యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రీషెడ్యూల్ చేసింది. ఈ పరీక్షలను అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 11 మధ్య నిర్వహించాలని తొలుత భావించింది. అయితే ఈ తేదీల్లో కొన్ని జాతీయ పరీక్షలు ఉన్నందున కొత్త తేదీలను ప్రకటించింది. దీనికి సంబంధించి తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఇప్పుడు అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 8 మధ్య మొదటి బ్లాక్‌లో, తిరిగి అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 19 మధ్య మరో బ్లాక్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను www.ugcnet.nta.nic.in లో పొందుపర్చినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. సెప్టెంబర్ 5తోనే యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే దరఖాస్తు ఫారమ్‌లో తప్పులను సరిచేసుకునేందుకు సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 12 మధ్య ఎడిట్ విండో అందుబాటులో ఉంటుందని తెలిపింది. సవరించిన తేదీలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఎన్‌టీఏ హెల్ప్‌డెస్క్ 011-40759000 లేదా ugcnet@nta.ac.in కి మెయిల్ చేయాలని కోరింది.
డిసెంబర్, జూన్ రెండు సెషన్ల విలీనం..
యూజీసీ నెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు భారతీయ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. కాగా, యూజీసీ నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులను మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించుకోవాలని ఏఐసీటీఈ అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలిచ్చింది. దీంతో ఈ పరీక్షలకు ప్రాధాన్యత ఏర్పడింది. అందువల్ల గతంలో కంటే ఈ సారి పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
వయోపరిమితి విషయానికి వస్తే.. జేఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గరిష్ట వయస్సు 31 సంవత్సరాలు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విషయంలో గరిష్ట వయోపరిమితి లేదు. ఈ పోటీ పరీక్ష సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. అయితే 2020 డిసెంబర్‌లో కరోనావైరస్ ప్రభావం కారణంగా పరీక్ష వాయిదా పడుతూ వస్తోంది. ఫలితంగా జూన్ 2021 యూజీసీనెట్ షెడ్యూల్ విడుదల కూడా ఆలస్యం అయింది. కాబట్టి ఈ రెండు సెషన్లను విలీనం చేసి ఒకేసారి నిర్వహించనుంది. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతుంది. యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు పరీక్ష తేదీకి కొన్ని రోజుల ముందు విడుదలవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: UGC NET