Fasting Foods: ముస్లింలకు అతి ముఖ్యమైన పండుగల్లో రంజాన్(Ramadan) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా పవిత్రమైన రంజాన్ మాసం ఇటీవల ప్రారంభమైంది. ఈ సమయంలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష(Fasting) చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. ఈనెల రోజుల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వారు ఆహారం, పానీయాలు అసలు తీసుకోరు. ఆరోగ్యం బాగా ఉన్నవారికి ఉపవాసం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. అయితే మధుమేహంతో బాధపడేవారికి ఇది సవాల్ లాంటిది. ఈనేపథ్యంలో షుగర్ పేషెంట్స్ రంజాన్ ఉపవాసం సందర్భంగా ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలిద్దాం.
సాధారణంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులు గురికాకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇక రంజాన్ నెలలో ఉపవాసం చేస్తున్నందున ఆహారం విషయంలో షుగర్ వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎంపిక చేసిన కొన్ని పదార్థాలను మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* తృణధాన్యాలు
ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు తృణధాన్యాలు పవర్ హౌస్ లాంటివి. మధుమేహ రోగులు రంజాన్ నెల ఉపవాస విరమణ సమయాల్లో బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్ బ్రెడ్ వంటి తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. రక్తప్రవాహంలోకి చక్కెర శోషణను ఇవి నెమ్మదిస్తాయి. తృణధాన్యాలతో రొట్టెలను తయారు చేసుకుని కూడా ఆహారంగా తీసుకోవచ్చు. ఈ రొట్టెల్లో సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో షుగర్ వ్యాధిగ్రస్తులు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి నెమ్మదిగా, స్థిరంగా విడుదల అవుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే చీజ్, చికెన్, ఫిష్ వంటి వాటితో కలిపి వీటిని తీసుకుంటే ఉపవాస సమయాల్లో ఎలాంటి ఆరోగ్య సమస్య వేధించదు.
* పప్పుధాన్యాలు
రంజాన్ ఉపవాస విరమణ సమయాల్లో షుగర్ వ్యాధిగ్రస్తులు ఆహారంగా శనగలు, వేరుశనగలు, పెసలు, అలసందలు వంటి పప్పుధాన్యాలను తీసుకోవచ్చు. వీటిలో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి లో గ్లైసెమిక్ ఇండెక్స్‌తో ఉంటాయి. కాబట్టి ఈ పప్పుధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా నిరోధిస్తాయి.
* తాజా పండ్లు
తాజా పండ్లలో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ అధిక మొత్తంలో ఉంటాయి. షుగర్ పేషెంట్స్ రంజాన్ ఉపవాస విరమణ సమయాల్లో పుచ్చకాయ, బొప్పాయి, యాపిల్స్, దానిమ్మ, సపోట, జామ వంటి పండ్లు తీసుకోవాలి. దీంతో శరీరానికి కావాల్సిన శక్తి త్వరగా అందడంతో పాటు రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
అసెంబ్లీలో బూతు వీడియో చూసిన BJP ఎమ్మెల్యే.. రచ్చ రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు
* గింజలు, విత్తనాలు
గింజలు, విత్తనాల్లో కూడా ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అయితే కేలరీలు వీటిలో అధికంగా ఉంటాయి. దీంతో షుగర్ వ్యాధిగ్రస్తులు వీటిని మితంగా తీసుకోవాలి. ప్రధానంగా అవిసె గింజలు, చియా గింజలు, బాదం, వాల్‌నట్స్ వంటివి పరిమితంగా తీసుకోవాలి.
* కూరగాయలు
కీరదోస, పాలకూర, బచ్చలికూర, క్యారెట్ వంటి తాజా కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు రంజాన్ నెల ఉపవాస సమయాల్లో కూరగాయలు మంచి ఆహారం. కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. పైగా రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
* ఖర్జూరం
రంజాన్ నెలలో ఉపవాసం విరమించినప్పుడు ముస్లింలు ఎక్కువగా ఖర్జూరాలను ఆహారంగా తీసుకుంటారు. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తిన్న వెంటనే శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. అంతేకాకుండా రక్తప్రవాహంలోకి చక్కెర శోషణ(స్వీకరణ)ను నెమ్మదిస్తుంది. అయితే ఖర్జూరంలో కూడా సహజ చక్కెరలు ఉంటాయి. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఉపవాసం సమయంలో వీటిని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fasting, Ramzan, Ramzan 2023