ఉదయాన్నే హాట్ కాఫీ తాగనిదే చాలా మందికి రోజు రోజులా అనిపించదు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి, తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కూడా చాలా మంది కాఫీ తాగుతుంటారు. అయితే మోతాదు మించకుండా తాగితే ఇది ఆరోగ్యానికి మంచిదేనని ఇప్పటికే అనేక పరిశోధనలు చెబుతున్నాయి. కాఫీ తాగడం వల్ల పక్షవాతం, మతిమరుపు వచ్చే ప్రమాదం తగ్గుతుందంటారు. తాజాగా కాఫీపై చేసిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కిడ్నీ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. రోజుకు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల కిడ్నీలకు గాయాలయ్యే ప్రమాదం (Acute Kidney Injury- AKI) 23 శాతం తగ్గుతుందని తేలింది.
ఈ పరిశోధనపై న్యూ ఢిల్లీలోని బీఎల్‌కే మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ డైరెక్టర్, నెఫ్రాలజీ అండ్ రీనల్ ట్రాన్స్ ప్లాంటేషన్ హెచ్‌ఓడీ సునీల్ ప్రకాష్ స్పందించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. ‘కిడ్నీలు అకస్మాత్తుగా పూర్తిగా లేదా కొంత భాగం పనిచేయనప్పుడు.. కిడ్నీలకు తీవ్రమైన గాయం (Acute Kidney Injury- AKI) కావచ్చు. అయితే కాఫీ వినియోగం కిడ్నీ గాయంపై చూపే ప్రభావం గురించి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఎంతో ఆసక్తిగా ఉంది. కాఫీ తాగడం వల్ల తీవ్రమైన కిడ్నీ గాయం ప్రమాదాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే రోజుకు 2-3 కప్పులు మాత్రమే తాగితేనే ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. కాఫీ తాగడం వల్ల పక్షపాతం రిస్క్ కూడా తగ్గుతుందన్న విషయాన్ని ఎవరు తోసిపుచ్చలేరు. అంతేకాకుండా కాఫీలోని బయో యాక్టివ్ సమ్మేళనాలు కిడ్నీల్లో పెర్ఫ్యూజన్, ఆక్సిజన్ వినియోగాన్ని మెరుగుపరుస్తాయని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇది కేవలం సూచనగా ఉంది.’ అని పేర్కొన్నారు.
‘కాఫీపై పరిశోధన పునరాలోచన చేసేలా ఉంది. అయితే ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయన్న సంగతి మనం గ్రహించాలి. కాఫీ వంటి పాపులర్ డ్రింక్‌పై సానుకూల వార్తలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మిలియన్ల మంది దృష్టిని ఆకర్షిస్తాయి. అంతమాత్రాన అటువంటి నిర్ణయానికి వెళ్లడంలో మరింత జాగ్రత్త అవసరం.’ అని డాక్టర్ సునీల్ ప్రకాష్ హెచ్చరించారు. కాఫీలో ఉండే కెఫీన్ కిడ్నీ పనితీరును పెంచినప్పటికీ, అది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కూడా కారణమవుతుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కిడ్నీలో గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్(GFR)లో క్షీణతపై చేసిన పలు అధ్యయనాలను డాక్టర్ ప్రకాష్ ఉదహరించారు. ‘రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తీసుకుంటే, అది 3 ml/min కంటే ఎక్కువ. దీంతో కిడ్నీ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అంచనా(eGFR) క్షీణత 1.19 రెట్లు ప్రమాదాన్ని పెంచుతుందని 2021లో ఆండ్రెస్ డియాజ్ లోపెజ్ చేసిన పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన... ప్రస్తుతం కిడ్నీ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్‌లో వచ్చిన అధ్యయనానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి కాఫీ, టీ వినియోగంతో వచ్చే లాభనష్టాలను నేరుగా పోల్చడానికి ఒక అధ్యయనం జరగాలి.’ అని డాక్టర్ ప్రకాష్ అభిప్రాయపడ్డారు.
కొలరాడో యూనివర్సిటీలోని పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కాలీ ఎల్ టామర్‌డాల్, జాన్స్ హాప్‌కిన్స్ వర్సిటీ నెఫ్రాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ చిరాగ్ రోహిత్ పారిఖ్ తాజాగా కాఫీపై పరిశోధనలు చేశారు. కాఫీలో కెఫిన్, డైటెర్పెనెస్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూర్చే సమ్మేళనాలు ఉన్నాయి. క్లోరోజెనిక్ యాసిడ్ అండ్ ట్రైగోనెలిన్ వంటి సమ్మేళనాలు కిడ్నీ సాధారణ వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని వీరు తేల్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coffee, Health benefits, Health care, Kidney