Home /News /khammam /

MINISTER AJAY KUMAR HAS BEEN CRITICIZING THE KAMMA CASTE ON SOCIAL MEDIA FOR ASKING THEM TO SUPPORT HIM KMM PRV

Minister Puvvada Ajay kumar Caste: కమ్మ కులం కార్డును అడ్డుపెట్టిన మంత్రి పువ్వాడ అజయ్​.. సోషల్​ మీడియాలో ఆ కులం నుంచే విమర్శలు

(పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్)

(పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్)

 కమ్మ సామాజికవర్గం అంతా ఏకమై తనకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందంటూ మంత్రి అజయ్‌కుమార్‌ ఏకరువు పెట్టారు. దీనిపై సొంత సామాజికవర్గమైన కమ్మ మహాజనసమితి నుంచే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

  (G. Srinivas Reddy, News18, Khammam)

  ఖమ్మం (Khammam) ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ (Minister Puvvada Ajay Kumar) ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. బీజేపీ (BJP) అనుబంధ విభాగానికి జిల్లా అధ్యక్షుడైన  సామినేని సాయి గణేష్‌ అనే యువకుని ఆత్మహత్య (Sai Ganesh Suicide)లో మంత్రి అజయ్‌కుమార్‌ పాత్ర ఉందంటూ అభినవ్‌కృష్ణ అనే న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. అజయ్‌కుమార్‌ తన అధికారాన్ని ఉపయోగించి ప్రశ్నించిన అందరిపైనా పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. సామినేని సాయిగణేష్‌ ఆత్మ హత్యకు సైతం ఈ రకమైన వేధింపులే కారణమంటూ వాదించారు. దీనిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని అభ్యర్థించారు. దీంతో స్పందించిన ఉన్నత న్యాయస్థానం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంకా బాధ్యులైన పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 29 నాటికి కౌంటర్‌ దాఖలుకు సమయం ఇచ్చింది.

  కులం నుంచి ఒక్కడినే మంత్రినంటూ..

  సామినేని సాయిగణేష్‌ ఆత్మహత్య వ్యవహారంలో పువ్వాడ అజయ్‌కుమార్‌ (Puvvada Ajay Kumar) పూర్తి డిఫెన్స్‌లో పడినట్టు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. ఈ వివాదంలో మంత్రి గారు కులం (Caste) కార్డు వాడటంతో వివాదం మొదలైంది  'రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం తానొక్కడే కమ్మ (Kamma) సామాజిక వర్గానికి చెందిన మంత్రిని అని.. ఏపీలో నిన్నమొన్నటిదాకా ఒకరుండేవారు.. ఆయన్ను పీకేశారు.. తనను కూడా క్యాబినెట్‌ (Cabinet) నుంచి తొలగించడానికి తన పార్టీ నేతలు సహా, మరికొందరు ప్రయత్నాలు, కుట్రలు చేస్తున్నారని.. కొందరు సూడో చౌదరిలు తనను పదవి నుంచి తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.  కమ్మ (Kamma) సామాజికవర్గం అంతా ఏకమై తనకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందంటూ ఏకరువు పెట్టారు. వైరాలో కమ్మవారి ఏసీ కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో అజయ్‌కుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అజయ్‌కుమార్‌ సొంత సామాజికవర్గమైన కమ్మ మహాజనసమితి నుంచే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

  సోషల్‌ మీడియా పోస్టింగులు..

  కమ్మ మహాజన సమితి (Kamma Mahajana Samiti) పేరిట విడుదలైన పలు సోషల్‌ మీడియా పోస్టుల్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అజయ్‌కుమార్‌ సాగించిన దౌర్జన్యాలు, వేధింపులు, పోలీసులను ఉసిగొల్పి వ్యతిరేకులను తన దారికి తెచ్చుకున్న తీరును.. సొంత సామాజికవర్గం నేతలను వేధించిన ఉదంతాలను ఒక్కొక్కటిగా ఉదహరించారు. మాజీ మంత్రి, తెరాస రాష్ట్ర నేత తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ తన అనుచరులతో సోషల్‌ మీడియా (Social media) పోస్టింగులు పెట్టించిన విషయం.. ఎంపీ నామా నాగేశ్వరరావు పట్ల ఎలాంటి వైఖరిని అవలంభిస్తున్నదీ తేటతెల్లం చేస్తూ.. కమ్మ సంఘం ఎన్నికల్లో తన వర్గాన్ని గెలిపించుకోడానికి విఫలయత్నం చేసి భంగపడిన తీరు.. ఇంకా సోషల్‌ మీడియా పోస్టింగులు పెట్టినందుకు కేసులు పెట్టడం.. ప్రశ్నిస్తే పీడీ యాక్టులు పెట్టించడం.. రౌడీ షీట్లు తెరిపించడం.. లాంటివి ప్రస్తావిస్తూ.. అసలు పువ్వాడ అజయ్‌కుమార్‌కు కమ్మ సామాజికవర్గాన్ని క్లెయిం చేసుకునే నైతిక హక్కు లేదని తేల్చిపారేసినంత పనిచేశారు.

  నయా హిట్లర్‌లా మారారని..

  ఎమ్మెల్యేగా.. మంత్రిగా కేవలం పోలీసులను అడ్డుపెట్టుకుని తన దందాలు సాగిస్తున్నారని, పువ్వాడ అజయ్‌కుమార్‌ నయా హిట్లర్‌లా మారారని దునుమాడారు. సొంత కాంట్రాక్టు సంస్థకే పనులన్నీ కేటాయించుకుని, చిన్న పెద్ద కాంట్రాక్టర్ల పొట్ట కొట్టారని కూడా సోషల్‌ మీడియా పోస్టింగుల్లో ఆరోపించారు. మంత్రి కేటీఆర్ తో తనకు వ్యాపార భాగస్వామ్యం ఉందని చెప్పుకుంటూ.. ఇటు సొంత పార్టీ నేతలను, అటు ప్రతిపక్ష పార్టీ నేతలను వేధింపులకు గురిచేస్తూ తెరాస పాలన పట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చే పరిస్థితికి కారకులయ్యారని ఆరోపించారు. ఇంకొక్క అడుగు ముందుకేసి మరీ.. పువ్వాడ అజయ్‌కుమార్‌ ఏనాడూ కమ్మ సామాజిక వర్గానికి అండగా నిలవలేదని, తాము కూడా ఆయనకు ఓట్లు వేయలేదని.. అందుకే అజయ్‌ తనను తాను అజయ్‌ఖాన్‌, అజయ్‌నాయుడు, ఇంకా పలు కులాల తోకలను తగిలించుకుని ప్రచారం చేసుకున్నారని ధ్వజమెత్తారు.

  ఎవరికివ్వాలి మద్దతు?

  పేదవాడు, డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించికుంటూ.. పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న సామినేని సాయిగణేష్‌ కమ్మ సామాజికవర్గం అన్న సంగతి మంత్రి పువ్వాడకు తెలీదా అని ఖమ్మం కమ్మ మహాజనసమితి ప్రశ్నిస్తోంది. మేం అండగా నిలవాల్సింది బలహీనుడైన, అధికారం, అహంకారానికి బలైపోయిన పేదింటి బిడ్డలకా లేక, అధికారం ఉంది కదాని అందరినీ అణచాలన్న ప్రయత్నంలో ఉన్న మంత్రి పువ్వాడకా అని ఆయన సామాజికవర్గానికే చెందిన సంఘం పేరిట సోషల్‌ మీడియా పోస్టింగ్‌లు వైరల్‌ అవుతున్నాయి. ఈ  ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత ముదిరి.. కమ్మ మహాజనసమితి, పువ్వాడ అభిమానులు పేరిట కౌంటర్‌లు సైతం వైరల్‌ అవుతున్నాయి.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Caste deportation, Khammam, Puvvada Ajay Kumar, Social Media, TRS leaders

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు