కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం సాయుధ దళాల్లో నియామకాల కోసం అగ్నిపథ్ స్కీమ్‌ను (Agnipath Scheme) ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ స్కీమ్‌ను చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు కూడా. ఈ ఏడాది 46,000 మంది అగ్నివీర్లను నియమించుకుంటామని ప్రకటించారు. అలాంటి స్కీమ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరుద్యోగుల ఆగ్రహానికి, విధ్వంసానికి కారణం అవుతోంది. అసలు అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏంటీ? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) సహా దేశంలోని ఇతర రైల్వే స్టేషన్లలో నిరుద్యోగుల ఆగ్రహానికి కారణమేంటీ? అసలు ఈ విధ్వంసానికి దారితీసిన పరిస్థితులు ఏంటీ? తెలుసుకోండి.
కేంద్ర కేబినెట్ ఆమోదంతో కేంద్ర రక్షణ శాఖ అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను మంగళవారం ప్రకటించింది. సాయుధ దళాల్లో భారతీయ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు రూపొందించిన పథకం ఇది. ఈ స్కీమ్ ద్వారా అగ్నివీర్లను నియమించుకొని, వారికి సరైన శిక్షణ ఇచ్చి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు కల్పించడమే ఈ స్కీమ్ లక్ష్యం. 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారిని నియమించుకుంటామని మొదట ప్రకటించినా, నిరుద్యోగుల ఆగ్రహంతో గరిష్ట వయస్సును 23 ఏళ్లకు పెంచింది కేంద్ర ప్రభుత్వం.
India Post GDS results 2022: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి అప్లై చేశారా? ఫలితాలు ఇలా చెక్ చేయాలి
ఎంపికైనవారికి మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు రూ.33,000, మూడో ఏడాది నెలకు రూ.36,500, నాలుగో ఏడాది నెలకు రూ.40,000 చొప్పున వేతనం లభిస్తుంది. మెడికల్, ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రూ.48 లక్షల నాన్ కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్స్యూరెన్స్ కవర్ కూడా వర్తిస్తుంది. అయితే ఇవి శాశ్వత ఉద్యోగాలు కావు. కేవలం నాలుగేళ్ల వ్యవధి కోసం నియమిస్తున్న ఉద్యోగాలు. నాలుగేళ్లలో ఆరు నెలలు శిక్షణ ఉంటుంది. మిగతా మూడున్నరేళ్లు అగ్నివీర్లు సాయుధ దళాల్లో సేవలు అందించాలి. అగ్నివీర్లు నాలుగేళ్లు సేవలు అందించిన తర్వాత వారికి ఎగ్జిట్ ఉంటుంది. వారిలో 25 శాతం మందిని రెగ్యులర్ కేడర్‌లో చేర్చుకుంటారు.
రెగ్యులర్ కేడర్‌లో చేరినవారు 15 ఏళ్ల పాటు నాన్ ఆఫీసర్ ర్యాంక్స్లో పనిచేయొచ్చు. ఎగ్టిట్ అయినవారికి రూ.11.71 లక్షల సేవా నిధి లభిస్తుంది. దీనికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఆ తర్వాత పెన్షన్, ఇతర బెనిఫిట్స్ ఉండవు. వారంతా మరో కెరీర్లో స్థిరపడేందుకు బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తాయి. కేంద్ర రక్షణ శాఖ వార్షిక డిఫెన్స్ బడ్జెట్ తగ్గించుకోవాలన్న లక్ష్యంతో అగ్నిపథ్ స్కీమ్‌ను రూపొందించింది. అంతేకాదు దేశ రక్షణలో భాగస్వాములుగా ఉండాలనుకునే యువతకు ఇది మంచి అవకాశంగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... అప్లై చేయండిలా
మరి నిరుద్యోగులు ఈ స్కీమ్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆందోళనలకు ఎందుకు దిగుతున్నారు? విధ్వంసానికి ఎందుకు పాల్పడుతున్నారు? అన్న సందేహాలు అందరిలో ఉన్నాయి. నిరుద్యోగుల వ్యతిరేకతకు ప్రధాన కారణం సాయుధ బలగాల్లో పనిచేసే కాలం నాలుగేళ్లకు తగ్గిపోతుండటమే. నాలుగేళ్లు డిఫెన్స్‌లో పనిచేసిన తర్వాత తమకు ఉద్యోగ భద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు నాలుగేళ్ల తర్వాత ఈ స్కీమ్ నుంచి బయటకు వచ్చేసినవారికి పెన్షన్ కూడా ఉండదు. మరోవైపు వయస్సు పరిమితి కూడా తక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం గరిష్ట వయస్సును 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచింది. కానీ మిగతా అంశాలపై నిరుద్యోగుల ఆందోళన కొనసాగుతోంది.
అగ్నిపథ్ స్కీమ్ పట్ల సంతోషంగా లేని నిరుద్యోగులు అల్లర్లకు దిగుతున్నారు. ఆర్మీలో చేరడానికి తాము కొన్నేళ్లుగా కష్టపడుతున్నామని, కానీ నాలుగేళ్ల గడువుతో నియామకాలు చేపట్టడం తమకు అన్యాయం చేసినట్టవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట బీహార్‌లో మొదలైన నిరసన కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు పాకాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు.
అగ్నిపథ్ పథకంపై అపోహలు.. అన్నింటికీ క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. వివరాలివే..
నిరుద్యోగుల్లో ఉన్న అనుమానాలు, సందేహాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. నాలుగేళ్లు అగ్నివీర్లుగా పనిచేసిన తర్వాత ఏమేం చేయొచ్చో ప్రభుత్వం వివరించింది. సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్, రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఫోర్స్‌లో చేరొచ్చని తెలిపింది. అగ్నిపథ్ స్కీమ్‌పై ఉన్న అపోహల్ని, వాస్తవాలను వివరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agnipath Protest, Agnipath Scheme, Army jobs, Central Government Jobs, JOBS, Secunderabad railway station