జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్-2023 (JEE Main 2023) సెషన్ -1 కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 24 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ కటాఫ్ ఎంత ఉండొచ్చు అనే సందేహం ప్రతి అభ్యర్థిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అవగాహన కోసం గత నాలుగేళ్ల కటాఫ్ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
* ఈసారి కాస్త ఎక్కువగానే..
కరోనా కారణంగా గత రెండేళ్లతో పోల్చుకుంటే ఈసారి పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. దీంతో ఈసారి జేఈఈ మెయిన్ కటాఫ్ కాస్త ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేటగిరి వారీగా కటాఫ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు.
* గత నాలుగేళ్ల కటాఫ్ ఇలా
2019లో జనరల్ కేటగిరి అభ్యర్థులకు కటాఫ్ 89.7గా ఉండేది. 2020లో ఇది కాస్త పెరిగి 90.3కు చేరింది. 2021లో కరోనా కారణంగా కటాఫ్‌ను 87.8కు తగ్గించారు. ఇక గతేడాది 2022లో ఇది 88.41 ఉంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు 2019లో జేఈఈ మెయిన్ కటాఫ్ 78.21గా నిర్ణయించారు. 2020లో ఏకంగా 70.2కు తగ్గించారు. 2021లో కొద్దిగా పెంచి 68.02గా నిర్ణయించారు. ఇక 2022లో 63.11కు తగ్గించారు.
ఓబీసీ-ఎన్‌సీఎల్ కేటగిరి అభ్యర్థులకు 2019లో కటాఫ్ 74.3గా ఉండేది. 2020లో ఇది కాస్త తగ్గి 72.8కు చేరింది. 2021లో మహమ్మారి కారణంగా కటాఫ్‌ను భారీగా 68.02కు తగ్గించారు. 2022లో కటాఫ్ 67.00గా నిర్ణయించారు. ఎస్సీ కేటగిరి అభ్యర్థులకు 2019లో కటాఫ్ 54.01గా నిర్ణయించారు. 2020లో 50.1గా ఉండగా, 2021 వచ్చేసరికి దీన్ని 46.8కు తగ్గించారు. ఇక, 2022లో మరింత తగ్గించి 43.08గా నిర్ణయించారు.
ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు 2019లో కటాఫ్ స్కోర్ 44.3గా ఉండేది. 2020లో 39.06కు తగ్గించగా, 2021లో మరింత తగ్గించి 34.6గా, 2022లో 26.7గా నిర్ణయించారు. పీడబ్ల్యూడీ కేటగిరి అభ్యర్థులకు 2019లో జేఈఈ మెయిన్ కటాఫ్ 0.11 కాగా, 2019లో అది 0.06, 2020లో 0.01కు తగ్గించారు. 2022లో 0.003గా నిర్ణయించారు.
* నాలుగేళ్ల కనిష్ట కటాఫ్ స్కోర్..
2022లో ఐఐటీ ప్రవేశ పరీక్ష JEE అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందేందుకు JEE మెయిన్స్‌లో కటాఫ్ స్కోర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే జనరల్ కేటగిరీ విద్యార్థులకు మాత్రం 2022లో కటాఫ్ స్కోర్స్ గత సంవత్సరాలతో పోల్చితే స్వల్పంగా పెరగడం గమనార్హం.
* వివిధ అంశాల ఆధారంగా..
NITs కోసం JEE మెయిన్ కటాఫ్ వేర్వేరు ఇన్‌స్టిట్యూట్స్‌కు వేర్వేరుగా ఉంటుంది. JEE మెయిన్ NIT కటాఫ్ అనేక అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. పరీక్ష క్లిష్ట స్థాయి, పరీక్షకు హాజరైన మొత్తం అభ్యర్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య, ప్రవేశం కోరిన కేటగిరీల వారీగా అడ్మిషన్స్ కోరిన అభ్యర్థుల సంఖ్య తదితర విషయాలపై ఆధారపడి ఉంటుంది.
* జేఈఈ అడ్వాన్స్‌డ్ పట్ల నిరాసక్తత
కటాఫ్ తగ్గిస్తే దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని అందరూ భావించారు. అయితే కొన్నేళ్లుగా ఐఐటీ ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2021లో 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్ కోసం అర్హత సాధించినా, 1,41,699 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 2020లో 1,50,838 అభ్యర్థులు, 2019లో 1,61,319, 2018లో 1,55,158 మంది జేఈఈ అడ్వాన్స్‌కు హాజరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JEE Main 2023, JOBS