Venu, News18, Mulugu
పుస్తకాల్లోని పాఠాల కంటే ఎక్కువగా నేటి తరం విద్యార్థుల్లో సృజనాత్మకత దాగి ఉంది. అయితే వారిలోని ఈ టాలెంట్‌ను వెలికి తీసేందుకు సరైన వేదిక లేకపోయింది. దీంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు సరైన అవకాశం కోసం చూస్తున్నారు. పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, వారి శక్తి సామర్థ్యాలను మరింత సానపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన్ భారతి విజ్ఞాన్ ప్రసాద్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో "విజ్ఞాన్ మంథన్" అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఎవరు అర్హులు: 6 నుంచి 10వ తరగతి చదివే పాఠశాల విద్యార్థులు, జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు అర్హులు.
ఎలా అప్లై చేయాలి: ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్లో సమర్పించవలసి ఉంటుంది. విద్యార్థులు vvm.org.in వెబ్సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ పరీక్ష రాసే విద్యార్థులు రూ. 200లు పరీక్షా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
సీనియర్ జూనియర్ విభాగాలు: 6 నుంచి 9వ తరగతి పాఠశాల విద్యార్థులను జూనియర్ విభాగంగానూ, 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులను సీనియర్ విభాగాలుగా పరిగణలోకి తీసుకుంటారు. పరీక్ష తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఏదైనా ఒక భాషను విద్యార్థి ఎంచుకోవచ్చు.
ఈ పరీక్షలో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రాల నుంచి 50% మార్కులు, భారతదేశం కృషిపై 20% మార్కులు, పరిశోధనలపై 20% మార్కులు, లాజికల్ రీజనింగ్ నుంచి 10% మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష జరిగే 90 నిమిషాలలో 100 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి.
బహుమతులు: జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాల్గొనే విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థులకు వరుసగా రూ. 5000, రూ. 3000, రూ. 2000 నగదు బహుమతిగా ఇస్తారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి రూ.25000, రూ.15000, రూ.10000లను అందజేయడంతో పాటు దేశంలోని పరిశోధన అభివృద్ధి సంస్థలను సందర్శించే అవకాశం కూడా కల్పిస్తారు.
ములుగు జిల్లా పరిధిలో ఉండే పాఠశాలలో ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని వారికి ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమంతో పాటు శిక్షణ కూడా ఇస్తామని ఈ సువర్ణ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా సైన్స్ అధికారి జయదేవ్ చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana