300 నుంచి 86 కేజీలకు బరువు తగ్గిన మహిళ...లిమ్కా బుక్‌లో రికార్డ్

అలా కొన్ని రోజుల చికిత్స తర్వాత అమితా రజనీ శరీరంలోని కొవ్వంతా కరిగిపోయి నాజూగ్గా తయారయ్యారు. 300 కేజీల నుంచి 86 కేజీలకు బరువు తగ్గి లిమ్కా బుక్‌లో స్థానం సంపాదించారు.

news18-telugu
Updated: May 9, 2019, 10:12 PM IST
300 నుంచి 86 కేజీలకు బరువు తగ్గిన మహిళ...లిమ్కా బుక్‌లో రికార్డ్
అమితా రజని
  • Share this:
నేటి ప్రపంచంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే బరువులో సెంచరీ కొడుతున్నారు. సాధారణంగా 80 కేజీలకు బరువు పెరిగితేనే ఎంతో ఇబ్బంది పడతారు. ఒక్కసారి బరువు పెరిగిన తర్వాత తగ్గాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఆ మహిళ ఏకంగా 300 కేజీల నుంచి 86 కేజీలకు తగ్గి లిమ్కా బుక్ రికార్డు సాధించారు. ముంబై డాక్టర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఆమెకు కొత్త జీవితం ప్రసాదించారు.

మహారాష్ట్రలోని వాసయ్ ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల అమితా రజని కొంతకాలంగా ఒబెసిటీతో బాధపడుతున్నారు. 300 కేజీలతో ఆసియాలోనే బరువైన మహిళగా ఆమెకు పేరుంది. భారీ కాయంతో రజనీ నిత్యం నరకయాతన చూశారు. ప్రతి పనికీ కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వచ్చేది. కూర్చున్న చోటునుంచి కదలాలన్న కష్టంగా ఉండేది. దీనికి తోడు కిడ్నీ, డయాబెటిస్ సమస్యలు కూడా వచ్చాయి. నలుగురితో కలవాలని ఉన్నా..సాధ్యమయ్యేది కాదు. అలా ఒంటరిగా ఉండి డిప్రెషన్‌లోకి వెళ్లారు రజనీ. ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచనలు సైతం ఒక్కోసారి వచ్చేవి. ఆ క్రమంలో కుటుంబ సభ్యులంతా ఆమెకు అండగా ఉండి ధైర్యం చెప్పేవారు.

రజని కుటుంబ సభ్యలకు ఊబకాయ చికిత్సలో నిష్ణాతుడైన డాక్టర్ శశాంక్ షా గురించి తెలిసింది. అనంతరం రజనీని డాక్టర్ వద్దకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఐతే ఆమె సమస్యకు బేరియాట్రిక్ సర్జరీ ఒక్కటే మార్గమని డాక్టర్ చెప్పారు. అంతేకాదు ఆ సర్జరీతో ఎదురయ్యే ఇబ్బందుల గురించి కూడా తెలియజేశారు. బేరియాట్రిక్ సర్జరీ చేస్తే ఇన్‌ఫెక్షన్లు, రక్తం గడ్డకట్టడం, కిడ్నీ ఫెయిల్ కావడం వంటి ముప్పు వచ్చే అవకాశముందని చెప్పారు. దాంతో ఆమె భయపడిపోయారు. ఆపరేషన్ చేయించుకునేందుకు నిరాకరించారు. కానీ డాక్టర్ శశాంక్ షా ధైర్యం చెప్పి చివరకు సర్జరీ చేశారు.

బేరియాట్రిక్ సర్జరీ పూర్తైన తర్వాత నెల రోజుల పాటు ఆమె పరిస్థితిని డాక్టర్ శశాంక్ దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రత్యేక వ్యాయామంతో పాటు ఆహార నియమాలను అలవాటు చేశారు. రక్తం గడ్డకట్టకుడా తరచూ ఇంజెక్షన్‌లు ఇచ్చేవారు. అలా కొన్ని రోజుల చికిత్స తర్వాత అమితా రజనీ శరీరంలోని కొవ్వంతా కరిగిపోయి నాజూగ్గా తయారయ్యారు. 300 కేజీల నుంచి 86 కేజీలకు బరువు తగ్గారు. ఏకంగా 214 కేజీలు తగ్గి లిమ్కా బుక్‌లో స్థానం సంపాదించారు. ఇప్పుడు అందరిలానే తన పని తాను చేసుకుంటూ..నలుగురితో కలిసిపోతున్నారు. కొత్త జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు.
First published: May 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading