వెదురు చెట్ల బియ్యం: తిన్నోళ్లకు ఆరోగ్యం..గిరిజనులకు ఆదాయం

ఎన్నో ఔషద గుణాలున్న వెదురు బియ్యాన్ని పండించడం అసాధ్యం. అది ఎవ్వరి చేతుల్లోనూ లేదు. సహజంగా పండే వెదురు బియ్యం తప్ప.. ఇతర మార్గాల్లో వాటిని పండించేం. ఐతే వెదురు కొమ్ములు, లేత ఆకుల నుంచి రసం తీసి ముడి ధాన్యానికి పట్టించి..పచ్చని ముత్యాల్లాంటి బియ్యాన్ని కూడా తయారుచేస్తున్నారు.

news18-telugu
Updated: August 22, 2019, 5:18 PM IST
వెదురు చెట్ల బియ్యం: తిన్నోళ్లకు ఆరోగ్యం..గిరిజనులకు ఆదాయం
వెదురు బియ్యం
  • Share this:
భారతీయుల భోజనంలో అన్నం స్ధానాన్ని మరేదీ భర్తీ చేయలేదు. ముఖ్యంగా దక్షిణ భారత ప్రజలు మూడు పూటలా అన్నంతో చేసిన ఆహారపదార్థాలనే తింటారు. అన్నం కావాలంటే బియ్యం అవసరం. మరి వరి నుంచి మాత్రమే బియ్యం వస్తాయని మనకు తెలుసు. కానీ వెదురు చెట్ల నుంచి కూడా బియ్యం తీస్తారని తెలుసా? అవును..వెదురు చెట్టుకు బియ్యం కాస్తాయి. ఐతే ఈ విషయం చాలా మందికి తెలియదు.

సాధారణ వరి మాదిరిగానే వెదురు చెట్లకు పూతపడుతుంది. ఆ తర్వాత కంకులు పడతాయి.  ఐతే వెదురు మొక్క సాధారణంగా పూయదు. ఒకవేళ పూసినా ఏ వందేళ్లకో పూస్తుంది. అడవుల్లో ఉండే చాలా మంది గిరిజనులు కూడా తమ జీవిత కాలంలో ఎప్పుడూ వెదురుపూతను చూసి ఉండరు. కొన్ని వెదురు జాతులు మాత్రం 50 సంవత్సరాలకు ఒకసారి పూస్తుంటాయి. పూతపూశాక వెదురు బియ్యం కంకులు వచ్చాయంటే.. అది చనిపోయే సమయం ఆసన్నమైనట్లే..! అంటే జీవితకాలంలో వెదురు చెట్లు ఒకే ఒక్కసారి పూస్తాయన్నమాట.

ఎప్పుడో.. ఎక్కడో ..ఓ చోట పండే వెదురు బియ్యాన్ని గిరిజనులు సేకరించి చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. వెదురు బియ్యం రుచికరమైన, బలవర్ధక ఆహారం. ఇవి తియ్యగా ఉంటాయి. వరి బియ్యం, గోధుమ కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. అందుకే గిరిజనులు వాటిని భద్రపరచుకొని..అవసరమైనప్పుడు వండుకొని తింటారు. అరుదుగా దొరకడం..అందులోనూ ఎక్కువ పోషక విలువలు కలిగి ఉండడంతో.. ఈ బియ్యం చాలా ఖరీదైనవి. కొందరు డబ్బు కోసం వ్యాపారులకు అమ్ముకుంటారు. ఆ క్రమంలోనే వెదురు బియ్యం ఉంటాయన్న సంగతి అడవుల నుంచి బాహ్య ప్రపంచానికి తెలిసింది.


వెదురు బియ్యం ప్రత్యేకతలు ఏంటి?


1. ఔషద గుణాల శాతం ఎక్కువ.
2. శరీరంలో కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది.
3. విటమిన్ బీ6 సమృద్ధిగా ఉంటుంది.4. పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలం.
5. డయాబెటిక్, బీపీని నియంత్రించే గుణాలు
6. వరి బియ్యం, గోధుమ కంటే  ప్రొటీన్లు, పీచు ఎక్కువ.
7. సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
8. పిత్త, కఫ దోషాలు తొలగిపోతాయి.
9. శరీరంలోని ట్యాక్సీన్లు బయటకు తొలగిపోతాయి.
10. కీళ్లు, వెన్ను నొప్పి సమస్యలు తగ్గుతాయి.

తమిళనాడులోని కన్యాకుమారి అడవుల్లో కణి గిరిజనులు ఈ బియ్యాన్ని తింటున్నారు. అంతేకాదు మధ్యప్రదేశ్, మంగళూరు, కేరళలో వయనాడ్ సహా కొన్ని ప్రాంతాల్లో గిరిపుత్రులు వెదురు బియ్యాన్ని సేకరిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. బడా వ్యాపార సంస్థలు, కంపెనీలు సైతం అడవుల్లోని వెదురు బియ్యాన్ని ఆదివాసీల ద్వారా సేకరిస్తున్నాయి. వాటిని చక్కగా ప్యాక్ చేసి సూపర్ మార్కెట్‌లలో అమ్ముతున్నారు. అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లలోనూ వెదురు బియ్యం లభిస్తున్నాయి. కేజీకి 300 నుంచి 400 ధరలు పలుకుతున్నాయి.

ఎన్నో ఔషద గుణాలున్న వెదురు బియ్యాన్ని పండించడం అసాధ్యం. అది ఎవ్వరి చేతుల్లోనూ లేదు. సహజంగా పండే వెదురు బియ్యం తప్ప.. ఇతర మార్గాల్లో వాటిని పండించేం. ఐతే వెదురు కొమ్ములు, లేత ఆకుల నుంచి తీసిన రసాన్ని ముడి ధాన్యానికి పట్టించి..పచ్చని ముత్యాల్లాంటి బియ్యాన్ని కూడా తయారుచేస్తున్నారు. చూడ్డానికి అందంగా ఉండడంతో పాటు రుచికరంగానూ ఉంటాయి. ఐతే సహజంగా పండే వెదురు బియ్యం కంటే ఇందులో పోషక విలువలు కొంచెం తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల పచ్చిని వెదురు బియ్యం నుంచి 250 క్యాలరీలు లభిస్తే.. సహజ వెదురు బియ్యం నుంచి 350 క్యాలరీలు లభిస్తాయి.


వెదురు బియ్యంతో అన్నమే కాదు పాయసం, పొంగలి, బాంబూ రైస్ ఖీర్ వంటి చేసుకొని తినొచ్చు. ఈ ప్రకృతిసిద్ధమైన బియ్యంతో రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..!
First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు