Mobile addiction in Kids: మీ పిల్లలకు మొబైల్ పిచ్చి పట్టుకుందా? ఈ సమస్యకు పరిష్కారాలివే..

పిల్లల్లో గ్యాడ్జెట్ల పట్ల ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. అస్తమానం మొబైల్ ఫోన్లో ఆడుతూ, ఏదో వీడియో చూస్తూ గడపడం అలవాటుగా మారిపోయి చివరికి రొటీన్ అయిపోతుంది. మరి దీనికి చెక్ పెట్టే మంత్రమే లేదా అంటే ఉంది.. ఎందుకు లేదు..

news18-telugu
Updated: November 27, 2020, 6:25 PM IST
Mobile addiction in Kids: మీ పిల్లలకు మొబైల్ పిచ్చి పట్టుకుందా? ఈ సమస్యకు పరిష్కారాలివే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెద్దలను చూసే పిల్లలు నేర్చుకుంటారనేది అక్షర సత్యం. కుటుంబ సభ్యులంతా పుస్తకాలు పట్టుకుని కూర్చుంటే పిల్లల్లో కూడా పుస్తకాలు చదివే అలవాటు చిన్నప్పటి నుంచి బాగా అలవడుతుంది. పెద్దల చేతిలో ఎప్పుడూ టీవీ రిమోట్, ఫోన్, ల్యాప్ టాప్ ఉంటే అది చూసిన పిల్లలు దాన్ని ఫాలో అవుతూ అదే కాపీ కొడతారు. దీంతో పిల్లల్లో గ్యాడ్జెట్ల పట్ల ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. అస్తమానం మొబైల్ ఫోన్లో ఆడుతూ, ఏదో వీడియో చూస్తూ గడపడం అలవాటుగా మారిపోయి చివరికి రొటీన్ అయిపోతుంది. మరి దీనికి చెక్ పెట్టే మంత్రమే లేదా అంటే ఉంది.. ఎందుకు లేదు..

మీరు చేసిన అలవాటే!

బిజీగా ఉన్న తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేక పిల్లల చేతిలో ఏ ఫోనో పెట్టి, వీడియో లేదా గేమ్ ప్లే చేసి ఇచ్చేస్తారు. ఆ తర్వాత క్రమంగా పిల్లలు దాన్నే ఇష్టపడడం, ఇదే వ్యసనంగా మార్చుకోవడం అవుతుంది. ఇవాళా రేపు అమ్మమ్మలు, నాన్నమ్మలు కూడా పిల్లలతో ఎక్కువ సమయం గడపటం లేకపోగా వారు కూడా ఏ మొబైల్లోనో టైం పాస్ (time pass) చేస్తున్నారు. దీన్ని చూసిన పిల్లలు వారి బాటలోనే నడుస్తున్నారు. ఆ తరువాత మొబైల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నారంటూ చిన్నారులంతా పెద్దలతో తిట్లు కూడా పడాల్సి వస్తోంది. తల్లి జాడే పిల్ల జాడ అన్న పాత సామెత మీకు గుర్తులేదా.

స్క్రీన్ టైం తగ్గేదెలా?
పిల్లల్లో స్క్రీన్ టైం (screen time) విపరీతంగా పెరగడానికి కారణం వారికి ఇక వేరే లోకం లేక డిజిటల్ ప్రపంచంలో (digital world) కాలం వెళ్లదీయాల్సి రావడమే. ప్రస్తుతం కరోనా ఉన్నందున బయటకు కూడా వెళ్లలేకపోతున్న వీరికి టైం పాస్ అంటే గ్యాడ్జెట్సే. ఇంట్లో ఏమూలకు వెళ్లినా వైఫై (wifi) వస్తుంది. ఇక ఎక్కడ చూసిన మొబైల్, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్, డెస్క్ టాప్, ట్యాబ్లెట్, ఐప్యాడ్ వంటివి కనిపిస్తూ ఊరిస్తుంటాయి. వీటిని చూడగానే వారికి తాము చూడాలనుకున్న యూ ట్యూబ్ వీడియో లేదా ఆడాలనుకున్న వీడియో గేమ్ గుర్తుకు వచ్చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతున్న సూచనల ప్రకారం 5 సంవత్సరాల్లోపున్న మీ చిన్నారి రోజంతా కలిపితే గంటకు మించి గ్యాడ్జెట్ స్క్రీన్ చూడడం మంచిది కాదు.

చిన్నారులకు ఫోన్ అలవాటు ఇలా..
అసలు చిన్నారులకు ఫోన్ ఎలా అలవాటు అవుతుందంటే వారు ఏడ్చినప్పుడు.. లేదా వారు అటూ ఇటూ కలియతిరుగుతూ ఉంటే ఒక చోట స్థిమితంగా కూర్చోమని పెద్దలు ఫోన్ ఇస్తారు. దీంతో వారికి ఇల్లంతా చురుగ్గా తిరిగే అలవాటు ఆదిలోనే పోతుంది. అంతే ఓ చోట అలా కూర్చుని మొబైల్ ఫోన్ చూస్తూ గడపడం ఊహ తెలియని వయసులోనే వారికి అలవాటు అయిపోతుందని 'వాట్ పేరెంట్స్ ఆస్క్' (what parents ask) సంస్థ పేరెంటింగ్ (parenting) కన్సల్టెంట్ అండ్ ఫౌండర్ డాక్టర్ దేబ్ మిత్ర దత్తా చెబుతున్నారు.

టీనేజర్లలో ప్రాణాంతకం
ఆన్ లైన్ గేమ్స్ అడిక్షన్ టీనేజర్లలో ప్రాణాంతకంగా మారింది. శారీరకంగా, మానసికంగా టీనేజర్లంతా మొబైల్ పైనా అత్యధికంగా ఆధారపడుతున్నారు. దీంతో ఫోన్ చేతిలో లేకపోతే, ఇంటర్నెట్ లేకపోతే వారికి ఊపిరాడనంత పనవుతుంది. మహారాష్ట్రలోని ఆనందవన్ అనే ఇంటర్నెట్ డీ అడిక్షన్ సెంటర్ కు (internet de addiction centre) ఒక్క జూన్ నెలలోనే ఏకంగా 2028 ఫోన్ కాల్స్ వచ్చాయంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. వీటిలో 1,112 కాల్స్ తల్లిదండ్రులవి కాగా.. తమ పిల్లల్లో మొబైల్ వాడకాన్ని తగ్గించడం ఎలా అని వారంతా ప్రశ్నల వర్షం కురిపించారు. రేయింబవళ్లు సోషల్ మీడియాలో నిమగ్నమైన టీనేజర్లు ఏం చేస్తున్నారో కూడా తల్లిదండ్రులకు ఒక దశలో తెలియడం లేదట. ఇలాంటి వారిలో ఓ బాలుడు ఏకంగా 18 గంటలపాటు రూములో తాళం వేసుకుని కంటిన్యూగా వీడియో గేమ్ ఆడాడడని డీ అడిక్షన్ సెంటర్ ఫౌండర్ డాక్టర్ అజయ్ దుధానే వివరిస్తున్నారు.

వర్చువల్ వరల్డ్ బాగుంది
సాధారణ ప్రపంచం కంటే వర్చువల్ వరల్డ్ (virtual world) పిల్లల కంటికి అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా టీనేజర్లు తరచూ తల్లిదండ్రులతో తిట్టించుకోవడాన్ని ఇష్టపడరు. పైగా తమను మరెవరితోనో పోల్చి మాట్లాడితే అసలు సహించరు. అందుకే వర్చువల్ వల్డ్ లో సంతోషాన్ని వెతుక్కుంటా తమకు నిజ జీవితంలో దక్కాల్సిన లైకులను సోషల్ మీడియాలో (social media) సొంతం చేసుకుని ఆనందిస్తారు. అందుకే లైకుల కోసం పడిచచ్చేవారిలో అత్యధికులు టీనేజర్లే ఉంటారని డాక్టర్ దత్తా విశ్లేషిస్తున్నారు. ఒక్క సంతానమే ఉన్న ఇంట్లో పిల్లలకు తోడు లేక వినోదం కోసం ఫోన్లపై ఆధారపడుతున్నారు.

పరిష్కారాలు ఇవే..
ఇండోర్ గేమ్స్ ను క్రమంగా అలవాటు చేయటంపై ఫోకస్ పెట్టండి. పిల్లలతో ఆడటాన్ని పెద్దలు వ్యాపకంగా పెట్టుకోవాలి. పెద్దలు స్క్రీన్ టైంను బాగా తగ్గించుకుంటే పిల్లలు కూడా అలాగే చేసే అవకాశాలు ఎక్కువ. వీలైతే కాసేపు వైఫై నియంత్రణ మీ చేతుల్లోకి తీసుకుని దాన్ని ఆఫ్ చేస్తూ, పిల్లలకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా చర్యలు తీసుకోండి. స్క్రీన్ డీ అడిక్షన్ సెంటర్ కు వెళ్లేవరకు పరిస్థితి తెచ్చుకోకుండా మీకు మీరే స్వయం నియంత్రణా విధానాన్ని అలవాటు చేసుకుంటే అది పిల్లల్లోనూ మార్పు తెస్తుంది.
Published by: Nikhil Kumar S
First published: November 27, 2020, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading