(G. Srinivas reddy, News18, Khammam)
ఆ కుర్రాడు ఓ సాకర్ బాయ్ (Soccer Boy). తండ్రి సాకర్ లవర్. సాకర్‌బాయ్ పుట్టింది పెరిగింది అమెరికా (America). ఆడేది వర్జీనియా స్టేట్ టీం (Virginia State Team)కు. ఇప్పటికే అండర్ 12, 13, 14, 18 కేటగిరీలలో అనేక టోర్నమెంట్లలో ఆడాడు. తాజాగా జాతీయ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. అయినా అతనిలో ఏదో తెలీని అసంతృప్తి. తన తండ్రి పుట్టిన ఊళ్లో తన లాంటి పిల్లలకు ఫుట్‌బాల్ సౌకర్యం లేదని.. దీనికోసం అతనింకేం ఆలోచించలేదు. వెంటనే తండ్రికి (Father) చెప్పి ఫ్లైట్ ఎక్కేశాడు. నేరుగా తన తండ్రి ఊరు చేరుకున్నాడు.
అక్కడ తనకు పరిచయమున్న, తండ్రికి దగ్గరివాళ్లైన బంధువులు, స్నేహితుల పిల్లలకు ఫుట్‌బాల్ (Football) నేర్చుకోవాలని, తాను శిక్షణ (Training) ఇస్తానని మోటివేట్ చేశాడు. అప్పటికే సాకర్‌లో ప్రవేశం ఉండి, రాణిస్తున్న యువతకు మెళకువలు నేర్పించాడు. ఇలా ఇప్పటికే మణుగూరు, ఖమ్మం నగరంలోనూ కొంతమందికి సాకర్‌లో శిక్షణ ఇచ్చాడు. అచ్చంగా శ్రీమంతుడు సినిమాలా ఉంది కదూ. ఇలా తనకు తెలిసినది నలుగురికీ నేర్పించాలని తపన పడ్డ అతని పేరు శేరి (Sheri). తండ్రి తొగరు శ్రీధర్ (Thoguta Sridhar). తల్లి పద్మప్రియ (Padma Priya).
సొంత ఊరు అంటే వల్లమాలిన అభిమానం..
ఎప్పుడో కొన్నేళ్ల క్రితమే అమెరికా వెళ్లిపోయిన శ్రీధర్‌కు తన స్వస్థలం ఖమ్మం (Khammam) జిల్లా. ఆయనకు సొంత ఊరు అంటే వల్లమాలిన అభిమానం. ఒక్కగానొక్క కొడుక్కి మెక్సికన్ సాకర్ ప్లేయర్ జీన్ మైకేల్ శేరిలోని.. శేరిని పేరుగా పెట్టుకున్నారు. శేరికి తన ఊరి కబుర్లు, ఇక్కడ తాను చిన్నతనంలో పెరిగిన పరిస్థితులు, స్నేహితులు, తాను చదువుకున్న స్కూల్, కాలేజి, ఊరు, పొలాలు ఇలా అన్నీ విషయాలను చెప్తుండేవారు. అలా చిన్నతనం నుంచే శేరికి తన తండ్రి ఊరు పట్ల ఒకరకమైన బంధం పెరిగిపోయింది.
పెరిగి పెద్దయిన శేరి ఇప్పుడు 12వ తరగతి చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి సాకర్ పట్ల ఆసక్తి చూపిన శేరికి తండ్రి శ్రీధర్ శిక్షణ ఇప్పించారు. బాగా ప్రోత్సహించారు. తండ్రికి బాగా ఇష్టమైన సాకర్‌ను అమితంగా ప్రేమించిన శేరి, ఆటలో రాణించాడు. రాష్ట్ర స్థాయికి ఆడుతూ, జాతీయ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. తండ్రికి ఇష్టమైన సాకర్‌లో బాగా రాణిస్తున్నాడు. ఆటవిడుపుగా తండ్రి జన్మస్థలంపైన అపారమైన మక్కువ చూపే శేరి.. ఊహ తెలిశాక తొలిసారి తన మూలాలను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. తన వయసు వాళ్లు, ఇంకా చిన్నవాళ్లను ఒక్కచోటికి చేర్చాడు. అప్పటికే సాకర్ ఆడుతున్న వారికి శిక్షణ ఇచ్చాడు. మెళకువలు నేర్పించాడు. అసలు ప్రవేశం లేని వారిని సాకర్ పట్ల ఆసక్తి పెంచేలా మోటివేట్ చేశాడు. ఇలా తనవంతుగా తన తండ్రి ఊరికి సేవలు అందిస్తున్నాడు.
పేద క్రీడాకారలకు అండగా..
ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా మణుగూరుకు చెందిన శ్రీధర్ ఇప్పుడు అమెరికాలోని వర్జీనియాలో సెటిల్ అయ్యారు. ఆయన కుమారుడు శేరి సాకర్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. తండ్రికి ఇష్టమైన స్వస్థలంలోని యువతకు ఆటలో మెళకువలు నేర్పించడానికే పరిమితం కాకుండా ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చాడు. 'ఖమ్మం కైండ్‌నెస్' అనే యాప్ ద్వారా తాను సేకరించిన నిధులను సైతం ఆట అభివృద్ధికి, క్రీడాకారులను ఆదుకోడానికి వ్యయం చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే తాను సేకరించిన రూ.2.34 లక్షలను ఇలా వారికోసం ఖర్చు చేశాడు. దీంతోపాటు ఖమ్మం ఫుట్‌బాల్ అసోసియేషన్ సైతం తన వంతుగా సాయం అందించడానికి ముందుకొచ్చింది. దీంతో శేరికి తన లక్ష్యం చేరుకోవడం మరింత సులువైంది. ఇలా సహకరిస్తే భవిష్యత్తులో ఏటా వచ్చి ఇక్కడ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను శేరి వ్యక్తపరిచాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Football, Khammam, Srimanthudu