ఆరోగ్యమే మహాభాగ్యం.. అంటే ఆరోగ్యంగా ఉంటే అన్ని ఉన్నట్లే. ఇటీవల కాలంలో జీవనవిధానంలో అనేక మార్పులు చోటుచేసుకోవడంతో చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. కొన్ని రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉంటూ, మరికొన్నిటినీ డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యం మీసొంతం అవుతుంది. అయితే ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో వేపుళ్లు, షుగర్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే.. వాతం, అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకంతో పాటు ఇతర సమస్యలకు దారితీయవచ్చు. హార్మోన్లు కూడా ప్రభావితం కావచ్చు. అంతేకాకుండా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి జబ్బుల బారిన పడవచ్చు. మన రోజువారీ ఆహారంలో కొన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ హెర్బల్స్, మసాలా దినుసులు చేర్చుకోవడం ద్వారా వాతం, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను దశలవారీగా నివారించవచ్చు. ప్రతిరోజూ డైట్‌లో చేర్చుకోవాల్సిన యాంటీ ఇన్‌ఫ్లమెటరీ హెర్బల్స్, సుగంధ ద్రవ్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
* పసుపు
ఈ ఇంటి మసాలా భారతీయ వంటకాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అయిన కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలకు పెట్టింది పేరు. నల్ల మిరియాలతో కలిపి పసుపును ఆహారంలో చేర్చుకుంటే కర్కుమిన్‌ను శరీరం బాగా శోషించుకుంటుంది.
* నల్ల మిరియాలు
బ్లాక్ పెప్పర్‌లో యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వివిధ గ్యాస్ట్రో ఎంటెరోలాజికల్ సమస్యలను నయం చేయడంలో నల్ల మిరియాలు కీలక పాత్ర పోషిస్తాయి.
* ఏలకులు
ఏలకులు ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. శరీరంలో మంటను తగ్గించడంతో పాటు ఇది కాలేయ కొవ్వును నియంత్రిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది.
* దాల్చిన చెక్క
పలు అధ్యయనాల ప్రకారం.. దాల్చిన చెక్కను ఆహారంలో తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. అయితే దీన్ని చాలా కొద్ది మొత్తంలో వినియోగించాలని నిపుణులు చూస్తున్నారు.
* అల్లం
సాధారణంగా అల్లంను జలుబు, తిమ్మిరి, మైగ్రేన్, వికారం, ఆర్థరైటిస్ అధిక రక్తపోటు చికిత్సకు ఔషధంగా ఉపయోగిస్తారు. ఇన్‌ఫ్లమేషన్, కీళ్ల నొప్పులను తగ్గించడంలో అల్లం కీలకంగా వ్యవహరిస్తుంది.
* వెల్లుల్లి
దీన్ని ఆర్థరైటిస్, దగ్గు, మలబద్ధకం వంటి ఇతర వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉండటం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి.
* మెంతికూర
కీళ్ల నొప్పులు, మలబద్ధకం, ఉబ్బరం నుండి ఉపశమనం పొందడంలో మెంతులు కీలకంగా వ్యవహరిస్తాయి. మెంతికూరను తరచూ తీసుకుంటే బరువు తగ్గవచ్చు. మెంతి నీటిని ఆవిరి పీల్చడం వల్ల శ్వాసకోశంలో మంట తగ్గుతుంది.
* థైమ్ (Thyme)
ఆహారం సువాసనగా ఉండడం కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ-మైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు చికిత్సగా కూడా దీన్ని ఉపయోగిస్తారు.
* రోజ్మేరీ (Rosemary)
రోజ్మేరీలో ఉండే పాలీఫెనాల్స్ మంటను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయని పలు పరిశోధనల్లో తేలింది.
* గ్రీన్ టీ
ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్(IBD), అల్సరేటివ్ కొలిటీస్, గమ్ డిసీజెస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటితో సంబంధం ఉన్న వాపు సంకేతాలను తగ్గించడానికి గ్రీన్ టీ మెరుగ్గా పనిచేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.