ఆ మందులతో పిల్లలకు మేలు కంటే కీడే ఎక్కువ.. పేరెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..

తాత్కాలిక వ్యాధులను నయం చేయడానికి శిశువులకు ఇచ్చే యాంటీబయోటిక్స్, అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయని తాజా పరిశోధన వెల్లడించింది. పిల్లలకు (రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఆస్తమా, తామర, ఫుడ్ అలర్జీలు, బరువు హెచ్చుతగ్గులు, ఊబకాయం వంటి సమస్యల ప్రమాదాలు పెరుగుతాయని ఈ అధ్యయనంలో కనుగొన్నారు.

news18-telugu
Updated: November 17, 2020, 2:55 PM IST
ఆ మందులతో పిల్లలకు మేలు కంటే కీడే ఎక్కువ.. పేరెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యాంటీబయాటిక్ మందుల వల్ల దుష్ర్పభావాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తాత్కాలిక వ్యాధులను నయం చేయడానికి శిశువులకు ఇచ్చే యాంటీబయోటిక్స్, అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయని తాజా పరిశోధన వెల్లడించింది. పిల్లలకు (రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఆస్తమా, తామర, ఫుడ్ అలర్జీలు, బరువు హెచ్చుతగ్గులు, ఊబకాయం వంటి శారీరక సమస్యలు, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి మానసిక సమస్యల ప్రమాదాలు పెరుగుతాయని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. ఇలాంటి మందులను తక్కువ మోతాదులో పిల్లలకు ఇచ్చినా అనారోగ్యాల ప్రమాదం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. తాజా పరిశోధనకు సంబంధిన వివరాలను మాయో క్లినిక్ ప్రొసీడింగ్స్‌ జర్నల్‌లో ప్రచురించారు.

పిల్లల జెండర్, వయస్సు, మందుల మోతాదు, మందుల రకం వంటి అంశాలపై అనారోగ్యాల ప్రభావం ఆధారపడి ఉంటుందని అధ్యయన బృంద సభ్యుడు నాథన్ లెబ్రాస్సేర్ చెప్పారు. ఆయన మాయో క్లినిక్ సెంటర్‌లో రిసెర్చర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఫలితాలు చిన్న పిల్లలకు చికిత్స చేసేటప్పుడు ఇచ్చే యాంటీబయాటిక్స్ మోతాదు, సురక్షితమైన వాడకం వంటి అంశాలను విశ్లేషించడానికి ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.

వేరే అధ్యయనం నుంచి డేటా
తాజా పరిశోధన కోసం అవసరమైన సమాచారాన్ని రోచెస్టర్ ఎపిడమాలజీ ప్రాజెక్ట్ నుంచి సేకరించారు. గతంలో ఈ ప్రాజెక్టు కోసం వాలంటీర్ల మెడికల్ డేటాను సేకరించి దీర్ఘకాలిక అధ్యయనం చేశారు. సుమారు 14,500 మంది పిల్లల డేటాను ఈ అధ్యయనం కోసం విశ్లేషించారు. వీరిలో 70 శాతం మందికి చిన్న వయసులో అనారోగ్యాలకు చికిత్స కోసం యాంటీబయాటిక్స్ ఇచ్చినట్లు గుర్తించారు.

పెరుగుతున్న ప్రమాద తీవ్రత
ఎలాంటి మందులు వాడని వారితో పోలిస్తే, ఒకటి లేదా రెండుసార్లు (ప్రిస్క్రిప్షన్ పీరియడ్) యాంటీబయాటిక్స్ వాడిన బాలికలకు కడుపులో సమస్యలు, ఉబ్బసం వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలినట్లు లెబ్రాస్సేర్ చెప్పారు. మూడు నుంచి నాలుగు సార్లు ప్రిస్కిప్షన్‌ల ద్వారా మందులు వాడిన వారిలో ఆస్తమా, చర్మ సమస్యలు, అధిక బరువు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఐదు కంటే ఎక్కువ సార్లు వైద్యుల ప్రిస్క్రిస్షన్‌ ద్వారా మందులు వాడిన పిల్లల్లో ఈ ప్రమాదాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అత్యంత సాధారణ యాంటీబయాటిక్‌గా పేరున్న పెన్సిలిన్ మందుకు ఈ పరిస్థితులన్నిటింతో సంబంధం ఉండటం విశేషం. మరో యాంటీబయాటిక్ సెఫలోస్పోరిన్ వల్ల ఆటిజం, ఫుడ్ అలర్జీ వంటి ప్రమాదకర అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు.

గట్ బ్యాక్టీరియాపై ప్రభావం

యాంటీబయాటిక్ మందుల వల్ల కడుపులో ఉండే సహజమైన గట్ బ్యాక్టీరియా దెబ్బతినే అవకాశం ఉండొచ్చని లెబ్రాస్సేర్ బృందం తెలిపింది. సరైన రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడానికి, నాడీ వ్యవస్థ, శారీరక వృద్ధికి గట్ బ్యాక్టీరియా తోడ్పడుతుంది. సాధారణంగా యాంటీబయాటిక్స్ మందులు బ్యాక్టీరియాను చంపాలనే లక్ష్యంతో పనిచేస్తాయి. ఈ క్రమంలో మనకు మేలు చేసే గట్ బ్యాక్టీరియా, అనారోగ్యాలకు కారణమయ్యే బయటి బ్యాక్టీరియాకు మధ్య తేడాను అవి గుర్తించలేవు. ఇదే సమస్యకు కారణమవుతోంది.

నివారించడం సాధ్యమేనా?
జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి, శరీరం పోషకాలను గ్రహించడానికి గట్ బ్యాక్టీరియా సహాయం చేస్తుంది. ఇది యాంటీబయాటిక్స్ మందుల ప్రభావానికి గురవుతుంది. ముఖ్యంగా అప్పుడప్పుడే రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందే శిశువుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. గట్ బ్యాక్టీరియా కెమోథెరపీ, బ్రెయిన్ కెమిస్ట్రీ ప్రతిస్పందనలతో సంబంధం కలిగి ఉంది. కానీ అనారోగ్యాలను నివారించడానికి ఇలాంటి మందులు ఇవ్వకుండా చికిత్స చేయడం అసాధ్యం. పిల్లలకు ఇచ్చే యాంటీబయాటిక్స్ మోతాదులను పరిమితం చేయడం కష్టమైన విషయమని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. ఈ అధ్యయనం ఫలితాలను నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని వారు చెబుతున్నారు.
Published by: Nikhil Kumar S
First published: November 17, 2020, 2:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading