UNION BUDGET 2020 TOP 100 INSTITUTIONS OF INDIA TO OFFER FULL FLEDGED ONLINE DEGREE COURSES SOON SS
Union Budget 2020: కాలేజీకి వెళ్లకుండానే డిగ్రీ... ఆన్లైన్లో కోర్సులు...
Union Budget 2020: కాలేజీకి వెళ్లకుండానే డిగ్రీ... ఆన్లైన్లో కోర్సులు...
(ప్రతీకాత్మక చిత్రం)
Union Budget 2020 | మార్చి 2021 నాటికి అప్రెంటీస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు కూడా రాబోతున్నాయి. నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనుంది కేంద్రం.
విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్లైన్లోనే డిగ్రీ పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది. ఆన్లైన్లో పూర్తి స్థాయి డిగ్రీ కోర్సుల్ని అందించే అవకాశాన్ని దేశంలోని టాప్ 100 విద్యా సంస్థలకు ఇవ్వనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారతదేశంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సుల్ని ఆన్లైన్లో అందించేలా చర్యలు తీసుకోబోతోంది. అంతేకాదు... బడ్జెట్లో విద్యారంగానికి అనేక వరాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. విద్యారంగానికి రూ.99,300 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి రూ.3000 కోట్లు కేటాయించింది కేంద్రం. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ త్వరలో ప్రకటించనుంది. ఇందుకోసం ఇప్పటికే 2 లక్షల సలహాలు వచ్చాయి.
మార్చి 2021 నాటికి అప్రెంటీస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు కూడా రాబోతున్నాయి. నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనుంది కేంద్రం. వైద్యుల కొరతను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఆస్పత్రులకు అనుబంధంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనుంది. విదేశాల్లో టీచర్లు, పారామెడికల్ స్టాఫ్, నర్సులకు డిమాండ్ ఉన్నా, అందుకు స్కిల్స్ లేవని, వారికి బ్రిడ్జి కోర్స్ అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించనుంది కేంద్రం. ఇప్పటివరకు అభ్యర్థులు ఆ ఉద్యోగాల కోసం వేర్వేరు పరీక్షలు రాస్తున్నారు. ఇందుకోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేయనుంది. విద్యారంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు తెరవనుంది కేంద్రం.