మీకు అర్జంటుగా నగదు అవసరం అయ్యాయి. దగ్గరలోని ఏటీఎంకు వెళ్లారు. మీది ఏ బ్యాంకు అకౌంట్ అయినా.. దగ్గరిలోని మరే బ్యాంకుకు చెందిన ఏటీఎం (ATM)లోనైనా నగదు పొందొచ్చు కనుక మీరు వెళ్లి డబ్బు తీసుకునే ప్రయత్నం చేస్తారు. కార్డు ఇన్సర్ట్ చేసి డబ్బు కోసం చూస్తారు. మీరు ఈ ప్రాసెస్‌లో ఉండగానే సన్నగా, పొడుగ్గా ఉన్న ఓ వ్యక్తి వస్తాడు. మాటలు కలుపుతాడు. అమౌంట్ వస్తున్నాయా సార్ అంటాడు. డబ్బు ఎలా తీయాలి..? ఎంతైనా తీయొచ్చా లాంటి ప్రశ్నలతో ఆరా తీస్తాడు. మీరు ఉత్సాహంగా మాటలు కలుపుతారు. ఈలోగా అతను తన కార్డు మీకిచ్చి డబ్బు తీసి పెట్టమంటాడు. మీరు సాయం చేస్తారు.. అంతా అయిపోయాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. కొద్ది సమయానికి మీ అకౌంట్ నుంచి ఉన్న సొమ్మంతా డ్రా (Money Draw) చేసినట్టు మెసేజ్ వస్తుంది. ఇది ఒక కేసు..
ఇంకో కేసులో ఏటీఎంలో సొమ్ము (ATM Money) తీయడం అవగాహన లేకో.. తీయడానికి ప్రయత్నిస్తే రాకనో మీరు విసిగిపోయి ఉంటారు. మౌనంగా దీన్ని గమనిస్తున్న సన్నగా, పొడుగ్గా ఉన్న వ్యక్తి మీకు సాయం కావాలా అంటాడు. ఇలా తీయాలి అంటూ మీ కార్డు తన చేతిలోకి తీసుకుంటాడు. మీకు డబ్బు డ్రా చేసి పెడతాడు. సాయం చేసినందుకు మీరు థ్యాంక్స్ చెప్పి మరీ వెళ్తారు. ఇంటికెళ్లిన కాసేపటికో.. మరికాసేపటికో మీ అకౌంట్ నుంచి నగదు డ్రా చేసినట్టు మెసేజ్ వస్తుంది. మీరు ఉలిక్కిపడతారు. ఏం జరిగిందో తెలీక బ్యాంకు బాట పడతారు. తీసింది మీ కార్డు ఉపయోగించే.. కాకపోతే మీరు కాదు. వేరెవరో..
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kottagudem) జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏటీఎం అడ్డాగా జనాన్ని నమ్మించి మోసం చేస్తున్న ఈ వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సీసీ ఫుటేజిలో అతని ఆనవాళ్లు పట్టుకుని మరీ వెతుకుతున్నారు. పైగా డబ్బు డ్రా చేయడానికి వచ్చిన వాళ్లు ఎక్కవ శాతం మంది ఏటీఎం సెంటర్లో ఉండగా ఫోన్ మాట్లాడుతూనో.. వాట్సాప్ లాంటి యాప్‌లలో అప్డేట్ అవుతున్నట్టు సీసీ ఫుటేజి ద్వారా గుర్తించారు. ఇది ఆ టెక్ దొంగ, మోసగాడికి మరింత అవకాశంగా మారింది.
చాకచక్యమే అతని పెట్టుబడి..
అతని దగ్గర అన్ని బ్యాంకులకు చెందిన అనేక కార్డులు ఉంటాయి. రంగు, డిజైన్ ఒకేలా ఉండటంతో ఎవరూ డీటెయిల్డ్‌గా చూసుకోరు. డబ్బు డ్రా చేయడానికి తీసుకున్న కార్డును అతను చాకచక్యంగా మార్చేస్తాడు. మాటలతో ఏమార్చుతూ కార్డును మార్చేస్తాడు. ఇతరులు ఏటీఎంను ఉపయోగించే సమయంలో పిన్ నెంబర్‌ను జాగ్రత్తగా గమనిస్తాడు. ఒకవేళ దూరంగా ఉన్నప్పటికీ కీబోర్డు పైన వేళ్ల కదలికలను అంచనా వేస్తాడు. కొన్ని సందర్భాల్లో బ్యాలెన్స్ లేకపోతే కొద్ది రోజుల పాటు ఎదురుచూసి మరీ మరో ప్రయత్నం చేస్తాడు. ఇలా ఇప్పటికి ఎంతోమంది మోసపోయారు. ఎవరికి చెప్పుకోవాలో తెలీక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఖాతాదారులు. ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జనాన్ని స్మార్ట్‌గా మోసం చేస్తున్న వ్యక్తి కదలికలపై ఆరా తీశారు.
బాధితుల ఏటీఎం కార్డుల (ATM Cards)నుంచి డబ్బు డ్రా చేసినట్టు గుర్తించిన చోట్ల నుంచి సీసీ ఫుటేజి తీయించారు. గంటల తరబడి ఉన్న ఆ ఫుటేజిని అసాంతం పరిశీలించారు. తీరా చూస్తే ఒక పొడవాటి, సన్నని వ్యక్తి (Theft) కూల్‌గా డబ్బు డ్రా చేస్తుండటాన్ని.. ఏటీఎం సెంటర్లో అనేకమందితో తరచుగా మాట్లాడిన విషయాన్ని గుర్తించారు. అయితే అతనెవరో తెలీక సతమతమవుతున్నారు.
పోలీసులు విడుదల చేసిన ఫొటో
అతను ఎవరు.;?. ఎక్కడి నుంచి వచ్చాడు.? అనేది తెలుసుకోడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇలా మోసాలు చేస్తున్న వ్యక్తి ఆచూకి (Find the person) తెలపాలంటూ కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు బహిరంగ ప్రకటన చేశారు. అతని ఆచూకి తెలిపితే రివార్డు సైతం ఇస్తామంటూ పేర్కొన్నారు. మొత్తానికి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ. టెకీ దొంగను త్వరగా పట్టుకోకపోతే ఇంకొందరు మోసపోవడం.. డబ్బు పోగొట్టుకోవడం ఖాయం.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.