ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ ప్రభావం అన్ని రంగాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఫైనాన్షియల్ రంగంలో కూడా పెను మార్పులను తీసుకొచ్చింది. ఇండియాలో ఆర్బీఐ డిజిటల్ రూపీని లాంచ్ చేయడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే సాంప్రదాయ ఫైనాన్షియల్ కోర్సులు ప్రస్తుత అవసరాలను తీర్చేలా విద్యార్థులను తీర్చిదిద్దడం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎసెక్స్ యూనివర్సిటీ(Essex) కొత్త ఒరవడిని సృష్టించేందుకు సిద్ధమైంది. విద్యార్ధుల కెరీర్ గోల్స్, ఇంట్రెస్ట్ దృష్టిలో ఉంచుకొని ఎసెక్స్ యూనివర్సిటీకి చెందిన ఎసెక్స్ బిజినెస్ స్కూల్, ఫైనాన్షియల్ టెక్నాలజీలో కొత్త ఎమ్మెస్సీ కోర్సుని త్వరలోనే ప్రారంభించనుంది. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు ఫైనాన్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ అనే మూడు రంగాల్లో అడుగుపెట్టవచ్చు.
విద్యార్థులకు మల్టిపుల్ ఆప్షన్లు
ఎసెక్స్ విశ్వవిద్యాలయంలోని బ్యాంకింగ్, ఫైనాన్స్ ప్రొఫెసర్ ఫ్రాంకో ఫియోర్డెలిసి మాట్లాడుతూ.. రోజురోజుకీ జనాభా పెరుగుతోందని, టెక్నాలజీ కొత్త మార్పులను తీసుకొస్తోందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఫైనాన్షియల్ సిస్టమ్‌కి లేటెస్ట్ టెక్నాలజీ విసిరే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని.. ప్రస్తుతం ఫైనాన్ష్లో ఉన్న సంప్రదాయ మాస్టర్స్ కోర్సులు విద్యార్థులకు అందించడం లేదని అభిప్రాయపడ్డారు. ఎకనామిక్, ఫైనాన్షియల్, ఇంజినీరింగ్, ఫిజికల్ వంటి ఏదో ఒక కోణంలో నుంచి ఫైనాన్ష్ను చూడలేమని ఆయన చెప్పారు. వీటన్నింటిని మెర్జ్ చేసే ఒక నిర్ధిష్ట ప్రోగ్రామ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ(Fintech)కి అవసరమని అభిప్రాయపడ్డారు. ఆ అవసరాలను తీర్చేందుకు కొత్త కోర్సు డిజైన్ చేశామన్నారు. ఈ ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, ఎస్సెక్స్ బిజినెస్ స్కూల్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ స్కిల్స్‌ను కంబైన్ చేస్తుందని వివరించారు. విద్యార్థులకు మల్టిపుల్ ఆప్షన్లు అందిస్తుందని వివరించారు.
ఆర్థిక అంశాలతో పాటు కంప్యూటర్ కోడింగ్
ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఫిన్‌టెక్ ప్రపంచం గురించి విస్తృత దృక్పథం ఉంటుందని ఫ్రాంకో ఫియోర్డెలిసి అన్నారు. ఆర్థిక అంశాలతోపాటు కోడింగ్‌లో కూడా శిక్షణ పొందుతారని, పైథాన్‌లో ప్రోగ్రామింగ్ చేయడం నేర్చుకుంటారని చెప్పారు. కాబట్టి విద్యార్థులు ఇన్వెస్ట్మెంట్స్, అసెట్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, రిస్క్ మేనేజ్మెంట్, మానిటరీ పాలసీలతో సహా తమకు అత్యంత ఆసక్తి ఉన్న ప్రాంతంలోకి వెళ్లడానికి, వారి ఆసక్తికి సంబంధించిన మోడ్యూల్స్ ఎంచుకోవచ్చని ఫ్రాంకో పేర్కొన్నారు.
ఫైనాన్షియల్ రంగంలో పెను మార్పులు
ప్రొఫెసర్ ఫియోర్డెలిసి మాట్లాడుతూ.. ఆర్థిక రంగంలో టెక్నాలజీ వేగం, ప్రభావం పెరుగుతోందని తెలిపారు. ఫిన్‌టెక్ అనేది ఫైనాన్స్‌లో కొత్త నమూనా అని చెప్పారు. ప్రారంభంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ డెలివరీ చేయడంపై టెక్నాలజీ ప్రభావం చూపిందన్నారు. కానీ ఇప్పుడు అది కొత్త ఫైనాన్షియల్ ప్రొడక్టులు, కొత్త కరెన్సీలు, కొత్త ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజ్, చివరికి కొత్త ఫైనాన్షియల్ సంస్థలను క్రియేట్ చేసిందని అన్నారు. సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తున్న సంస్థలు, కొత్త వాటితో పోటీ పడుతున్నాయన్నారు. ఆర్థిక లావాదేవీల పరిమాణంలో కొత్త సంస్థలు చిన్నవే అయినా.. విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఎప్పటికైనా సంప్రదాయ ఆర్థిక వ్యవస్థలకు ముప్పు తప్పదని అన్నారు. రెగ్యులేటర్లు కూడా టెక్నాలజీ తీసుకొస్తున్న మార్పులను అనుసరిస్తున్నాయని చెప్పారు. కొత్త నియంత్రణ, పర్యవేక్షణ అవసరమైందన్నారు. ఇండియాలో డిజిటల్ రూపీ వంటి ప్రత్యామ్నాయాలను తీసుకొస్తున్నాయని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS