తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే పెద్ద ఆస్తి మంచి చదువు. సరైన విద్య అందించగలిగితే చాలు తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారని భావించే తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతోంది. అయితే, ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులు విపరీతంగా పెరగడంతో వారి భవిష్యత్ కోసం కోసం వివిధ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను తీసుకుంటున్నారు తల్లిదండ్రులు. తాజాగా జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 2008 నుండి 2014 మధ్య కాలంలో స్కూల్ ఎడ్యుకేషన్ కోసం వెచ్చించే వ్యయం 175 శాతం పెరిగింది. ఇదే కాలంలో, ప్రొఫెషనల్, టెక్నికల్ విద్య వార్షిక వ్యయం 96 శాతం పెరిగింది. ఇవి కోర్సు ఫీజులు, పుస్తకాలు, రవాణా, ప్రైవేట్ కోచింగ్ వంటి ఖర్చులను బట్టి అంచనా వేశారు. అందువల్ల, రాబోయే కాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని, విద్య కోసం ఖర్చులు మరింతగా పెరగనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఖర్చులను భరించేందుకు తల్లిదండ్రులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని చెబుతున్నారు.
పెరుగుతున్న విద్యా ఖర్చులపై ఎడెల్విస్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ రిటైల్ ఆఫీసర్ అనుప్ సేథ్ మాట్లాడుతూ “భారతదేశంలో విద్యా ద్రవ్యోల్బణం ఏటా 10 నుంచి 12 శాతం మేర ఉంటుందని అంచనాలున్నాయి. ఉదాహరణకు, ఇంజనీరింగ్ డిగ్రీకి ప్రస్తుతం రూ .6 లక్షలు, ఎంబీఏ రూ .10 లక్షలు ఖర్చవుతుంది. మరో 15 సంవత్సరాల తరువాత ఇంజినీరింగ్‌కు రూ .15 లక్షలకు పైగా, ఎంబీఏకు రూ .30 లక్షలకు పైగా ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇది భారతదేశంలో చదువుకు మాత్రమే. ఇక విదేశాల్లో చదువుకోవడానికి మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో అంచనా ఖర్చులు రెట్టింపయ్యే అవకాశం ఉంది. అందువల్ల, ఈ ఖర్చులను భరించాలంటే తల్లిదండ్రులు సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి” అన్నారు. ఇలా భవిష్యత్ విద్యా ఖర్చులను తట్టుకునేందుకు వివిధ పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలి. వాటిలో చైల్డ్ ప్లాన్స్ ఆకర్షణీయంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లాన్లను అనేక బీమా సంస్థలు అందిస్తున్నాయి.- ఇవి డెట్ ఫండ్ల మాదిరి ట్రెడిషనల్ ప్లాన్స్ కావు. రుణ, ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టడానికి అనుమతించే మార్కెట్-లింక్డ్ పాలసీలుగా వీటిని పేర్కొనవచ్చు.
ఏదేమైనా, చైల్డ్ ప్లాన్స్‌ను ఎంచుకునే ముందు పిల్లల కోసం వారి పాఠశాల విద్య, ఉన్నత విద్య, అభిరుచులు, క్రీడలు వంటి విభిన్న ఖర్చులను అంచనా వేసి వారి భవిష్యత్లు కోసం ఎంత మేరకు ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. వీటి ద్వారా భవిష్యత్తులో పిల్లల విద్యకు అయ్యే ఖర్చులను సులభంగా తీర్చుకోవచ్చు. ఒక వేళ దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు మరణించినప్పటికీ, పిల్లలు తమ విద్యను ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించవచ్చు. కుటుంబంలో అనుకోని సంఘటన జరిగితే, ఈ చైల్డ్ పాలసీలు పిల్లవాడికి ఆర్థిక రక్షణగా నిలుస్తాయి. ఉదాహరణకు, పాలసీదారుడి మరణం లేదా వైకల్యం పొందితే, ఈ ప్రీమియం పిల్లవాడు కట్టలేక పోవచ్చు. అందువల్ల, ఆయా ప్రీమియం మొత్తాన్ని మాఫీ చేస్తాయి బీమా సంస్థలు. తద్వారా, పిల్లవాడు ఆ ప్రీమియంను కట్టాల్సిన పనిలేకుండానే రిస్క్ కవరేజీని పొందవచ్చు. అంతేకాక, ఈ ప్లాన్లు అనేక పన్ను ప్రయోజనాలను కూడా అందజేస్తాయి.- చెల్లించిన ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టం, 1961లోని U / S 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. మెచ్యూరిటీ క్లెయిమ్ లాభాలపై కూడా పన్ను ప్రయోజనం U/ S 10 (10D) లభిస్తుంది. సాంప్రదాయ పెట్టుబడి మార్గాలైన పీపీఎఫ్ లేదా ఎఫ్‌డిలతో పోల్చినప్పుడు చైల్డ్ ప్లాన్స్ మంచి రాబడిని ఇస్తాయని నిపుణులు అంటున్నారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.