కరోనా తరువాత ప్రవేశ పరీక్షలు వరుసగా జరుగుతున్నాయి. తాజాగా జాతీయ స్థాయిలో నిర్వహించే యూజీసీ నెట్ (UGC NET) 2021 పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఈ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 5 వరకు వివిధ దశల్లో జరగనుంది. ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దేశంలోని వివిధ పరీక్ష కేంద్రాలలో నిర్వహిస్తుంది. UGC NET- 2021 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పరీక్ష రోజు పాటించాల్సిన మార్గదర్శకాలను అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in ద్వారా తెలుసుకోవాలని ఎన్‌టీఏ కోరింది. మహమ్మారి నేపథ్యంలో అభ్యర్థులందరూ కచ్చితంగా కరోనా మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది.
నవంబర్ 20 నుంచి 24 వరకు జరిగే పరీక్షల కోసమే ఎన్‌టీఏ అడ్మిట్‌కార్డులను విడుదల చేసింది. మిగిలిన తేదీల్లో UGC NET పరీక్ష రాసేవారికి అడ్మిట్ కార్డ్‌లను NTA ఇంకా విడుదల చేయలేదు. పరీక్షకు హాజరు కావడానికి అడ్మిట్ కార్డులు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. UGC NET- 2021 పరీక్ష రెండు షిఫ్టులలో జరుగుతుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల సెకండ్ షిఫ్ట్ ఉంటుంది. షిఫ్ట్ 1లోని పరీక్ష పేపర్ విద్యార్థులందరికీ ఒకేలా ఉంటుంది. అయితే షిఫ్ట్ 2 పేపర్ పీజీ సబ్జెక్టులకు సంబంధించినది. రేపటి నుంచి నెట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో.. పరీక్షకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను చూద్దాం.
UGC NET 2021 పరీక్ష రోజు పాటించాల్సిన మార్గదర్శకాలు, డ్రెస్ కోడ్
- వెరిఫికేషన్ కోసం అభ్యర్థులందరూ అడ్మిట్ కార్డులతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏవైనా రెండు ఫోటో ID కార్డులను ఎగ్జామినేషన్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.
- పరీక్ష రిపోర్టింగ్ సమయానికి కనీసం 30 నిమిషాల ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
- UGC NET 2021 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఈ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు కాబట్టి.. అందుకు అభ్యర్థులు సన్నద్ధం కావాలి.
- పరీక్ష కేంద్రంలోని సిబ్బందికి అభ్యర్థులు అన్ని విధాలుగా సహకరించాలి. దురుసు ప్రవర్తన కారణంగా డిబార్ అయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.
- మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్లు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను పరీక్ష హాల్‌లోకి అనుమతించరు.
- OMR షీట్ నింపడానికి అభ్యర్థులు తప్పనిసరిగా బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను తీసుకెళ్లాలి.
- అభ్యర్థులు ఫుల్ షూస్, ఫ్యాన్సీ ఆభరణాలు, ఇతర డెకరేటివ్ వస్తువులు ధరించకూడదు.
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలి. హ్యాండ్ శానిటైజర్ బాటిల్‌ను తీసుకెళ్లాలి. ఎగ్జామ్ సెంటర్ లోపల, బయట కూడా సామాజిక దూరాన్ని పాటించాలి.
ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు UGCకి అనుబంధంగా ఉన్న కళాశాలలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. UGC NET 2021 పరీక్షకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: UGC NET