రాంజానా, భాగ్ మిల్కా భాగ్ సినిమాల్లో అద్భుతంగా నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్ చాలా నాజూకుగా కనిపిస్తుంటారు. 36 ఏళ్ళ వయస్సులో కూడా ఆమె పాతికేళ్ళ పడుచు పిల్లలా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తుంటారు. అయితే సోనమ్ కపూర్ పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) బారిన పడ్డారు. దీని బారిన పడిన మహిళలకు నెలసరి సరిగా రాదు. ఈ క్రమంలో పీసీఓఎస్‌తో బాధపడేవారు ఏం చేయాలనే విషయాన్ని ఒక సుదీర్ఘమైన పోస్టు ద్వారా సోనమ్ వెల్లడించారు సోనమ్. ఆరోగ్య సంరక్షణ కోసం ఎలాంటి డైట్ ఫాలో కావాలో కూడా ఆమె చాలా చక్కగా వివరిస్తుంటారు.
ఇటీవల ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సోనమ్ కపూర్ కొన్ని విషయాలు పంచుకున్నారు. పీరియడ్స్ తొలి రోజున వేడి నీళ్లు, అల్లం టీ తాగుతున్నానని తెలిపారు. అయితే ఆమె ప్రత్యేకంగా అల్లం టీ పుచ్చుకోవడం వెనుక ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రుతుస్రావం సమయంలో వచ్చే కడుపు నొప్పి భరించలేక మహిళలు నరకాన్ని చూస్తుంటారు. అయితే అటువంటి నొప్పిని తగ్గించడానికి అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు, అల్లం పొట్ట ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఒంటిలో వేడి పుట్టేలా చేసి.. మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది.
పీరియడ్ ఫ్లోని నియంత్రించడంలో కూడా అల్లం టీ బాగా సహాయపడుతుంది. దీనివల్ల పీరియడ్స్‌లో హెవీగా బ్లీడింగ్ అవ్వదు. ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల కొందరు మహిళల్లో భరించలేని నొప్పి వస్తుంది. అయితే అల్లం టీ ప్రోస్టాగ్లాండిన్ల ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తుంది. తద్వారా పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, తిమ్మిరి, తలనొప్పి వంటి లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇకపోతే గతంలో సోనమ్ కపూర్ పీసీఓఎస్ డైట్ గురించి కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. "షుగర్ తింటుంటే చాలా బాగుంటుంది కానీ తర్వాత మీ ఆరోగ్యం పతనమవుతుంది. నేను షుగర్ తినడం పూర్తిగా మానేశాను. ఆ తర్వాత నా ఆరోగ్యంలో చాలా మంచి మార్పులు వచ్చాయి" అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే తాను కేవలం రిఫైన్డ్ షుగర్ మాత్రమే మానేశానని వెల్లడించారు. బాగా శుద్ధి చేసిన తెల్ల చక్కెర, చక్కెరతో చేసిన పదార్థాల కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తరచూ స్వీట్స్ తినడం వల్ల చక్కెరకు బానిస అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇదే విషయాన్ని ఆమె నొక్కి చెప్పారు.
పోషకాహార నిపుణురాలు లిల్లీ కింబుల్ సూచనల మేరకు సోనమ్ కపూర్ డైట్ ఫాలో అవుతుంటారు. స్ట్రాబెర్రీలు, పుచ్చకాయలు, బెర్రీలు, స్వీట్‌గా లేని పండ్లు వంటివి ఆమె ఎక్కువగా తింటుంటారు. పప్పుధాన్యాలు, ఎర్ర బియ్యం తింటూ తన ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకుంటానని ఆమె తరచూ చెబుతుంటారు. ఇలా ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా సోషల్ మీడియా పోస్టులతో అవగాహన కల్పిస్తూ.. మహిళా అభిమానులకు మరింత చేరువయ్యారు సోనమ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Health, Health benefits, Sonam kapoor, Tea