అంతర్జాతీయ విద్యార్థులను భారత్ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఇండియన్ యూనివర్సిటీలలో భారతీయ వారసత్వం, సంస్కృతి (Indian Heritage and Culture) ఆధారంగా కోర్సులను ప్రవేశపెట్టడానికి ప్రతిపాదిత మార్గదర్శకాల (Draft guidelines)ను విడుదల చేసింది. ఈ చర్య భారతీయ వారసత్వం, సంస్కృతిని ప్రోత్సహించే జాతీయ విద్యా విధాన (NEP-2020) లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది. త్వరలోనే తీసుకురానున్న కోర్సులలో ఆయుర్వేదం, శాస్త్రీయ నృత్య రూపాలు (Classical Dance Forms), భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, సార్వత్రిక మానవ విలువలు (Universal Human Values), వేద గణితం, యోగా వంటి సబ్జెక్టులు ఉంటాయి.
మూడు లెవల్స్‌లో కోర్సులు
ఈ కోర్సుల కోసం ఉన్నత విద్యాసంస్థలు అమలు చేయగల మార్గదర్శకాలను UGC ప్రతిపాదించింది. కోర్సులు మల్టీపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతో మాడ్యులర్‌గా ఉంటాయి. అంటే సబ్జెక్టుకు సంబంధించి చిన్న యూనిట్స్‌ను సపరేట్‌గా లేదా కంబైన్డ్‌గా నేర్చుకోవచ్చు. అలానే ఈ కోర్సులు క్రెడిట్ ఆధారితంగా ఉంటాయి. ఇంట్రడక్టరీ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్‌డ్ లెవెల్ అనే మూడు లెవెల్స్‌లో ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయి. తద్వారా ఎవరైనా సరే ఈ కోర్సుల్లో చేరి ఆయుర్వేదం తదితర సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవచ్చు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు నిర్దిష్ట అర్హత షరతులను రూపొందించడానికి ఉన్నత విద్యాసంస్థల (HEIs)ను యూజీసీ అనుమతించింది.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి
ఈ కోర్సుల మొత్తం లేదా సమగ్ర వ్యవధి 60 గంటలు ఉంటుంది. సౌకర్యవంతమైన, హైబ్రిడ్ (ఆన్‌లైన్-ఆఫ్‌లైన్) మోడ్ ద్వారా ఈ కోర్సులను నేర్చుకోవచ్చు. సబ్జెక్టుకు సంబంధించిన సంప్రదాయం, నేపథ్యం, ముఖ్యమైన సాహిత్యం, గ్రంథాలు, పండితుల రచనలు, ప్రాథమిక సూత్రాలు, ఆలోచనా విధానాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సంస్థలు కోర్సు పాఠ్యాంశాలను అభివృద్ధి చేయాలని యూజీసీ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఉన్నత విద్యా సంస్థలు ఆధునిక అభ్యాస పద్ధతులకు అనుగుణంగా కోర్సు మాడ్యూల్స్ రూపొందించాల్సి ఉంటుంది. అలానే కోర్సులు వాస్తవ-ప్రపంచ పరిస్థితులలో పాటించగల ఆచరణాత్మక నైపుణ్యాలను బోధించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కోర్సు మెటీరియల్ ప్రస్తుత నాలెడ్జ్ సిస్టమ్‌లకు దగ్గరగా ఉండాలి.
కోర్సు అనంతరం సర్టిఫికెట్లు అందజేత
కోర్సుల బోధనా పద్ధతులలో ఉపన్యాసాలు, ఆడియో-వీడియో కంటెంట్, గ్రూప్ డిస్కషన్స్, ప్రాక్టికల్ సెషన్లు, ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి. ఇక విద్యార్థుల పనితీరును, అవార్డు క్రెడిట్లను అంచనా వేయడానికి కంటిన్యూస్ కాంప్రహెన్‌సివ్ అసెస్‌మెంట్ (CCA), పిరియాడిక్ అసెస్‌మెంట్ అనే రెండు విభిన్న రకాల అసెస్‌మెంట్లను ఉపయోగిస్తారు. UGC ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం, విద్యార్థులు కోర్సును పూర్తి చేసిన తర్వాత, వారు ఉన్నత విద్యా సంస్థల నుంచి సర్టిఫికెట్ అందుకుంటారు. ఈ సర్టిఫికెట్లు భారత ప్రభుత్వం నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (NAD) ద్వారా డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, University Grants Commission