Home /News /khammam /

WILL THE ATTITUDE OF TELANGANA CONGRESS LEADERS CHANGE AFTER THE MEETING WITH RAHUL GANDHI AND WILL THE PARTY START ITS ACTIVITIES FROM KHAMMAM DISTRICT KMM PRV

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలు విభేదాలు పక్కన పెడతారా..? ఆ జిల్లా నుంచే కాంగ్రెస్​ ఆపరేషన్‌?  రాహుల్ క్లాస్ పనిచేస్తుందా..? 

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతల తీరు మారుతుందా..? తమలోని అంతర్గత ఇగోలు పక్కన పెడతారా...? ప్రస్తుతం ఇది అందరి మనుసులో మెదులుతున్న ప్రశ్న

  (జి.శ్రీనివాసరెడ్డి,  కరస్పాండెంట్‌, న్యూస్‌ 18 తెలుగు, ఖమ్మం జిల్లా)

  ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana congress) నేతల తీరు మారుతుందా..? తమలోని అంతర్గత ఇగోలు పక్కన పెడతారా...? ప్రస్తుతం ఇది అందరి మనుసులో మెదులుతున్న ప్రశ్న. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పీకిన క్లాస్‌ పనిచేస్తుందా..? అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్న  రాహుల్‌ (Rahul gandhi) సూచన టీకాంగ్రెస్‌ (Telangana congress) నేతలకు అర్థం అవుతుందా..? విభేదాలను పార్టీ వేదికలపైనే మాట్లాడుకుని గ్యాప్‌లను సర్దుబాటు చేసుకోవాలన్న రాహుల్‌ ఆదేశం ఇక్కడి నేతలకు రుచిస్తుందా.? అంటే వేచిచూడాల్సిందే.  పార్టీ లైన్‌ దాటితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్న వైఖరి అమలుకు నోచుకుంటుందా అన్న సందేహాలు సామాన్య కాంగ్రెస్‌ కార్యకర్తలను వేధిస్తున్న ప్రశ్న.

  ఖమ్మం జిల్లా నుంచే ఆపరేషన్‌..?

  పార్టీని బలోపేతం చేయడానికి.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయబావుటా ఎగరేయడానికి ఖమ్మం (Khammam) జిల్లా నుంచే ఆపరేషన్‌ స్టార్ట్‌ చేయాలన్న పార్టీ అగ్రనాయకత్వం సూచన ఫలిస్తుందా..? ముప్పిరిగొంటున్న ఇన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నిజానికి తెరాస అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సీనియర్‌ నేతలను కాంగ్రెస్‌ వైపు అడుగులు వేయించడానికి ఖమ్మం జిల్లా నుంచే ఆపరేషన్‌ మొదలుపెట్టాలన్న ఆలోచన అమలుకు సరైన సమయం చూసుకోవాలన్న సూచనపైనా విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

  ఇప్పటికే మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరిలో ఉన్న గెలుపు ఆశ, అవకాశం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. కానీ ఇక్కడ రాష్ట్రంలోని అగ్రనేతలుగా చలామణి అవుతున్న నేతలంతా ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం కాంగ్రెస్‌ పార్టీ సగటు కార్యకర్తలు, అభిమానుల్లో అసహనం నింపుతోంది. ఆయా జిల్లాల్లో బలమైన తెరాస (TRS) అసంతృప్తులను ఆకర్షించడానికి ఓ పద్దతి ప్రకారం ముందుకెళ్లాలన్న ఆలోచన కార్యరూపం దాల్చనేలేదు. సమయం, సందర్భం కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నా.. ఈ కీచులాటలు ఇలాగే కొనసాగితే పార్టీలోకి రావాలన్న ఆలోచన ఉన్న నేతలు సైతం సెకండ్‌ థాట్‌లోకి వెళ్లే పరిస్థితి నెలకొంది.

  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతలుగా, పరిస్థితిని ఒంటిచేత్తో మార్చగలరన్న శక్తిమంతులైన నేతలను రాబట్టుకోవాలని ఓ వైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth reddy) ప్రయత్నాలు చేస్తుండగా.. స్థానికంగా తమ ఆధిపత్యానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందోనన్న ఆందోళనతో ఒకరిద్దరు నేతలు ఉన్నట్టు చెబుతున్నారు. దీనిపై మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul gandhi)తో మీటింగ్‌లో ఓ క్లారిటీ వచ్చినట్టు చెబుతున్నారు. విభేదాలు ఉంటే పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని టీపీసీసీ నేతలకు (Telangana congress) ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ ఈ సందర్భంగా క్లాస్ పీకారు .

  రాహుల్ గాంధీ దిశానిర్దేశం..

  నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో టీపీసీసీ (TPCC) నేతలతో రాహుల్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు . ఈ సందర్భంగా నాయకులు చెప్పిన విషయాలు అన్ని శ్రద్ధతో విన్నారు . తరువాత ఆయన కొద్దిసేపు మాత్రమే మాట్లాడారు . ఈ సందర్భంగా రాష్ట్రంలో నాయకులు రచ్చకెక్కడంపై సీరియస్ అయ్యారు . తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అంతా కలిసి పనిచేయాలని నేతలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. విభేదాలు (Conflits) పక్కన పెట్టి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని హితవు పలికారు. ఈ భేటీలో 39 మంది నాయకులు పాల్గొన్నారు. మనస్పర్ధలు, విభేదాలు ఉంటే పార్టీ వేదికపైనే చెప్పాలని ఎక్కడపడితే అక్కడ ఇష్టారీతిలో మాట్లాడొద్దని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఏమైనా ఉంటే తనతో, కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడాలని సూచించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందించటమే కాంగ్రెస్‌ లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు ప్రజాసమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాడేందుకు నిర్ణయించినట్లు చెప్పారు.

  రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, అంతర్గత వ్యవహారాలపై చర్చించినట్లు తెలిపారు. భిన్నాభిప్రాయాలను పక్కనబెట్టి ఏకతాటిపైకి వచ్చి టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పోరాటం చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్తేజం తీసుకొచ్చేందుకు రాష్ట్రానికి రాహుల్‌ గాంధీ వరుస పర్యటనలు చేస్తారని చెప్పారు. రాహుల్‌గాంధీ సమక్షంలోనే ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు టికెట్ల కేటాయింపు జరగనుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికి రావాలని రాహుల్‌గాంధీని ఆహ్వానించినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. వీలైనన్ని ఎక్కువసార్లు రాష్ట్రంలో పర్యటిస్తానని రాహుల్‌ చెప్పారని భట్టి వెల్లడించారు.

  పీసీసీ చీఫ్ వ్యవహారశైలిపై..

  టీఆర్ఎస్, మజ్లిస్‌తో పొత్తు ఉండదని రాహుల్‌ సమక్షంలో నిర్ణయించినట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. ఐకమత్యంతో సాగుతూ టీఆర్ఎస్, బీజేపీని ఓడిస్తామని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశంలో ముగియకముందే బయటికి వచ్చారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లో పార్టీ బలోపేతం, పీసీసీ చీఫ్ వ్యవహారశైలిపై మాట్లాడినట్లు తెలిపారు. ఏడాది ముందే అభ్యర్థులను ఖరారు చేసి కార్యాచరణ చేపట్టాలని కోరినట్లు వెల్లడించారు. కరీంనగర్ జిల్లాలో 1-2 చోట్ల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకపక్షంగా అభ్యర్థులను ఖరారని… జిల్లా నేతలు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబుతో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అభ్యర్థుల ప్రకటనకు అధిష్ఠానం అనుమతి ఇచ్చిందా? అని రాహుల్ గాంధీని అడిగినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు.

  ధరల పెంపుపై పోరాడాలని..

  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సీనియర్ నేత వీ హనుమంతరావు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సోనియాతో చర్చించించినట్లు వీహెచ్‌ తెలిపారు. ప్రజల పక్షాన చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లు, పెట్రో ధరలు, నిత్యావసరాల ధరల పెంపుపై పోరాడాలని సోనియా చెప్పారని వీహెచ్​ చెప్పారు. రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తానని పేర్కొన్నారు. నాయకత్వ బాధ్యతల్లో ఉన్నవారు సీనియర్లను గౌరవించాలని… అనుభవాన్ని ఉపయోగించుకోవాలని హితవు పలికారు. మరోవైపు, అంతకు ముందు… ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది.

  సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​ఛార్జ్​ మానిక్కం ఠాగూర్, సెక్రటరీలు బొసరాజు, శ్రీనివాసన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసీసీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత వ్యవహారాలు, సభ్యత్వ నమోదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ అంశాలపై చర్చించారు.

  ఎన్నికల వ్యూహకర్త సునీల్..

  టీఆర్ఎస్, ఎంఐఎంలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో నిన్న రాహుల్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటని రాహుల్ ను నేతలు అడిగారు. దీనికి సమాధానంగా రాహుల్ ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.సమావేశం సందర్భంగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ ను తెలంగాణ నేతలకు రాహుల్ పరిచయం చేశారు. తెలంగాణ, కర్ణాటక వ్యవహారాలను సునీల్ చూస్తారని చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సునీల్ ఎన్నికల వ్యూహకర్త కాదని… కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పారు. అందరం కలిసి పని చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గాల్లో పని చేసే నాయకులకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని రాహుల్ చెప్పారు. క్రమశిక్షణతో నాయకులందరూ కలిసిమెలిసి పని చేయాలని సూచించారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Khammam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు