UPSC Prelims 2020: సివిల్ సర్వీసెస్ పరీక్షకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. షెడ్యూల్ ప్రకారమే..

ఇది విద్యార్థుల పరీక్షలు కాదని.. పబ్లిక్ సర్వెంట్స్ పరీక్ష అని స్పష్టం చేసింది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలని అభ్యర్థులకు సూచించింది సుప్రీంకోర్టు.

news18-telugu
Updated: September 30, 2020, 1:52 PM IST
UPSC Prelims 2020: సివిల్ సర్వీసెస్ పరీక్షకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. షెడ్యూల్ ప్రకారమే..
వాస్తవానికి మే 31నే సివిల్ సర్వీసెస్ పరీక్షలు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఆ పరీక్షలను అక్టోబరు 4కు వాయిదా వేశారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
  • Share this:
దేశంలో కరోనా విజృంభిస్తున్న ఇప్పటికే ఎన్నో ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఐతే అన్‌లాక్ 4లో భాగంగా ఈ నెలలో ఆంక్షలు సడలించిన నేపథ్యంలో నీట్ (NEET 2020), జేఈఈ మెయిన్ (JEE) పరీక్షలను నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఎంతో మంది కోర్టుల్లో కేసులు వేసినప్పటికీ.. పరీక్షలను నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. ఐతే తాజాగా సివిల్ సర్వీస్ పరీక్షల వ్యవహారం కూడా సుప్రీంకోర్టుకు చేరింది. కరోనా మహమ్మారి విజృంభించడంతో పాటు దేశవ్యాప్తంగా వరదల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పరీక్షలను వాయిదావేసేందుకు నిరాకరించింది. కోవిడ్ నేపథ్యంలో కేంద్రం ఎస్‌వోపీ ప్రకారం ఇప్పటికే పలు పరీక్షలను నిర్వహించారని ఈ సందర్భంగా గుర్తు చేసింది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహించుకోవచ్చనీ యూపీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్షాలు, వాతావరణ సమస్యలు.. ఇలా ప్రతి ఏటా ఏదో ఒక సమస్య ఉంటుందని అలాగని పరీక్షలను వాయిదా వేయలేమని తెలిపింది. ఇది విద్యార్థుల పరీక్షలు కాదని.. పబ్లిక్ సర్వెంట్స్ పరీక్ష అని స్పష్టం చేసింది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలని అభ్యర్థులకు సూచించింది సుప్రీంకోర్టు.

వాస్తవానికి మే 31నే సివిల్ సర్వీసెస్ పరీక్షలు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఆ పరీక్షలను అక్టోబరు 4కు వాయిదా వేశారు. ఐతే ప్రస్తుతం భారీగా కరోనా కేసులు నమోదవుతుండడం, దేశవ్యాప్తంగా వరదల నేపథ్యంలో.. సివిల్ సర్వీసెస్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ 20 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షను జేఈఈ, నీట్ వంటి పరీక్షలతో పోల్చకూడదని.. ఆ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయే అవకాశముంటుందని, కానీ సివిల్ సర్వీసెస్ పరీక్షలను వాయిదా వేస్తే అలా పరిస్థితేమీ ఉండదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కొన్నాళ్లు వాయిదా వేసినంత మాత్రాన ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను నిర్వహించడమంటే అభ్యర్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమేనని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. పిటిషన్ వేసిన ఓ అభ్యర్థి తండ్రి మాట్లాడుతూ... ప్రస్తుతం మా అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని.. కోవిడ్ పరిస్థితుల్లో పనిభారం కారణంగా సివిల్ సర్వీస్ పరీక్షలకు సరైన విధంగా సన్నద్ధం కాలేకపోతున్నాడని పేర్కొన్నారు. సెలవులు పెట్టి పరీక్షలను ప్రిపేర్ అయ్యే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. కానీ మిగతా వారు మాత్రం ఇళ్లల్లో కూర్చొని పరీక్షలను సన్నద్ధమవుతున్నారని తెలిపారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే తమ కుమారుడిలాంటి వారు ఎంతో మంది నష్టపోయే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పరీక్షలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ కోర్టు మాత్రం పరీక్షలను వాయిదా వేసేందుకు అంగీకరించలేదు.

కాగా, కరోనా కారణంగా వాయిదా పడిన నీట్, జేఈఈ పరీక్షలను ఈ నెలలో నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, సినీ నటులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలంటే మీకు లెక్క లేదా అని మండిపడ్డారు. ఐనప్పటికీ కేంద్రం మాత్రం వెనక్కి తగ్గలేదు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలను నిర్వహించింది.
Published by: Shiva Kumar Addula
First published: September 30, 2020, 1:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading