Sleepcations: ఇంట్లో సరిగ్గా నిద్ర పట్టట్లేదా? ఇక్కడ ట్రై చేయండి.. ఎంతో హాయి.. కంటినిండా నిద్ర

ప్రతీకాత్మక చిత్రం

కరోనా తర్వాత ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వలన చాలా మంది ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతోంది. ఈ టెన్షన్స్‌తో సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. అలాంటి వారికి సుఖంగా నిద్రపోయేందుకు అనువైన వాతావరణాన్ని పలు హోటల్స్ కల్పిస్తున్నాయి.

  • Share this:
కరోనా వైరస్ వల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి పెరిగిపోగా.. ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడం వల్ల చాలామంది శారీరక శ్రమ లేక నిద్ర పట్టక ఇబ్బందులు పడుతున్నారు. చాలామందికి ఉద్యోగాలు ఉంటాయో ఉండవో.. భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న అనుమానం మానసిక సమస్యలను తెచ్చి పెడుతుంది. కరోనా వల్ల ఇబ్బంది పడ్డ హోటల్ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. హోటళ్లకు కస్టమర్లను ఆకర్షించేందుకు ఆయా సంస్థలు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. అలాంటి వాటిలో ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్ స్లీప్ కేషన్.. స్లీప్, వెకేషన్‌‌ల కలయికే ఇది.

బెంగళూరులోని బెంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఐటీసీ లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సెంటర్‌తో పాటు ఓ లగ్జరీ హోటల్ కూడా కలిసి నిర్వహించిన ఓ అధ్యయనంలో ఇలాంటి స్లీప్ ప్యాకేజీలు నిద్ర నాణ్యతను పెంచి జీవితాన్ని ఆనందంగా మారుస్తాయని తేలిందట. గతేడాది కరోనా వల్ల టూర్లకు దూరమైన వారు ఇప్పుడిప్పుడే అన్ని ప్రదేశాలకు అనుమతులు అందిస్తుండడంతో టూర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కరోనా కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో మరీ ఎక్కువ దూరం వెళ్లకుండా స్టేకేషన్లకే ఇంకొందరు ఆసక్తి చూపిస్తున్నారు. చాలామంది ప్రొఫెషనల్స్ స్లీప్ కేషన్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది వారి వర్క్ లైఫ్ బ్యాలన్స్ ని, పనిలో ఉత్పాదకతను పెంచుతోందని అధ్యయనాలు తేల్చాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలా ఎక్కువ గంటల పాటు పని చేస్తూ ఉండడం, రాత్రి వరకూ టీవీ, ఓటీటీలు చూస్తూ మెలకువగా ఉండడం వల్ల నిద్ర షెడ్యూల్ దెబ్బతింటోంది. దీంతో పాటు అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు కూడా కలిసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. తద్వారా నిద్ర సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఇలాంటివారి కోసం చాలా హోటళ్లు స్లీప్ కేషన్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా చక్కటి పరుపు, దిండ్లు, ఎస్సెన్షియల్ ఆయిల్స్ వేసిన గదులతో పాటు స్పా ట్రీట్ మెంట్లు కూడా భాగం చేస్తున్నాయి. దీనికోసం చాలా హోటళ్లు ప్రత్యేకంగా మెనూని కూడా ఏర్పాటు చేయడం విశేషం. కరోనా వల్ల వచ్చిన అలసటను ఇలా తగ్గించుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

లండన్ యూనివర్సిటీ కాలేజ్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం ప్రతి పది మందిలో కేవలం ఒక్కరు మాత్రమే కరోనా సమయంలో తమకు హాయిగా నిద్రపట్టిందని చెప్పారట. 70000 మందిపై నిర్వహించిన ఈ స్టడీలో కేవలం 7.7 శాతం మంది మాత్రమే తమకు మంచి నిద్ర పట్టిందని చెప్పారు. నిద్ర క్వాలిటీ తగ్గేందుకు చాలా కారణాలను వెల్లడించారు నిపుణులు. తక్కువ ఆదాయం ఉన్నవారు, మానసిక, శారీరక సమస్యలు ఉన్నవారు నిద్ర పోవడానికి ఇబ్బంది పడ్డారని ఈ అధ్యయనంలో తేలింది. దీనికి కరోనా కారణంగా ఎదురైన ఆర్థిక, సామాజిక పరిస్థితులే కారణం అని నిపుణులు వెల్లడిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: