NDA Exam: డిఫెన్స్ పరీక్షలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ.. అప్లికేషన్ విండో ఓపెన్ చేసిన UPSC

(ప్రతీకాత్మక చిత్రం)

మహిళల శారీరక ప్రమాణాలు, వారి పోస్టులకు సంబంధించి ఖాళీ వివరాలను రక్షణ శాఖ(Ministry of Defence) నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా వెల్లడిస్తామని యూపీఎస్‌సీ తెలిపింది. మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 8 సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంటుందని యూపీఎస్‌సీ పేర్కొంది.

  • Share this:
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC). ఎన్‌డీఏ, నావల్ అకాడమీ 2021 పరీక్షల కోసం అవివాహిత మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. మహిళా అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ విండోను తాజాగా తెరిచింది. ఈ పరీక్ష నవంబర్ 14న జరగనుంది.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగల భర్తీ కోసం యూపీఎస్‌సీ ఏటా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), నావల్ అకాడమీ పరీక్ష నిర్వహిస్తుంటుంది. ఎన్‌డీఏ ప్రవేశపరీక్షలో దరఖాస్తు చేసుకోవడానికి మహిళలకు ఇప్పటివరకూ అనుమతి లేదు. అయితే ఇటీవల సుప్రీం కోర్టు.. మహిళలను కూడా ఎన్‌డీఏ పరీక్షకి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా UPSC తాజా నిర్ణయం తీసుకుంది.

"నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ (II) 2021 పరీక్షలకు మహిళా అభ్యర్థులను అనుమతించాలని భారత సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను అనుసరించి యూపీఎస్‌సీ ఈ పరీక్ష కోసం దరఖాస్తు వెబ్‌సైట్ (upsconline.nic.in) లో ఆన్‌లైన్ పోర్టల్‌ను తెరవాలని నిర్ణయించింది. అవివాహిత మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది” అని యూపీఎస్‌సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

మహిళల శారీరక ప్రమాణాలు, వారి పోస్టులకు సంబంధించి ఖాళీ వివరాలను రక్షణ శాఖ(Ministry of Defence) నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా వెల్లడిస్తామని యూపీఎస్‌సీ తెలిపింది. మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 8 సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంటుందని యూపీఎస్‌సీ పేర్కొంది. చివరి తేదీ అంటే అక్టోబర్ 8న సాయంత్రం 6 గంటల తరువాత దరఖాస్తులు తీసుకోమని వెల్లడించింది. ఆన్‌లైన్ మోడ్ లో కాకుండా ఏ ఇతర మోడ్ ద్వారా దరఖాస్తు చేసినా వాటిని తిరస్కరిస్తామని ప్రకటనలో పేర్కొంది.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్ష (II), 2021 లో మహిళా అభ్యర్థుల ప్రవేశం తాత్కాలికంగా (provisional) ఉంటుంది. అయితే మహిళల ప్రవేశాలు కోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్(writ petition) తుది ఫలితానికి లోబడి ఉంటాయి. లేదా సుప్రీం కోర్టు ఆమోదం పొందిన ఇతర ఆర్డర్స్ పై ఆధారపడి ఉండనున్నాయి. మహిళలను ఎన్‌డీఏలో జాయిన్ చేసుకునే విషయంలో భారత ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోనుంది.

లింగ సమానత్వాన్ని సాధించే ప్రధాన లక్ష్యంలో భాగంగా.. సుప్రీం కోర్టు ఆగస్టు 18న ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షల్లో హాజరయ్యేందుకు అర్హులైన మహిళలను అనుమతించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, హృషికేష్ రాయ్ ల ధర్మాసనం కుష్ కల్రా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులను ఎన్‌డీఏ, నావల్ అకాడమీ పరీక్షలో పాల్గొనేలా అనుమతించాలని.. వారికి ఎన్‌డీఏలో శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో సుప్రీం కోర్టు మహిళలు పురుషులతో సమానంగా ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షల్లో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
Published by:Krishna Adithya
First published: