PCOS Diet: పీసీఓఎస్‌తో బాధపడుతున్నారా? ఈ 5 సూపర్ ఫుడ్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి

ప్రతీకాత్మక చిత్రం

జీవనశైలితో పాటు ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యకు దూరం కావచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. PCOS, PCOD బాధితులు ఆహారంలో తీసుకోవాల్సిన కొన్ని సూపర్ ఫుడ్స్‌ను వారు సూచిస్తున్నారు. అవేంటంటే..

  • Share this:
ప్రస్తుత జీవనశైలి కారణంగా యువతులు, మహిళలను వేధిస్తున్న ప్రధాన సమస్య.. హార్మోన్ల అసమతుల్యత. ఇది పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (సీసీఓఎస్), పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ) వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది. దేశంలో 20-29 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిలో దాదాపు 16 శాతం మంది మహిళలు PCOS లేదా PCODతో బాధపడుతున్నారని కొన్ని సర్వేలు తేల్చాయి. దీనిబారిన పడిన వారిలో రుతుక్రమంలో మార్పులు, అండాశయాల్లో తిత్తులు ఏర్పడటం, బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం, అవాంఛిత రోమాలు, మధుమేహం, గర్భధారణ సమస్యలు.. వంటి అనారోగ్యాలు ఎదురవుతాయి. అయితే జీవనశైలితో పాటు ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యకు దూరం కావచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. PCOS, PCOD బాధితులు ఆహారంలో తీసుకోవాల్సిన కొన్ని సూపర్ ఫుడ్స్‌ను వారు సూచిస్తున్నారు. అవేంటంటే..

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్
హార్మోన్ల అసమతుల్యతను సరిచేసే ప్రధాన పోషకం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్. ఇది సాల్మన్, సార్డిన్ వంటి కొన్ని రకాల సముద్ర చేపల ద్వారా పుష్కలంగా ఉంటుంది. బరువు పెరగడానికి కారణమయ్యే ఒత్తిడి స్థాయిలను నియంత్రిస్తూ, మంటను తగ్గించడానికి ఒమేగా-3 పోషకం సహాయపడుతుంది. ఈ చేపలు అందుబాటులో లేకపోతే చేప నూనె సప్లిమెంట్లను తీసుకోవచ్చు. శాకాహారులు అవిసె గింజలు లేదా వాల్‌నట్స్‌ తీసుకోవచ్చు.

ఆకు కూరలు
పీసీఓడీ, పీసీఓఎస్ వంటి సమస్యల బారిన పడిన వారు విటమిన్ బి అధికంగా లభించే పదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరల్లో ఈ పోషకం పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల మహిళలు ఆహారంలో తీసుకోవాల్సిన పదార్థాల్లో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలని చెబుతుంటారు పోషకాహార నిపుణులు. వీటిలో విటమిన్- బి తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి అండాల విడుదలను క్రమబద్దీకరిస్తాయి. ఇన్సులిన్‌ను నియంత్రించడంతో పాటు శరీరంలో రక్త ప్రవాహాన్ని క్రమబద్దీకరించడం ద్వారా సంతానోత్పత్తికి తోడ్పడతాయి.

బెర్రీలు
పీసీఓఎస్ ఉన్న రోగులు బెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేషన్‌ స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. బెర్రీలలో ఉండే పాలీఫెనాల్స్ బరువును అదుపులో ఉంచుతాయి. మధుమేహం, అజీర్తి ఇతర సమస్యలను సైతం దూరం చేస్తాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీల మిశ్రమాన్ని పెరుగుతో కలిపి తీసుకోవడం మంచిది.

ఓట్స్
ఓట్స్‌లో కరిగే, కరగని ఫైబర్స్ ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు, చక్కెర శోషణను నెమ్మదిస్తాయి. ఓట్స్‌లో విటమిన్ బి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతూ పీసీఓఎస్ సమస్యను నియంత్రిస్తుంది. ఓట్స్‌లోని జింక్.. పీసీఓఎస్ బాధితుల్లో జుట్టు పెరుగుదలకు సైతం ఉపయోగపడుతుంది.

పప్పు ధాన్యాలు
పోషకాలు అధికంగా ఉండే జీరో కొలెస్ట్రాల్‌ ఫుడ్స్ అయిన చిక్‌పీ, బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు, సోయాబీన్స్‌ వంటి చిక్కుళ్లు, పప్పు ధాన్యాల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పప్పుధాన్యాలు డయాబెటిస్ నిర్వహణకు తోడ్పడతాయి. ఇవి రక్తంలో చక్కెరను సైతం నియంత్రిస్తాయి. దీంతోపాటు వీటిలో ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందువల్ల పీసీఓఎస్ బాధితులు బీన్స్, పప్పుధాన్యాలు, బఠానీలు వంటి వాటిని సైడ్ డిష్‌గా లేదా సలాడ్‌లు, ర్యాప్స్ లేదా టాకోస్‌తో కలిపి తరచుగా తీసుకోవాలి.
Published by:Krishna Adithya
First published: