(G. Srinivas Reddy, News18, Khammam)
పువ్వాడ అజయ్‌కుమార్ (Puvvada Ajay kumar ). రాజకీయాల్లోకి వచ్చిన కేవలం ఆరేళ్లలోనే మంత్రి పదవి వరించిన అదృష్టవంతుడు. కుటుంబం సీపీఐలో ఉండటం, ఆయన తండ్రి సీపీఐ సీనియర్ నేతగా ఉండటం, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసి ఉండడంతో తొలినుంచి వామపక్ష భావజాలంతో అజయ్‌కుమార్ ఉండే వారంటారు. ఆనక మమత మెడికల్ కాలేజి ఛైర్మన్‌గా సంస్థ అభివృద్ధి, విస్తరణలో ఆయన కృషిని చెప్పుకోవాల్సిందే. మరో మెడికల్ కళాశాలను హైదరాబాద్ బాచుపల్లిలో ఏర్పాటు చేయడం.. అజయ్‌కుమార్ పాలనా దక్షతను చాటుతోంది. 2012లో వైఎస్సార్‌సీపీలో చేరడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అజయ్. జిల్లా కన్వీనర్‌గా పార్టీ విస్తరణ కోసం పనిచేశారు.
సీనియర్లున్నా పువ్వాడకే అవకాశం..
అయితే రాష్ట్ర విభజన అనంతరం అజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరి, 2014 ఎన్నికల్లో ఖమ్మం (Khammam) నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొద్దికాలానికే తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఉండటంతో ఆయనకే కమ్మ సామాజికవర్గ కోటాలో మంత్రి పదవి దక్కింది. దీంతో 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమి అనంతరం రాష్ట్రంలో అదే సామాజికవర్గం నుంచి గెలుపొందిన కోనేరు కోనప్ప, అరికెపూడి గాంధీ, భాస్కరరావు లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ, కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం వల్లనైతేనేమి, ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక్కడు పువ్వాడ అజయ్‌కుమార్ కావడం వల్లనైతేనేమి.. ఆయనకు మంత్రి పదవి వరించింది.
ప్రతిపక్షాల దాడి..
తాజాగా ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సామినేని సాయిగణేష్ ఆత్మహత్య (sai ganesh Suicide) వ్యవహారంలో బీజేపీ కేంద్ర పెద్దలు జోక్యం చేసుకోవడం.. ఇద్దరు కేంద్ర మంత్రులు ఇప్పటికే ఖమ్మం రావడం.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఇస్యూపై తీవ్రంగా స్పందించడం.. కేంద్ర మాజీ మంత్రి రేణుకచౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. ఒకటి రెండు రోజుల్లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఖమ్మం రానున్న నేపథ్యంలో ఇది అజయ్‌కుమార్‌కు తీవ్రమైన తలనొప్పిగా తయారైంది.
ఒకవైపు జుడీషియల్‌గా కేసును ఎదుర్కోవడం.. మరోవైపు రాజకీయంగా ఆరోపణలను కాచుకోవడం.. అజయ్‌కు సవాల్‌గా మారిందని చెప్పాలి. తాజాగా మంత్రి అజయ్‌కుమార్‌ను మంత్రిమండలి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గాంధీభవన్ ముందు నిరసనకు దిగారు. ఇది కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన వత్తిడిని పెంచుతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి సీఎం కేసీఆర్ (CM KCR) ఈ విషయంలో ఎలా స్పందిస్తారు..? పార్టీకి (TRS) నష్టం కలగకుండా నష్టనివారణకు పూనుకుంటారా..? లేక మంత్రి అజయ్‌కు అండగా నిలుస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ విషయంపై కేసీఆర్ ఆచితూచి వ్యవహరించే కోణంలోనే ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పువ్వాడకు ప్రత్యక్షంగా సాయి గణేశ్ ఆత్మహత్యకు సంబంధం లేకపోయినా.. ఖమ్మంలోని ప్రజానికంలో పువ్వాడపై వ్యతిరేకత రావడం పట్ల కేసీఆర్ (CM KCR) అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది పువ్వాడకు కొంచెం చేటు చేసేది.
సోషల్ మీడియాలో విమర్శలు..
అయితే సోషల్ మీడియాలో పువ్వాడకు వ్యతిరేకంగా అటు బీజేపీ (BJP) నాయకులే కాకుండా సామాన్య జనం కూడా పోస్టులు పెడుతుండటం టీఆర్ఎస్ (TRS)కు ఒకింత ఇబ్బందుల్లో పడేసేది. అందులోనూ పువ్వాడ సొంత కులం (Caste) కమ్మ వారు కూడా ఇటీవల జరిగిన పరిణామాలతో విసుగు చెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమ్మ కులస్థులు కూడా పువ్వాడను సోషల్ మీడియాలో విమర్శిస్తూ వస్తున్నారు. దీంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అండగా తెరాస నేతలు రంగంలోకి దిగారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ అండగా నిలిచే ప్రయత్నం చేశారు. పలువురు నేతలు, కార్పోరేటర్లు, ఇంకా కమ్మ (Kamma) సామాజికవర్గంలోని పెద్దలతో సెల్ఫీ వీడియోలు చేయించి కౌంటర్‌లు సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. మొత్తంమీద ఈనెల 14న సామినేని సాయిగణేష్ ఆత్మహత్య మొదలు గడచిన వారానికి పైగా ఖమ్మంలో ఇదే వివాదం తీవ్రమవుతూ వస్తోంది. తమ పార్టీకి చెందిన యువ నేత ఆత్మహత్యకు పాల్పడటం.. అతనిపై వరుస కేసులు పెట్టి మరీ వేధింపులకు పాల్పడిన విషయాన్ని బీజేపీ నేతలు ఎలివేట్ చేయగలిగారనే చెప్పొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Khammam, Puvvada Ajay Kumar, TRS leaders