Home /News /khammam /

KHAMMAM TRS LEADERS CONFLICTS BECAME A HEADACHE FOR MINISTER KTR FULL DETAILS HERE KMM PRV

Khammam| KTR: ఆ జిల్లాలో మారని తెరాస నేతల తీరు.. పదే పదే వర్గపోరు.. కేటీఆర్ వర్సెస్ ఖమ్మంగా పరిస్థితి

మంత్రి కేటీఆర్​

మంత్రి కేటీఆర్​

కల్వకుంట్ల తారక రామారావు (KTR). రాష్ట్ర మంత్రి. తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు. సీఎం కేసీఆర్‌ తనయుడు. పార్టీకి వారసుడు. ఆయన మాటే శాసనం.. అయితే ఆ యువనేతకు ఖమ్మం జిల్లా చుక్కలు చూపిస్తోంది.. 

  (G. Srinivasreddy, News18, Khammam)

  కల్వకుంట్ల తారక రామారావు (KTR). రాష్ట్ర మంత్రి. తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు. సీఎం కేసీఆర్‌ తనయుడు. పార్టీకి వారసుడు. కాబోయే ముఖ్యమంత్రిగా .. రామన్నగా తెరాస శ్రేణులు ప్రేమగా పిలుచుకునే నేత. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రెండో అతిపెద్ద పవర్‌ సెంటర్‌. టెక్నాలజీని ఒడిసిపట్టి డైనమిక్‌ లీడర్‌గా గ్లోబల్‌ ఎంట్రోపెన్యూర్‌ సర్కిల్‌లో గుర్తింపు పొందిన లీడర్‌. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మాటే శాసనం.. అయితే ఆ యువనేతకు ఖమ్మం జిల్లా చుక్కలు చూపిస్తోంది.. ఖమ్మం (Khammam). రాజకీయ విలక్షణతకు మారుపేరు. ఓ పట్టాన కొరుకుడు పడని క్లిష్టమైన వ్యవహారశైలి కలిగిన రాజకీయ శ్రేణికి నిలయం. మొదటి నుంచి వామపక్షాల ప్రాబల్యం ఉన్న ఈ జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగినా.. స్వరాష్ట్రం సాధించాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ తెరాసకు కేవలం ఒకే ఒక్క సీటును మాత్రమే కట్టబెట్టడం ద్వారా ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రజలు తమ విలక్షణతను పదేపదే చాటుకుంటూనే ఉన్నారు. చూస్తే అంతా గులాబిమయం అన్నట్టుగా ఉన్నా.. లోలోపల నిగూఢంగా ఉన్న వర్గపోరు రీత్యా ఫలితాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్న పరిస్థితి. ఇలాంటి స్థితి గత కొన్నేళ్లుగా పార్టీ అధినేతకు, యువనేతకు (KTR) రుచించడం లేదు. ఈ పరిస్థితిని మార్చడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నా అది కాయకల్ప చికిత్సగానే ఉంటుంది తప్పించి, పూర్తిస్థాయి ఫలితాలను ఇవ్వడంలేదనే చెప్పాలి.

  నోట్లో నవ్వులు.. కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్న తెరాస నేతల తీరువల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని నివారించాలని పలుమార్లు చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతునే ఉన్నాయి. ప్రపంచవేదికల పైన అందరి నోటా శెబాష్‌ అనిపించుకున్న కేటీఆర్‌కు ఇప్పుడు ఖమ్మం (Khammam) ఇంట నేతల పంచాయతీని తీర్చడం ఓ సవాల్‌గా మారింది. ఇంటిని గెలిచి.. రచ్చ గెలవాలన్న సామెతలా.. ఇప్పుడు రచ్చ గెలిచిన కేటీఆర్‌.. ఖమ్మం ఇంట ఉన్న నేతల విబేధాలను ఎలా పరిష్కరిస్తారోనన్న ఉత్సుకతతో అందరూ ఎదురుచూస్తున్నారు.  రేపు కేటీఆర్‌ జిల్లా పర్యటన

  పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయడానికి మంత్రి కేటీఆర్‌ శనివారం నాడు జిల్లాకు రానున్నారు. ఈమేరకు ఆయన షెడ్యూల్‌ను ప్రకటించారు. వాస్తవానికి మునిసిపల్‌ కార్పోరేషన్‌ భవన సముదాయం, లకారం ట్యాంక్‌బండ్ వద్ద నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జ్,  రఘునాధపాలెంలో నిర్మించిన సుడా పార్క్‌, వైరారోడ్‌లో ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు, టేకులపల్లిలో నిర్మించిన కేసీఆర్‌ టవర్స్‌కు‌ ప్రారంభోత్సవం సహా 20 ఎంఎల్‌డీ కెపాసిటీతో సీవరేజి ప్లాంట్‌కు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ‌అయితే గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా మూడు సార్లు కేటీఆర్‌ వస్తున్నారంటూ ప్రకటించడం.. తీరా రాకపోవడం జరుగుతూ వస్తోంది. ప్రతిసారీ జిల్లా అధికార యంత్రాంగం కేటీఆర్‌ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయడం, తీరా లాస్ట్‌మినిట్‌లో పర్యటన వాయిదా పడటం, ఆనక రద్దు అవుతూ వస్తోంది. సాంకేతిక కారణాలను అధికార యంత్రాంగం, తెరాస నేతలు చూపిస్తూ ఉన్నప్పటికీ.. జిల్లాలోని అగ్రనేతల మధ్య ఉన్న పొరపొచ్చాలను, గ్యాప్‌ను సర్దుబాటు చేయడం ఎలాగో అర్థంకాకే కేటీఆర్‌ (KTR) ఇలా వాయిదాలు వేస్తూ వస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

  అందరితోనూ సాన్నిహిత్యం..

  నిజానికి కేటీఆర్‌ మంత్రి అజయ్‌కుమార్‌లు సన్నిహితులుగా పేరుంది. అదే సమయంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనూ కేటీఆర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇంకా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును 'అంకుల్‌' అని పిలిచేంత దగ్గరిగా ఉంటున్నారు. ఇక ఎంపీ నామా నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లాలోని మరో ప్రాబల్యనేత, మాజీ పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావుతోనూ సాన్నిహిత్యం ఉన్నదే. ఇంకా కొత్తగా రాజ్యసభ సభ్యులుగా ఎలివేట్‌ అయిన వద్దిరాజు రవిచంద్ర అలియాస్‌ గాయత్రి రవి, హెటెరో పార్ధసారధిరెడ్డి, ఈ మధ్యనే స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై, ఆనక పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా జాక్‌పాట్‌ కొట్టిన తాతా మధు సహా నేతలెందరో.. ఒక్కొక్కరిదీ ఒక్కో బ్యాక్‌ గ్రౌండ్‌. అందరూ కేటీఆర్‌కు దగ్గరే. వీరిలో ఏ ఒకరిద్దరో తప్పించి పార్టీలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు శ్రేణులకు ఇబ్బందిగా మారింది.

  సర్దుబాటు ఎలా?

  ఈ మధ్యకాలంలో కొందరు నేతల స్వరాలు మారుతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఉన్న స్థానాలు కొన్నే అయినా.. అందరు నేతలు ఎవరికి వారే తాము పోటీ చేసి తీరుతామంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్న తీరు పార్టీలోనూ, బయటా గందరగోళానికి తావిచ్చినట్లయివుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకటరావు, ఇంకా పలువురు ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. మరి వీరందరినీ పార్టీ అధినేత కేసీఆర్​, మంత్రి కేటీఆర్​లు ఎలా సర్దుబాటు చేస్తారు..? ఎలా దారికి తెచ్చుకుంటారన్నది కాలం చెప్పాల్సిన సమాధానం. అప్పటిదాకా అగ్రనేతల పర్యటనలు, కార్యక్రమాల్లో ఇలాంటి అంతరాయాలు, సాగతీతలు కామన్‌ అంటున్నాయి తెరాస శ్రేణులు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Khammam, KTR, Telangana Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు