టాలెంటెడ్ ఫారెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు యునైటెడ్ కింగ్డమ్ (UK) ఒక కొత్త వీసా ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. హై పొటెన్షియల్ ఇండివిడ్యువల్ (HPI) వీసా ప్రోగ్రామ్ మే 30 నుంచి అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ స్వీకరిస్తుంది. కొత్త వీసాలో భాగంగా, హై-స్కిల్డ్ ఫారిన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ల (High-skilled Foreign University Graduates)ను రెండు-మూడు ఏళ్ల పాటు యూకేలో పని చేయడానికి, ఉండటానికి అనుమతిస్తారు. ఈ వీసా కోసం గ్రాడ్యుయేట్లకు ఎలాంటి జాబ్ ఆఫర్ జాబ్ ఆఫర్ లేదా స్పాన్సర్షిప్ అవసరం లేదు. గ్రాడ్యుయేట్ల డిగ్రీ స్థాయిని బట్టి వర్క్ చేసే కాలాన్ని, స్టే చేసే కాలాన్ని నిర్ణయిస్తారు. కొత్త వీసా ప్రోగ్రామ్ వల్ల యూకేలోని ఎంప్లాయర్లకు స్పాన్సర్షిప్ ఫీజు ఆదా అవుతుంది. ఎందుకంటే వీరు ఎలాంటి స్పాన్సర్షిప్ చెల్లించకుండానే హెచ్పీఐ (HPI) వీసా హోల్డర్లను హైర్ చేసుకోగలుగుతారు.
యూకేకి చేరుకున్న తర్వాత, వీసా హోల్డర్లు ఏదైనా ఇండస్ట్రీలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్ మంత్రి కెవిన్ ఫోస్టర్ ఈ ప్రోగ్రామ్ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. “టాలెంటెడ్ ఫారెన్ స్టూడెంట్స్ కొత్త హై పొటెన్షియల్ ఇండివిడ్యువల్ ప్రోగ్రామ్ ద్వారా యూకే రావడం మరింత సులభం అవుతుంది. అకడమిక్ అచీవ్మెంట్ ద్వారా ఇప్పటికే తమ టాలెంట్ చాటుకున్న వారికి ముందస్తు జాబ్ ఆఫర్ లేకుండానే యూకేకి రావడానికి ఇది వీలు కల్పిస్తుంది." అని అన్నారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
గత ఐదేళ్లలో యూకే వెలుపల ఉన్న క్వాలిఫైయింగ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినవారు వీసా ప్రోగ్రామ్ కోసం అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ల నేషనాలిటీ ఏదైనా అవ్వచ్చు. కనీసం 18 ఏళ్లు నిండిన వారై ఉండాలి. దరఖాస్తుదారులు ఏటా Gov.uk వెబ్సైట్లో బ్రిటిష్ ప్రభుత్వం లిస్ట్ చేసే ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి డిగ్రీని కలిగి ఉండాలి. ఈ లిస్టులో యూకే వెలుపల ఉన్న టాప్ యూనివర్సిటీలు కనిపిస్తాయి.
అలానే ఇవి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, Quacquarelli Symonds వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, వరల్డ్ యూనివర్సిటీ అకడమిక్ ర్యాంకింగ్ వంటి 3 వరల్డ్ ర్యాంకింగ్స్ లో కనీసం రెండింటిలో టాప్ 50లో కనిపిస్తాయి. ఈ యూనివర్సిటీల పేర్లు ఏడాదికేడాది మారవచ్చు. కానీ యూఎస్ లోని హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; కెనడా యూనివర్శిటీ ఆఫ్ టొరంటో; చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ, సింగువా యూనివర్సిటీ; జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీ ఈ జాబితాలో ప్రతిసారీ కనిపిస్తుంటాయి.
క్రైటీరియా
వీసా కోసం అర్హత సాధించడానికి మీకు జాబ్ ఆఫర్ లేదా స్పాన్సర్షిప్ అవసరం లేదు. మీరు యూకేకి వెళ్లి స్వయం ఉపాధి లేదా వాలంటీర్‌గా పని చేసుకోవచ్చు. ఈ వీసా ఒక్కసారి మాత్రమే మంజూరు చేస్తారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్ వీసా కలిగి ఉన్న వారికి ఇది అందుబాటులో ఉండదు.
ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్
మీ డిగ్రీ ఇంగ్లీష్ భాషలో పూర్తి చేయకపోతే.. మీరు కనీసం B1 పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. డిగ్రీ ఇంగ్లీషులో పూర్తి చేసినట్లయితే మీరు అవార్డింగ్ బాడీ నుంచి సర్టిఫికేట్ లేదా యూనివర్సిటీ ట్రాన్స్క్రిప్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యూకే వెలుపల డిగ్రీని పొందినట్లయితే, ఆ డిగ్రీ యూకేలోని బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డాక్టరేట్ డిగ్రీకి అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని మీరు Ecctis నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఈ వీసా ధర £715 (దాదాపు రూ.67,895)గా నిర్ణయించారు.
ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్
మీరు దరఖాస్తు చేయడానికి 31 రోజుల కంటే ముందు 28 రోజుల వ్యవధి పాటు మీ బ్యాంక్ ఖాతాలో కనీసం £1,270 పౌండ్లకు సమానమైన మొత్తాన్ని చూపవలసి ఉంటుంది. మీరు 12 నెలల కంటే ఎక్కువ కాలం పాటు యూకేలో నివసిస్తుంటే, మీరు ఈ అవసరాన్ని తీర్చాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
గ్రాడ్యుయేట్ వీసా నుంచి ఇది ఎలా భిన్నంగా ఉంటుంది?
హెచ్పీఐ వీసా ప్రత్యేకంగా యూకే వెలుపల ఉన్న పాఠశాలల గ్రాడ్యుయేట్లకు అందుబాటులో ఉంటుంది. యూకే గ్రాడ్యుయేట్ వీసా యూకేలో డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తులు గ్రాడ్యుయేషన్ తర్వాత కనీసం రెండేళ్లపాటు ఆ దేశంలోనే ఉండేందుకు అనుమతిస్తుంది.
వీసా గడువు
బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉన్న గ్రాడ్యుయేట్లకు రెండేళ్ల వీసా అందిస్తారు. పీహెచ్డీ లేదా ఇతర డాక్టరల్ స్థాయి గ్రాడ్యుయేట్లు మూడేళ్లపాటు చెల్లుబాటయ్యే వీసాలను పొందుతారు.
డిపెండెంట్స్?
అభ్యర్థులు తమ భర్త లేదా భార్య లేదా సివిల్ పార్ట్నర్ లేదా అన్-మ్యారీడ్ పార్ట్నర్ను యూకేకి తీసుకురావచ్చు. లేదా మీపై ఆధారపడిన 18 ఏళ్లలోపు పిల్లల వంటి వారిని మీరు తీసుకురావచ్చు. అయితే, అన్-మ్యారీడ్ పార్ట్నర్తో కనీసం రెండు సంవత్సరాలు కలిసి జీవించినట్లు చూపించవలసి ఉంటుంది. వారి సంబంధం నిజమైనదని తెలియజేయాల్సి ఉంటుంది.
మీ వీసా గడువు ముగిసిన తర్వాత... మీరు శాశ్వత నివాసం లేదా పర్మినెంట్ రెసిడెన్సీ కోసం నేరుగా దరఖాస్తు చేయలేరు. బదులుగా, మీ వీసా గడువు ముగిసేలోపు, మీరు నైపుణ్యం కలిగిన వర్కర్, స్టార్ట్-అప్, ఇన్నోవేటర్, అసాధారణమైన ప్రతిభ లేదా స్కేల్-అప్ రూట్ కింద పర్మిట్లకు మారవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, United Kingdom, Visa