పెద్దవాళ్ల సాధారణ, సగటు రక్తపోటు స్థాయి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. తినే ఆహారం, చేస్తున్న పని, ఒత్తిడి, జీవనశైలి ఆధారంగా బీపీ హెచ్చుతగ్గులకు గురవుతుంది. సాధారణంగా రక్తపోటును సిస్టోలిక్, డయాస్టోలిక్ ప్రెజర్‌ల నిష్పత్తిగా కొలుస్తారు. సిస్టోలిక్ ప్రెజర్ అంటే.. గుండె శరీరానికి రక్తాన్ని పంపిణీ చేస్తున్నప్పుడు ధమనులపై పడే పీడనం. హార్ట్‌బీట్స్ మధ్యలో గుండె విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ధమనులపై పడే ఒత్తిడిని డయాస్టోలిక్ ప్రెజర్ అంటారు.
* నార్మల్ బీపీ అంటే?
సాధారణంగా బీపీ రీడింగ్ 120/80 mmHg ఉంటే, రక్తపోటు నార్మల్‌గా ఉన్నట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. బీపీ రీడింగ్ 130/90 mmHg, అంతకంటే ఎక్కువగా ఉంటే.. దాన్ని హై బీపీగా పేర్కొంది. అలాగే రీడింగ్ 90/60 mmHg, అంతకంటే తక్కువగా ఉంటే.. దాన్ని లో బీపీగా (Low BP) గుర్తించింది.
వయోజనుల (Adult) సాధారణ రక్తపోటును (నార్మల్ బీపీ) 120/80 mm Hg గా గుర్తించారు. అయితే ఇది సగటు (యావరేజ్) బీపీ మాత్రమే. పెద్ద వాళ్లలో నార్మల్ బీపీ పరిధి 95-145/60-90 mm Hg వరకు ఉంటుంది. ఒక వ్యక్తి ప్రస్తుత బీపీ, వారి ప్రస్తుత ఆరోగ్య స్థితిని సబ్జెక్టివ్ డేటా, ఇతర ఆబ్జెక్టివ్ డేటాతో కలిపి వైద్యులు అంచనా వేస్తారు. ఉదాహరణకు 90/50 mm Hg బీపీ అనేది.. ఆరోగ్యకరమైన, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని 20 ఏళ్ల వయోజన వ్యక్తికి సాధారణం కావచ్చు. అందువల్ల బీపీ కచ్చితంగా నిర్ణీత కొలతగా ఉండాలనే రూల్ ఏమీ లేదు. ముఖ్యంగా పెద్దవాళ్లతో పాటు వివిధ వయసుల వారి బీపీ రోజంతా ఒకేలా ఉండదు. అందుకే వైద్యులు దీన్ని ఒక రేంజ్‌గా పరిగణిస్తున్నారు.
* వయసుల వారీగా బీపీ స్థాయి (mm Hg)
(Estimated Blood Pressure Ranges- mm Hg)
వయసు | సిస్టోలిక్ రేంజ్ | డయాస్టోలిక్ రేంజ్ |
శిశువులకు 6 నెలల వరకు | 45–90 | 30–65 |
6 నెలల నుంచి రెండేళ్ల వరకు | 80–100 | 40–70 |
2–13 సంవత్సరాలు | 80–120 | 40–80 |
కౌమారం (14–18 సంవత్సరాలు) | 90–120 | 50–80 |
యవ్వనం (19–40 సంవత్సరాలు) | 95–135 | 60–80 |
వయోజనులు(41–60 సంవత్సరాలు) | 110–145 | 70–90 |
వృద్ధులు (61 ఏళ్లకు మించినవారు) | 95–145 | 70–90 |
* పురుషుల్లో నార్మల్ బీపీ (mm Hgలలో)
వయసు | సిస్టోలిక్ | డయాస్టోలిక్ |
21-25 | 120.5 | 78.5 |
26-30 | 119.5 | 76.5 |
31-35 | 114.5 | 75.5 |
36-40 | 120.5 | 75.5 |
41-45 | 115.5 | 78.5 |
46-50 | 119.5 | 80.5 |
51-55 | 125.5 | 80.5 |
56-60 | 129.5 | 79.5 |
61-65 | 143.5 | 76.5 |
* మహిళల్లో నార్మల్ బీపీ (mm Hgలలో)
వయసు | సిస్టోలిక్ | డయాస్టోలిక్ |
21-25 | 115.5 | 70.5 |
26-30 | 113.5 | 71.5 |
31-35 | 110.5 | 72.5 |
36-40 | 112.5 | 74.5 |
41-45 | 116.5 | 73.5 |
46-50 | 124 | 78.5 |
51-55 | 122.55 | 74.5 |
56-60 | 132.5 | 78.5 |
61-65 | 130.5 | 77.5 |
* వయసుతో పాటు బీపీ పెరుగుతుందా?
సాధారణంగా వయసుతో పాటు వ్యక్తుల రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి పెద్దవారిలో నార్మల్ బీపీ స్థాయి తరచుగా మారుతూ ఉంటుంది. బాల్యంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ రక్తపోటు ఒకేలా ఉంటుంది. యుక్తవయసుకు వచ్చిన తర్వాత యువతుల కంటే యువకుల్లో ఎక్కువ బీపీ ఉంటుంది. అయితే మెనోపాజ్ తర్వాత ఆడవాళ్లకు మగవాళ్ల కంటే ఎక్కువ బీపీ ఉంటుంది.
* పెద్దవాళ్లలో బీపీని ప్రభావితం చేసే అంశాలు
రక్తపోటును అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. వయసు, లింగం, జాతి, బరువు, వ్యాయామం, భావోద్వేగాలు, ఒత్తిడి, గర్భం, మందుల వాడకం, ఇతర వ్యాధులు వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.అయితే నిర్ణీత జాతి (ethnicity) ద్వారా కూడా రక్తపోటును అంచనా వేయవచ్చని పరిశోధనల్లో తేలింది. అయితే ఈ కారణం జీవసంబంధమైనది కాదని, సామాజిక సాంస్కృతికపరమైన మార్పులకు సంబంధించినదని పరిశోధకులు తేల్చారు. అందువల్ల అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదాన్ని నిర్ణయించేటప్పుడు వ్యక్తుల జాతిని కూడా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు.
వ్యక్తుల జీవగడియారం కూడా బీపీని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఉదయం వేళ వ్యక్తుల బీపీ తక్కువగా ఉంటుంది. కానీ సాయంత్రం వరకు రోజంతా పెరుగుతుంది. ఉదయం తీసిన బీపీ రీడింగ్ మధ్యాహ్నం వరకు మారవచ్చు, మళ్లీ సాయంత్రానికి వేరే రీడింగ్ నమోదు కావచ్చు. అందువల్ల రోజులో బీపీ కొలిచే సమయాన్ని కూడా వైద్యులు పరిగణనలోకి తీసుకుంటారు. ఊబకాయం ఉన్నవారిలో రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి శరీర కణజాలాలకు రక్తాన్ని పంపిణీ చేయడానికి గుండె చాలా కష్టపడాలి.
వ్యాయామం, ఒత్తిడి, ఆందోళన, ఏదైనా నొప్పి, కోపం, భయం.. ఇవన్నీ బీపీపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా ఈ చర్యలు రక్తపోటును పెంచుతాయి. అయితే కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రక్తపోటు తిరిగి సాధారణ స్థాయికి వస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల రక్తపోటు మారుతూ ఉంటుంది. మొదటి త్రైమాసికంలో గర్భిణుల రక్త నాళాల గోడలను వదులుగా చేసే ప్రొజెస్టెరాన్ ప్రభావం కారణంగా బీపీ సగం వరకు తగ్గిపోతుంది. అయితే ప్రసవ సమయం దగ్గరపడే కొద్దీ బీపీ గర్భధారణకు ముందు ఉన్న రీడింగ్ వరకు తిరిగి పెరుగుతుంది.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రక్తపోటుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వ్యక్తుల బీపీ 140/90 mm Hg వరకు ఉన్నా కూడా అది సాధారణమేనని తెలిపింది. ఇప్పటి వరకు బీపీ 120/80 mm Hgగా ఉంటే నార్మల్ బీపీగా పరిగణించేవారు. ఈ పరిధి దాటితే బీపీ ఉన్నట్టు భావించేవారు. ఈ లెక్కల్లో మార్పులు అవసరమని WHO తెలిపింది. దాదాపు 21 ఏళ్ల తరువాత సంస్థ బీపికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకనుంచి బీపీ 140/90 mm Hg వరకు ఉన్నా, దాన్ని నార్మల్ బీపీగానే పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Blood pressure, Health benefits, Health care