హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

రండి.. లాక్ డౌన్‌ 21 రోజుల్లో 21 పాఠాలు నేర్చుకుందాం...

రండి.. లాక్ డౌన్‌ 21 రోజుల్లో 21 పాఠాలు నేర్చుకుందాం...

ప్రతీకాత్మక చిత్రం  (Image;Pexels)

ప్రతీకాత్మక చిత్రం (Image;Pexels)

మనం మన ప్రియమైన వారితో, ఆప్తులతో అన్యోన్యంగా గడిపి ఎన్నాళ్లైంది?. కాలం అనేది తెలియకుండా ఆనందంగా గడిపిన చివరి సమయం ఏదో గుర్తుందా?

(కె.అన్నామలై, మాజీ ఐపీఎస్ అధికారి, కర్ణాటక)

కరోనా వైరస్ అనేది ఓ శతాబ్దానికి వచ్చే ఘటన. నాసిమ్ నికోలస్ తాలిబ్ చెప్పినట్టు ఇది ఒక అకస్మాత్తుగా వచ్చిపడే ఉపద్రవం. దీన్ని ఊహించలేం. ముందస్తు చర్యలు కూడా తీసుకోలేం. దీని వల్ల మనం జీవితాలు షేక్ అయ్యాయనడంలో ఆశ్చర్యం లేదు. చాలా మంది భయపడుతున్నాం. అయితే, ఈ లాక్ డౌన్ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం మరోలా ఉంటుంది. మనం ఆర్థికంగా దెబ్బతినొచ్చు. మనకు ప్రియమైన వారిని కూడా కోల్పోవచ్చు. ముఖ్యంగా ప్రజల మీద అపనమ్మకం కూడా కలగొచ్చు, ఇప్పుడు కొంతమంది చేస్తున్నట్టు.

మనం జీవితాన్ని మన దృష్టికోణం నుంచి కాకుండా ప్రత్యేకంగా చూడడానికి ధైర్యం చేయగలమా?

1. మనం మన ప్రియమైన వారితో, ఆప్తులతో అన్యోన్యంగా గడిపి ఎన్నాళ్లైంది?

2. కాలం అనేది తెలియకుండా ఆనందంగా గడిపిన చివరి సమయం ఏదో గుర్తుందా?

3. మనల్ని మనం మర్చిపోయిన రోజులు గతంలో ఎప్పుడొచ్చాయో గుర్తున్నాయా?, ఇప్పటి వరకు మన జీవితం అంతా మన కెరీర్, మన లైఫ్, మన ఇంక్రిమెంట్లు, బాస్‌ను ఎలా మెప్పించాలనే దాని మీదే నడించింది.

4. మన జీవితం మీద మన కంట్రోల్ లేకుండా చివరిసారి ఎప్పుడు గడిపామో గుర్తుందా? మనుషులుగా మనం కంట్రోల్‌లో ఉండాలనుకుంటాం. అందులోనే ఉన్నతంగా కూడా ఉండాలనుకుంటాం. కదా?

మన ఆలోచనా విధానాన్ని మార్చుకుని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, మన భవితకు కొత్త రంగులు అద్దుకోవడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నా. మనం దాన్ని సాధించగలం. అందుకు కావాల్సిందల్లా ఒక్కటే. సంకల్పం.

2018లో నాకో సంఘటన ఎదురైంది. అప్పుడు నేను కైలాస మానస సరోవర్ యాత్రకు లైజనింగ్ ఆఫీసర్‌గా ఉన్నా. భారత విదేశాంగ శాఖ మంత్రి ప్రతినిధిగా అందులో పాల్గొన్నా. ఢిల్లీ నుంచి యాత్రికులను మానససరోవర్ యాత్రకు తీసుకుని వెళ్లి, మళ్లీ క్షేమంగా ఢిల్లీకి చేర్చడం మా విధి. జూలై 20న ఢిల్లీ నుంచి మా బృందం యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి ఉత్తరాఖండ్, అటు నుంచి టిబెట్ వెళ్లాలి. ఇది 23 రోజుల ట్రిప్. పక్కా ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ ఫిక్స్ చేశాం. 2018 ఆగస్ట్ 11న మళ్లీ ఢిల్లీకి రావాలి. నేను ఎంత పకడ్బందీగా ట్రిప్ ప్లాన్ చేశానంటే రిటర్న్ ఫ్లైట్ టికెట్ బెంగళూరుకు కూడా తీసేసుకున్నా. అయితే, మా ప్రయాణం మొదలైన మూడో రోజు నుంచి ఏం జరిగిందనేది నిజంగా ఓ కథే. దాన్ని కచ్చితంగా గుర్తు చేసుకోవాలి.

ఉత్తరాఖండ్ లోని పితూర్‌గఢ్ నుంచి గుంజి వరకు ఎంఐ 7 చాపర్లు ప్రయాణికులను తీసుకుని వెళ్లి తీసుకుని వస్తున్నాయి. భారీగా మేఘాలు కమ్ముకుని ఉండడంతో మా కన్నా ముందు బ్యాచ్‌ల వారిని తీసుకుని వెళ్లడం తీసుకుని రావడం ఆలస్యమైంది. సడన్‌గా కేరళలో కూడా వరదలు రావడంతో అక్కడి నుంచి కొన్ని చాపర్లను వరద సహాయక చర్యల కోసం పంపించారు. మేం గుంజి (భారత్‌ - టిబెట్‌ బోర్డర్‌లో చిట్టచివరి గ్రామం.) వెళ్లేటప్పటికే అనుకున్నదాని కంటే వారం రోజులు ఆలస్యం అయింది. అప్పటికే మాకు చైనీస్ ఇచ్చిన వీసా గడువు ముగిసిపోయింది. మమ్మల్ని అక్కడే ఉంచి, వీసాలు మళ్లీ తీసుకోవాలని నిర్ణయించారు. మా బ్యాచ్‌ వాళ్లను జాగ్రత్తగా చూసుకోని నాకు చెప్పి, నాతోపాటు ఉన్న మరో లైజనింగ్ ఆఫీసర్ మళ్లీ రెండు విమానాలు పట్టుకుని ఢిల్లీ వెళ్లాడు.

ఇక్కడ సందర్భం కాకపోయినా చెప్పాల్సిన విషయం ఒకటుంది. మా బ్యాచ్‌లో గుజరాత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి ఉన్నాడు. అదే సమయంలో జోలిపట్టి (తమ దగ్గర డబ్బులు ఉన్నా కూడా ప్రజల వద్ద జోలి పట్టి వచ్చిన డబ్బుతో తీర్థయాత్రలకు వెళ్తారు. అది సంప్రదాయం.) తీర్థయాత్రకు వచ్చిన వ్యక్తి కూడా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఇంటి గడప దాటని మహిళ కూడా ఉంది. హర్యానా నుంచి వచ్చిన ఓ పేద మెకానిక్ కూడా ఉన్నాడు. అందరిదీ ఒక్కటే బాధ. అందులో కొందరు తమ వ్యాపారం పోతుందన్న బాధలో ఉన్నారు. కొందరేమో పిల్లలను ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చాం. వాళ్లు ఎలా ఉన్నారోననే ఆందోళనలో ఉన్నారు. (మా బృందంలో పది సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలున్న నలుగురు మహిళలు ఉన్నారు.) మానస సరోవర్ వెళ్తామో లేదో అనే బెంగ మరికొందరిది. నాకు మూడేళ్ల కొడుకు, ఆఫీసులో ఇచ్చిన వాగ్దానాలు గుర్తుకొచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. మేము అందరం చేస్తున్న తప్పు ఏంటంటే మా గతానుభవాల ఆధారంగానే మా జీవితం నడవాలనుకోవడం.

మాకు మళ్లీ వీసాలు వచ్చేటప్పటికి గుంజిలో మరో మూడు బ్యాచ్‌లు ఆగిపోయాయి. సముద్ర మట్టానికి 16000 అడుగుల ఎత్తులో ఉండే గుంజిలో ఎక్కువ రోజులు గడపడం అనేది చాలా కష్టం. అక్కడ కేవలం రోజుకు 2 గంటలు మాత్రమే కరెంటు అందుబాటులో ఉంటుంది. మొబైల్ ఫోన్స్ అనే మాటే లేదు. అప్పుడప్పుడు మాత్రం శాటిలైట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే నేల మీద కూర్చుని ఆకాశంలోకి చూస్తే మేఘాలు ఎలా ఉన్నాయి? ఈ రోజైనా మబ్బులు తక్కువ ఉన్నాయా? చాపర్లు దిగడానికి వాతావరణం అనువుగా ఉందా? అని ఆలోచించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. సహజంగా ఇలాంటప్పుడే యాత్రికులకు లైజనింగ్ ఆఫీసర్ల మీద చాలా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ దేవుడు వీళ్లను (లైజనింగ్ ఆఫీసర్లు) తప్పకుండా శిక్షిస్తాడంటూ కొందరు శాపాలు కూడా పెడుతూ ఉంటారు. ఎట్టకేలకు 17 రోజుల ఆలస్యం తర్వాత మేం టిబెట్ చేరుకున్నాం. అక్కడ ఐదు రోజులు అద్భుతంగా గడిపాం. కైలాస పర్వతం చుట్టూ పరిక్రమ కూడా చేశాం.

ప్రతి సారీ నన్ను నేను ఈ ప్రశ్న అడుగుతూ ఉంటా. ఎందుకు అన్ని రోజులు మేం ఆగాల్సి వచ్చింది? కైలాస మానససరోవరం వెళ్లడానికి మేం అంత కష్టం ఎందుకు పడాల్సి వచ్చిందని అనిపిస్తూ ఉంటుంది. అంత కష్టపడడం అవసరమా? అనిపించింది. అయితే, దానికి నాకు సమాధానం దొరికింది. కైలాస పర్వతం చుట్టూ పరిక్రమ చేస్తున్న సమయంలో మూడో రోజు నా ప్రశ్నకు సమాధానం లభించింది. అదో అద్భుతమైన అనుభూతి. కైలాష్ అనేది ‘దేవుడు’ కాదు. మనం భావిస్తున్నట్టు ‘శివుడు’ కాదు. కైలాష్ అనేది ఓ నిశ్చలత్వం. అసలు అంచనాలు అనేదే లేని ఓ స్వచ్ఛమైంది. ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పినట్టు అది శూన్యమైంది. అలాగే, అన్నీ కలిగినది కూడా. ఒకే సమయంలో శూన్యం, అనంతం కలిగిన అనుభూతి, కేవలం మన మెదడు భూత, భవిష్యత్, వర్తమానాలను వదిలేసినప్పుడు మాత్రమే కలుగుతుంది. ఇది కచ్చితంగా అలాంటి ప్రదేశమే.

ప్రతీకాత్మక చిత్రం (Image;Pexels)

యోగా అనేది నిశ్చలమైనదని యోగసూత్రాల్లో పతంజలి పేర్కొన్నాడు. అందులో ఎనిమిది విషయాలను చెప్పాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యహర, ధారణ, ధ్యాన, చివరగా సమాధి. అవన్నీ ఒకదానితో మరొకటి ఆధారపడి ఉంటాయి. వాటిలో ప్రత్యహర పై స్థాయికి వెళ్లాలంటే కచ్చితమైన నిశ్చలత్వం కావాలి.

నిశ్చలత్వం అంటే ఏంటి?

నిశ్చలత్వం అంటే మన మెదడు ఎలాంటి అంచనాలను పెట్టుకోకుండా, ఏవేవో ఆలోచనలు మస్తిష్కంలోకి రాకుండా, ఎటూ పరిభ్రమించకుండా ఉండడం. గతం గురించి బెంగ లేకుండా, వర్తమానం గురించి ఆలోచించకుడా, భవిష్యత్ గురించి ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఉండడం. అలాంటి స్థితికి చేరినప్పుడే మనం సంపూర్ణం అయినట్టు.

ఇక్కడ మేం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మేమంతా ఎన్నో అంచనాలు, ప్రణాళికలు, ఫ్యూచర్ ప్లాన్లు పెట్టుకుని ఆ యాత్రకు వచ్చాం. నిశ్చలత్వం స్థితికి చేరుకుంటే, అసలు ఇలా ‘మనల్ని మనం గుర్తించాల్సిన’ అవసరమే ఉండదు. ఆ క్షణం నాకు ఓ పవర్ ఫుల్ మూమెంట్. కానీ, జీవితం ఎలా సాగితే అలాగే కానిచ్చేద్దాం.. అని అనిపించే క్షణం. ప్లాన్లు, షెడ్యూల్స్ లేకుండా జీవితాన్ని గడుపుదామనుకునే క్షణం. స్వీయ ప్రాధాన్యం, ఈగోలు, ప్రిస్టేజ్‌లు అన్నీ పక్కనపెట్టేసే సమయం. మనం నిశ్చలత్వానికి చేరుకున్న రోజే ‘జీవితం’ ఆరంభం అవుతుంది. అంతకు ముందు కాదు.

చివరగా సెప్టెంబర్ 5న (అనుకున్న షెడ్యూల్ కంటే 26 రోజులు ఆలస్యం) మేం ఢిల్లీ చేరుకున్నాం. అక్కడ నేర్చుకున్న పాఠాలు జీవితకాలంలో మర్చిపోలేం. ప్రతి ఒక్కరూ ఓ గొప్ప పాఠాన్ని నేర్చుకుని ఇంటికి వెళ్లారు. మనల్ని మనం ఊహించుకుంటున్నట్టు మనం ఈ ప్రపంచానికి ఏమంత ప్రధానం కాదని కొందరు గ్రహించారు. చాలా మందికి జీవితం అంటే ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే అనే జ్ఞానోదయం కలిగింది.

ఫ్రెండ్స్, ఈ లాక్ డౌన్ 21 రోజులను ఓ దీవెనలాగా భావించండి. నిశ్చలత్వం పొందడానికి ఇదో మంచి సమయంగా గుర్తించండి. కరోనా వచ్చినప్పుడు కానీ, కరోనా వెళ్లిపోయిన తర్వాత కానీ, ప్రపంచం మన కంట్రోల్‌లో ఉండదు. అయితే, నిశ్చలత్వం ద్వారా మన భవిష్యత్తును నిర్మించుకోవడం కచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. అలా చేయాలంటే, మనం ఎలాంటి అంచనాలు, అనవసర ఆందోళనలు లేకుండా ఈ క్షణంలో జీవించడం మొదలు పెట్టాలి. రండి అందరం ఆ దిశగా మైండ్ సెట్ మార్చుదాం.

First published:

Tags: Life Style

ఉత్తమ కథలు