ వ్యాప్తికి కారణమైంది. ఈ మ్యూటెంట్‌ను వ్యాక్సిన్లు ఎంత వరకు నిరోధిస్తాయనే అంశంపై అమెరికన్ శాస్త్రవేత్త, ఆరోగ్య నిపుణుడు ఎరిక్ ఫీగల్ డింగ్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. డెల్టా వేరియంట్‌పై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరిమిత ప్రభావాన్ని కలిగి ఉండవచ్చని చెప్పారు. ఇందుకు ఒక అధ్యయన నివేదికను ఆయన ఉదహరించారు. “డెల్టా వేరియంట్‌పై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సామర్థ్యం 90 శాతం కాదు. ఇది కేవలం 60 శాతంగా ఉండవచ్చు. ఒక నాన్ ట్రయల్ అధ్యయనంలో ఫైజర్ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్‌పై 88 శాతం సమర్థంగా పనిచేసినట్లు తేలింది. అయితే ఈ రెండు వ్యాక్సిన్ల సింగిల్ డోసు మాత్రమే తీసుకున్నప్పుడు.. టీకాల సగటు ప్రభావశీలత కేవలం 33 శాతంగానే నమోదైంది. ప్రస్తుతం చాలా దేశాలు కేవలం ఒక డోసు వ్యాక్సిన్లను మాత్రమే ఇచ్చాయి. ఇది ఆందోళన కలిగించే అంశం” అని వివరించారు.

వ్యాక్సిన్ల సామర్థ్యం తక్కువగా నమోదవడంపై WHO ఏమంటోంది?
డెల్టా వేరియంట్ వ్యాప్తి ఆందోళనకరంగా మారిందని WHO ప్రతినిధి, డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 92 దేశాలకు డెల్టా వేరియంట్ వ్యాపించిందన్నారు. ఇందులో 80 దేశాల్లో B1.617.2 వేరియంట్, మరో 12 దేశాల్లో B.167 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. అయితే వివిధ దేశాల్లో ఇవి ఎలా రూపాంతరం చెందాయనే అంశంపై సమాచారం లేదని వివరించారు. ఇదే సమయంలో డెల్టా సహా అన్ని రకాల వేరియంట్లపై టీకాలు పనిచేస్తాయని ఆమె తెలిపారు. ‘తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌, మరణాలను వ్యాక్సిన్లు తగ్గిస్తాయని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. కానీ పూర్తి స్థాయి రక్షణ కోసం ప్రజలకు రెండు డోసులు తప్పకుండా ఇవ్వాలి. ఒక డోస్ మాత్రమే ఇచ్చినప్పుడు, కొన్నిసార్లు టీకాల సామర్థ్యంలో తగ్గుదల ఉంటుంది’ అని ఆమె వివరించారు.

మరోవైపు ఇప్పటి వరకు దేశంలోని ఏడు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు వెలుగుచూసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 21, కర్ణాటకలో రెండు, కేరళలో మూడు, మధ్యప్రదేశ్‌లో ఆరు, తమిళనాడులో మూడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో కొత్త మ్యుటెంట్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ ‘ఆందోళన రకం’గా వర్గీకరించింది. ఈ రాష్ట్రాల్లో తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలని.. పరీక్షలు, వ్యాక్సిన్ డ్రైవ్‌ను పెద్ద ఎత్తున చేపట్టాలని కేంద్రం సూచించింది.
Published by:Krishna Adithya
First published: