ప్రపంచానికి యోగాను (Yoga) అందించింది భారతదేశం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చూపిన చొరవతో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి యోగాపై ప్రపంచ దేశాలకు కూడా ఆసక్తి పెరిగింది. యోగాను నేర్చుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇండియాలో కూడా గత కొన్నేళ్లలో యోగాకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వివేకానంద యోగా విశ్వవిద్యాలయం (Vivekananda Yoga University)ని కర్ణాటక, బెంగళూరులో ప్రారంభించారు. ఇది డీమ్డ్ యూనివర్సిటీగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నుంచి గుర్తింపు పొందింది. డాక్టర్ బీఆర్ రామకృష్ణ ప్రస్తుతం దీనికి వైస్ ఛాన్సలర్‌గా పని చేస్తున్నారు. యూనివర్సిటీ ప్రారంభమైన కొన్ని సంవత్సరాలలోనే మన దేశంతోపాటు బయట దేశాలలో కూడా శాఖలను ఏర్పాటు చేసుకోగలిగింది. భారతదేశం బయట కూడా బ్రాంచెస్ ఉన్న ఏకైక యోగా విశ్వవిద్యాలయం ఇదే కావడం గమనార్హం. దీన్ని వాయు(VaYU) అని కూడా పిలుస్తుంటారు. తాజాగా ఇప్పుడు ఈ వర్సిటీ పీహెచ్‌డీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
యోగాలో పీహెచ్డీ
వివేకానంద యోగా యూనివర్సిటీ తమ పరిధిలో మొదటిసారిగా యోగా పీహెచ్‌డీని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. మొదటి బ్యాచ్ తొందరలోనే ప్రారంభం అవుతుందని చెప్పింది. యునైటెడ్ స్టేట్స్(US), కెనడా, ఖతార్, ఫ్రాన్స్, భారతదేశాలకు చెందిన 10 మంది డాక్టోరల్ (Ph.D) విద్యార్థులు ‘ఫాల్ 2022’ మొదటి బ్యాచ్ కోసం నమోదు చేసుకున్నారని విశ్వవిద్యాలయం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ యూనివర్సిటీ USలో MS-PhD పేరుతో ప్రత్యేక కోర్సును కూడా ప్రవేశపెట్టింది. మరింత ఉన్నత స్థాయిలో డిగ్రీలు చెయ్యాలని అనుకునే వారి కోసం ఇది ఉపయోగకరంగా ఉంటుందని వాయు తెలిపింది. యోగా ఎడ్యుకేషన్‌ని వ్యాప్తి చేయడానికి ఇలాంటి చర్యలు దోహదం చేస్తాయని పేర్కొంది.
మరిన్నిచోట్ల అనుబంధ కళాశాలలు?
స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్రన్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలకు ‘వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజస్’(Western Association Of Schools And Colleges(WASC)) అక్రిడేషన్లను ఇస్తుంది. దీనితో వాయు చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది నాటికి ఈ ప్రాసెస్ పూర్తయితే మరిన్ని చోట్ల ఈ యూనివర్సిటీకి అనుబంధ కళాశాలలు వస్తాయి.
తమ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు చాలా శాస్త్రీయ పద్దతుల్లో డిజైన్ చేసినట్లు వాయు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్, అకడమిక్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ మురళి వెంకట్రావు తెలిపారు. వాయు తమ మొదటి ఆన్లైన్ ఎంఎస్(MS) బ్యాచ్‌ని విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు. తమ యునీక్ ఆన్లైన్ కరికులం, వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీలతో అత్యుత్తమంగా బోధన చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, New courses, Yoga