UK ANNOUNCES 75 SCHOLARSHIPS FOR INDIAN STUDENTS ON INDEPENDENCE UMG GH
UK Scholarships: ఇండియన్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. మాస్టర్స్ ప్రోగ్రామ్ కోసం 75 స్కాలర్షిప్స్ ప్రకటించిన యూకే..!
ప్రతీకాత్మక చిత్రం
ఇండియన్ స్టూడెంట్స్‌కు బ్రిటన్ గుడ్‌న్యూస్ చెప్పింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో భారతీయ విద్యార్థుల కోసం పూర్తి నిధులతో కూడిన 75 స్కాలర్షిప్లను అందించనున్నట్లు ప్రకటించింది. ఒక సంవత్సరం పాటు జరిగే మాస్టర్స్ ప్రోగ్రామ్ ?
ఇండియన్ స్టూడెంట్స్ (Indian Students)కు బ్రిటన్ (Britan) గుడ్‌న్యూస్ చెప్పింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో భారతీయ విద్యార్థుల కోసం పూర్తి నిధులతో కూడిన 75 స్కాలర్‌షిప్‌ల (scholarships)ను అందించనున్నట్లు ప్రకటించింది. ఒక సంవత్సరం పాటు జరిగే మాస్టర్స్ ప్రోగ్రామ్ కోసం వీటిని అందిస్తోంది. ఈ మేరకు భారతదేశంలోని వివిధ వ్యాపార సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు యూకే (UK) ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు ఒక సంవత్సరం మాస్టర్స్ ప్రోగ్రామ్ కోసం యూకే అందించిన పూర్తిస్థాయి స్కాలర్‌షిప్‌లలో ఈసారి ప్రకటించినవే అత్యధికం. భారత వ్యాపార సంస్థలైన హెచ్ఎస్బీసీ, పియర్సన్ ఇండియా, హిందుస్తాన్ యూనిలీవర్, టాటా సన్స్, డ్యుయోలింగో(Duolingo) వంటి సంస్థలు ఈ స్కాలర్‌షిప్‌లకు సపోర్ట్ చేస్తున్నాయి.
ఒక సంవత్సరం మాస్టర్స్ ప్రోగ్రామ్ కోసం చెవెనింగ్(Chevening) స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే సెప్టెంబర్ నుంచి గుర్తింపు పొందిన బ్రిటిష్ యూనివర్సిటీల్లో ఏదైనా సబ్జెక్టుపై స్టడీ చేసే అవకాశం ఉంటుంది. భారతదేశంలోని బ్రిటిష్ కౌన్సిల్.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM)లో మహిళల కోసం 18 స్కాలర్షిప్లను అందిస్తోంది. ఇవి యూకేలోని 150 కంటే ఎక్కువ యూనివర్సిటీల్లో 12,000 కంటే ఎక్కువ కోర్సులను కవర్ చేస్తాయి. అంతేకాకుండా బ్రిటిష్ కౌన్సిల్ ఆరు ఇంగ్లిష్ స్కాలర్షిప్లను కూడా అదనంగా అందిస్తోంది.
మొత్తం 75 స్కాలర్‌షిప్‌లలో HSBC ఇండియా 15 స్కాలర్షిప్లను స్పాన్సర్ చేస్తుంది. పియర్సన్ ఇండియా రెండు, హిందుస్తాన్ యూనిలీవర్, టాటా సన్స్, డ్యుయోలింగో ఒకటి చొప్పున స్పాన్సర్ చేస్తున్నాయి. ఒక సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం ట్యూషన్ ఫీజు, రోజువారి ఖర్చులు, ప్రయాణ ఖర్చులు కూడా ఈ స్కాలర్ షిప్‌లు కవర్ చేయనున్నాయి. అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్‌లకు అర్హత సాధించాలంటే కనీసం రెండేళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరి.
బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ మాట్లాడుతూ.. స్కాలర్షిప్లను గొప్ప మైలురాయిగా అభివర్ణించారు. యూకేలో అత్యుత్తమమైన యూనివర్సిటీల్లో చదువుకోవడానికి భారతీయ విద్యార్థులకు 75 స్కాలర్షిప్లను ప్రకటించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. దాదాపు 30% చెవెనింగ్ స్కాలర్స్ భారత్‌లోని చిన్న నగరాల నుంచి వస్తున్నారని చెప్పారు. దీంతో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ వైవిధ్యంగా మారిందన్నారు. హెచ్ఎస్బీసీ సీఈవో హితేంద్ర మాట్లాడుతూ.. చెవెనింగ్ హెచ్ఎస్బీసీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లక్ష్యం, ప్రపంచ స్థాయి విద్యా సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి యువకులను ప్రోత్సహిస్తామన్నారు. తద్వారా వారు లీడర్లుగా, నిర్ణయాధికారులుగా మారే అవకాశం ఉంటుందన్నారు.
కాగా, మార్చితో ముగిసిన 2022 సంవత్సరంలో భారతీయులకు దాదాపు 108,000 స్టూడెంట్ వీసాలు జారీ చేశామని, ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అని బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది. Chevening అనేది 1983లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంతర్జాతీయ అవార్డుల పథకం. దీని ద్వారా 150 దేశాలలోని విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను అందిస్తున్నారు. చెవెనింగ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటివరకు దాదాపు 3,500 కంటే ఎక్కువ భారతీయ విద్యార్థులు లబ్ధి పొందారు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.