అమెరికాలో ఉద్యోగం(Job) చేయాలని చాలామంది కోరుకుంటారు. ముఖ్యంగా భారతీయులకు ఆసక్తి ఎక్కువ. అయితే అక్కడ పనిచేయాలని కోరిక ఉన్నా అందుకు అనుగుణమైన వీసాలను ఎంచుకోవడంలో కొందరు పొరబడుతుంటారు. ఫలితంగా వీసాలు పొందలేక ఇక్కడే ఉండిపోతుంటారు. మరి అమెరికా వర్క్ వీసా(Visa) పొందడం ఎలా? ఇందుకు అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటో తెలుసుకుందాం.
ఆఫర్ లెటర్ మస్ట్
అమెరికా వర్క్ వీసా పొందాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. అభ్యర్థికి ఎంతో ఓపిక కూడా ఉండాలి. ఎందుకంటే వీసా మంజూరు ప్రక్రియకు చాలా వ్యవధి ఉంటుంది. కొన్నిసార్లు వారాలు పట్టొచ్చు. కొన్ని నెలల సమయం తీసుకోవచ్చు. కాబట్టి, అన్ని ప్రక్రియలను సక్రమంగా పూర్తి చేసి వీసా కోసం తప్పక వేచి చూడాల్సి ఉంటుంది. అయితే, ముందుగా వీసా కోసం అప్లై చేసుకోవాలంటే అక్కడి కంపెనీల్లో ఉద్యోగం సంపాదించాల్సి ఉంటుంది. మీకు తెలిసిన వారి రిఫరెన్స్ ద్వారా, ఆయా కంపెనీల వెబ్‌సైట్లను ఆశ్రయించండం ద్వారా, జాబ్ ఫెయిర్‌ల ద్వారా ఉద్యోగం పొందొచ్చు. కన్సల్టెన్సీ సంస్థ ద్వారా కూడా జాబ్ సంపాదించొచ్చు. అయితే ఆఫర్ లెటర్ తప్పనిసరి. అప్పుడే వీసా దరఖాస్తు కోసం అర్హులవుతారు.
వివిధ రకాలు
వర్క్ వీసాల్లో వివిధ కేటగిరీలు ఉన్నాయి. అందులో మీకు కావాల్సిన వీసాను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా ఆయా వీసాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అక్కడికి వెళ్లాక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు(ప్రొఫెషనల్) H-1B వీసా, భారత్‌లో నివసిస్తూ ఇప్పటికే అమెరికన్ కంపెనీల్లో పనిచేస్తున్న వారికి L-1 వీసా, పారిశ్రామిక వేత్తలకు E-2 ట్రీటీ ఇన్వెస్టర్ వీసా, ఇతర బిజినెస్ సంబంధిత కార్యకలపాల కోసం వీసాలను పొందొచ్చు. ఇలా వివిధ కేటగిరీలకు సంబంధించిన వీసాల కోసం తెలుసుకోవడానికి US Department Of States వెబ్‌సైట్‌ని చూడొచ్చు.
పేపర్ వర్క్ తప్పనిసరి
వీసా కోసం కచ్చితంగా పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. జాబ్ ఆఫర్ లెటర్ కాపీ, వివరాలతో కూడిన అప్లికేషన్ ఫాం, రెజ్యుమె(Resume), ట్రైనింగ్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు సమర్పించాలి. వీటితో పాటు పాస్‌పోర్ట్, బ్యాంకింగ్ స్టేట్‌మెంట్స్(ఆర్థికంగా మనుగడ సాగించగలరా? లేదా? అని వెరిఫై చేయడానికి) వంటివి జత చేయాలి. వీసా దరఖాస్తుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకున్నాకే అప్లై చేయడం ప్రారంభించాలి. అప్లై చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న తప్పు దొర్లినా అది వీసా మంజూరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆలస్యం కావొచ్చు. అప్లికేషన్‌ని మెయిల్ ద్వారా లేదా ఆ దేశ ఎంబసీలో నేరుగా సబ్మిట్ చేయవచ్చు. ఆయా దేశాల ఎంబసీల గైడ్‌లైన్స్‌కు లోబడి అప్లై చేయాల్సి ఉంటుంది. కొన్ని ఎంబసీల్లో అప్లై చేయాలంటే అపాయింట్‌మెంట్ తప్పనిసరి. మరికొన్ని వాటిల్లో నేరుగా వెళ్లి చేసుకోవచ్చు. వీసా అప్లికేషన్ ప్రక్రియలో ఏమైనా సందేహాలుంటే సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
I-797 ఫారం
వీసా దరఖాస్తు సమర్పించాక రిప్లై కోసం ఎదురు చూడాలి. కొన్ని వారాలు, నెలలు సమయం పట్టొచ్చు. కాబట్టి వీసా వస్తుందన్న ఆశతో ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం వంటివి చేయొద్దు. నాన్ రిఫండబుల్ ట్రావెల్ ప్లాన్ జోలికి వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి వీసా గ్రాంట్ అయ్యాక అమెరికాలో అడుగుపెట్టవచ్చు. వీసా గడువును ధ్రువీకరిస్తూ I-797 అనే ఫారం మంజూరు చేస్తుంది. పాస్‌పోర్టుపై వీసా స్టాంప్ వేస్తుంది. విమానాశ్రయంలో I-797 ఫారం, పాస్‌పోర్టుపై వీసా స్టాంపుని ఇమిగ్రేషన్ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఇలా మీరు అధికారికంగా అమెరికాలో అడుగు పెట్టొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Govt Jobs, H1B Visa, JOBS, Visa