కరోనా వైరస్ వెలుగు చూసిన తరువాత ప్రజల ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. పోషకాహారం తీసుకోవడంతో పాటు అనారోగ్యాలకు కారణమయ్యే పదార్థాలకు దూరంగా ఉంటున్నారు. వీలైనంతగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని అందించేవి ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వంటలకు ఆవనూనె వాడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇతర నూనెలతో పోలిస్తే ఆవ నూనెలో సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. వీటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తూ కడుపులో మంటను నియంత్రిస్తాయి. గుండె జబ్బులు, హైపర్ టెన్షన్, ఇతర గుండె సంబంధ అనారోగ్యాల ప్రమాదాన్ని ఆవనూనె తగ్గిస్తుందని గతంలో చేసిన పరిశోధనల్లో తేలింది. ఈ నూనెతో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
* ఆవనూనె ఆరోగ్యకరమైన వంటనూనెల్లో ఎల్లప్పుడూ ముందుటుంది. దీంట్లో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు తక్కువ మొత్తంలో ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే మోనోశాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, పాలీఅన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఆవనూనెలో ఉండే ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ ప్లేట్‌లెట్స్‌ను క్రమబద్దీకరిస్తూ, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
* ఆవనూనెలో అల్లైల్ ఐసోథియోసైనేట్ అనే ఫైటోకెమికల్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి పెద్దపేగు, జీర్ణాశయంలో ఏర్పడే మంట, వాపును తగ్గిస్తూ అనారోగ్యాలను దూరం చేస్తాయని సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం తేల్చింది.
* బరువు తగ్గాలనుకునేవారు ఆవ నూనెను క్రమం తప్పకుండా వంటల్లో వాడటం వల్ల ఫలితం కనిపిస్తుంది. ఈ నూనె విసెరల్ ఫ్యాట్ పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. ఈ వివరాలను ఏషియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురించారు.
* ఆవనూనెలో మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, పాలీ అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుతూ, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా బరువు తగ్గడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
Diabetes-Potatoes: షుగర్ ఉన్నవాళ్లు బంగాళాదుంపలు తినడం మంచిదేనా ? వైద్యులు చెబుతున్నదేమిటి ?
Heart Attack Risk: చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం లేనట్టే..
* ఇతర నూనెలు వేడి చేసినప్పుడు విడుదలయ్యే ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల గుండె పోటు రావచ్చు. దీనికి తోడు ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్‌ను వృద్ధి చేస్తాయి. ఇవి ఇతర అనారోగ్యాలకు కారణమవుతాయి. అందువల్ల ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు ఆవనూనెను వాడటం మంచిది. దీని స్మోకింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ట్రాన్స్ ఫాట్స్ తక్కువగా విడుదలవుతాయి. ఈ నూనె ఎన్నో రకాల అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health benefits