• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • ANTI VIRUS MASK THE YOUNG WOMAN WHO CREATED THE MASK THAT ENDS THE CORONA GOOGLE PRAISED MK GH

Anti virus mask: కరోనాను అంతం చేసే మాస్కును రూపొందించిన యువతి...Google ప్రశంస..

Anti virus mask: కరోనాను అంతం చేసే మాస్కును రూపొందించిన యువతి...Google ప్రశంస..

ప్రతీకాత్మకచిత్రం

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 17 ఏళ్ల యువతి.. కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసే ఒక హైటెక్ మాస్కును అభివృద్ధి చేసింది. దిగాంతిక బోస్ అనే ఈ యువతి 12వ తరగతి చదువుతోంది. శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ఈ విద్యార్థిని వైరస్ నిరోధక ఇన్హేలర్ మాస్క్‌ను రూపొందించింది.

  • Share this:
కరోనా మహమ్మారిని నిరోధించే పద్ధతులు, మందులు, పరికరాలపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వైరస్ ముప్పును తగ్గించే కొన్ని ఆవిష్కరణలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన 17 ఏళ్ల యువతి.. కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసే ఒక హైటెక్ మాస్కును అభివృద్ధి చేసింది. దిగాంతిక బోస్ అనే ఈ యువతి 12వ తరగతి చదువుతోంది. శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ఈ విద్యార్థిని వైరస్ నిరోధక ఇన్హేలర్ మాస్క్‌ను రూపొందించింది. ఇంత చిన్న వయసులో వైరస్‌ను నాశనం చేసే మాస్కును రూపొందించడం గొప్ప విషయమని ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలోని తూర్పు బుర్ద్వాన్‌కు చెందిన ఈ బాలిక ఆవిష్కరణను గూగుల్ సైతం గుర్తించింది. ప్రపంచంలోని పది స్ఫూర్తిదాయకమైన డిజైన్లలో ఈ మాస్కును చేర్చి, దిగాంతికను ప్రశంసించింది గూగుల్.

ఈ యాంటీ వైరస్ మాస్కులో ఒక ప్రత్యేకమైన కెమికల్ ఛాంబర్ ఉంటుంది. ఒకవేళ గాలిలో వైరస్ ఉంటే.. మాస్కులో ఉండే కెమికల్ చాంబర్ దాన్ని నాశనం చేస్తుంది. ఇదే విధంగా కోవిడ్ బారిన పడిన వ్యక్తి నుంచి విడుదలయ్యే వైరస్ కూడా బయటకు రాకుండా మాస్కులోని వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. తద్వారా వైరస్ గాలిలో కలిసిపోదు. ఈ మాస్కులో ఎయిర్ అయనైజర్ కూడా ఉంది. ఇది గాలిలోని దుమ్ము, ఇతర మలినాలను విడదీసి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి సహాయపడుతుంది.

ఎలా పనిచేస్తుంది?
గాలిలో ఉండే వైరస్‌ను గుర్తించే నెగిటివ్ అయాన్, దాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని చెబుతోంది దిగాంతిక. అయితే ఇది అన్ని రకాల వైరస్‌లను నిర్వీర్యం చేయకపోవచ్చని ఆమె పేర్కొంది. ఈ మాస్కు తయారీలో బ్యాటరీతో నడిచే సర్క్యూట్‌, రెండు ఫిల్టర్ ట్యూబ్‌లు, సబ్బు నీటిని ఆమె ఉపయోగించింది. మాస్కులోని వ్యవస్థ పనితీరును దిగాంతిక వివరించింది. ‘బ్యాటరీతో నడిచే సర్క్యూట్ ద్వారా నెగిటివ్ అయాన్లు ఉత్పన్నమవుతాయి. ఇవి మాస్కులోకి వచ్చే గాలిలోని దుమ్ము, వైరస్‌లను నాశనం చేస్తాయి. అనంతరం సబ్బు నీరు మిగిలిన క్రిములను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. మాస్కులో సబ్బు నీరు రెండు ట్యూబ్‌ల మధ్య ఉంటుంది. మాస్కు ధరించినవారు శ్వాస తీసుకున్నప్పుడు.. గాలి ట్యూబ్‌ల నుంచి వెళ్తుంది. ఈ క్రమంలో అది సబ్బు నీటితో కాంటాక్ట్ అవుతుంది. ఫలితంగా గాలిలో మిగిలిన వైరస్‌లు కూడా నాశనం అవుతాయి’ అని దిగాంతిక వివరించింది.

గుర్తించిన గూగుల్
కోవిడ్-19 రోగుల చికిత్సలో వాడనున్న అస్త్రంగా ఈ ప్రత్యేకమైన 'ఎయిర్ ప్రొవైడింగ్ అండ్ వైరస్ డిస్ట్రాయింగ్' మాస్కు నిలవనుందని నిపుణులు భావిస్తున్నారు. ఆమె డిజైన్ జాతీయ పోటీల్లో సైతం షార్ట్ లిస్ట్ అయింది. దిగాంతిక ప్రయోగాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అభినందించింది. దీన్ని మార్కెట్లోకి విడుదల చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఈ యాంటీ వైరస్ మాస్కును ప్రపంచంలోని టాప్ 10 స్ఫూర్తిదాయక డిజైన్లలో ఒకటిగా గుర్తించడం విశేషం.

దిగాంతిక ఈస్ట్ బుర్ద్వాన్‌లోని మేమారి వి.ఎమ్ ఇన్స్టిట్యూషన్‌లో పన్నెండో తరగతి చదువుతోంది. ఆమె ఇప్పటికే 11 ఆవిష్కరణలకు ప్రాణం పోసింది. నాలుగో తరగతిలో ఉన్నప్పుడే 360 డిగ్రీల కోణంలో చూడగలిగే కళ్లద్దాలను రూపొందించింది. సుందర్‌బన్ ప్రాంతంలోని ప్రజలు పులుల వేటకు బలికాకుండా ఉండేందుకు వీటిని అభివృద్ధి చేసింది. ఆ తరువాత మరిన్ని ఆవిష్కరణలు చేసింది.
Published by:Krishna Adithya
First published: